Share News

Chakali Ilamma: ఈ బతుకమ్మ బిడ్డ రైతాంగ పోరాట మాతృమూర్తి

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:36 AM

ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని, బహుజనులు ఎదుర్కొన్న వివక్షను, మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్యజ్యోతి చాకలి ఐలమ్మ. ఆమె పోరాటం కేవలం భూమి కోసం జరిపింది కాదు

Chakali Ilamma: ఈ బతుకమ్మ బిడ్డ రైతాంగ పోరాట మాతృమూర్తి

ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని, బహుజనులు ఎదుర్కొన్న వివక్షను, మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్యజ్యోతి చాకలి ఐలమ్మ. ఆమె పోరాటం కేవలం భూమి కోసం జరిపింది కాదు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం జరిగిన మహాసంగ్రామం. బానిసత్వానికి తలొగ్గకుండా తాము సాగుచేసిన భూమిపై హక్కు సాధించాలనే సంకల్పంతో నాడు పేదలు, రైతులు, కూలీలు సంఘటితమయ్యారు. ఈ పోరాటంలో ఐలమ్మ ముందు నడిచి, విజయం సాధించింది. అటువంటి ఐలమ్మ జయంతిని జరుపుకోవడం తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని తిరిగి ప్రజల్లో నాటడమే. ఆ స్ఫూర్తి నేడు కూడా సామాజిక న్యాయం కోసం, భూహక్కుల కోసం, సమాన హక్కుల కోసం పోరాడే వారికి ప్రేరణనిస్తుంది. రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను గుర్తించడం ద్వారా మహిళా నాయకత్వాన్ని, అణగారిన వర్గాల పోరాట గాథలను గౌరవించడం అవుతుంది. అందువల్ల ఐలమ్మ జయంతి తెలంగాణ ప్రజలకు సామాజిక సమానత్వం, రైతాంగ హక్కులు, స్త్రీ శక్తి అనే త్రివేణి సంగమంను గుర్తుచేసే ప్రేరణాత్మక దినోత్సవం.

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ నాడు 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా ఐలమ్మ జన్మించింది. పేద కుటుంబంలో జన్మించిన ఆమె, కష్టాలే తోడుగా పెరిగింది. కుటుంబం మొత్తం రోజువారీ కూలి పనులు, ఇతరుల పొలాల్లో కూలి చేయడం, బట్టలు ఉతకడంతో జీవనాధారాన్ని కొనసాగించేది. అణచివేత, పేదరికపు జీవన కఠోరత, దోపిడీలను తన కళ్ళముందే చూసి పెరిగిన ఐలమ్మ, చిన్న వయసులోనే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యాన్ని సొంతం చేసుకుంది. ఆ కష్టాలే ఆమెను ఒక పోరాటకారిణిగా తీర్చిదిద్దాయి. తలవంచని స్వభావం, పోరాడే ధైర్యం చిన్నప్పుడే ఆమెలో రూపుదిద్దుకున్నాయి.


ఐలమ్మకు 11 ఏళ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహమైంది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. కుటుంబానికి జీవనాధారం దొరల ఇంట ఊడిగం, ఊరి జనాల బట్టల ఉతుకుడే. కానీ ఈ ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం గగనమైంది. ఎదుగుతున్న కొడుకులతో భూమి సాగుచేసి, కష్టాన్ని కొంత తగ్గించుకోవాలన్న ఆలోచనతో పాలకుర్తి సమీపంలోని మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని మఖ్తకు తీసుకుంది. ఇది విస్నూర్‌ దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపైంది. ‘‘వ్యవసాయం నా జీవనాధారం, దొరల గడీలో వెట్టిచేయను’’ అని ఐలమ్మ స్పష్టంగా చెప్పింది. 1944లో వెట్టిచాకిరీని నిషేధించాలని పిలుపునిచ్చిన ఆంధ్ర మహాసభలో చేరి కష్టజీవులను సమీకరించి పోరాటానికి సిద్ధం చేసింది. ఒక ఆడది ముందుకొచ్చి దొరల ఆధిపత్యాన్ని సవాల్ చేయడాన్ని భరించలేక రామచంద్రారెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను గూండాలతో కాజేయాలని యత్నించాడు. కానీ సంగపోళ్ల అండతో ఐలమ్మ గూండాలను తిప్పికొట్టింది. కాపుకొచ్చిన పంటను సురక్షితంగా ఇంటికి చేర్చింది. ఆ సమయంలో ఆమె ‘‘కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి సింహంలా గర్జించిన తీరు, నా కళ్లలో ఇప్పటికీ కదలాడుతోంది’’ అని విప్లవ యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి తన ఆత్మకథ ‘భూమిక’లో వర్ణించాడు. తెలంగాణా రైతాంగ పోరాట చరిత్రలో ఐలమ్మ పేరు ఓ వెలుగు దీపంలా నిలిచిపోయింది.

ఆంధ్ర మహాసభ (సంగం)లో చేరిన ఆమె అణగారిన కూలీలు, రైతులు, మహిళలను కలుపుకొని బలమైన రైతు సంఘాన్ని నిర్మించింది. దొరల ఆధిపత్యాన్ని ఎదిరించి, రైతుల పోరాటానికి తల్లిలా నిలిచింది. ఈ పోరాటంలో ఐలమ్మ తన కుటుంబాన్నే త్యాగం చేసింది. ఒక కుమారుడిని కోల్పోయింది. భర్తతో పాటు మరో ఇద్దరు కుమారులు జైలు పాలయ్యారు. అయినా వెనకడుగు వేయకుండా, జైలులో ఉన్న వారిని కలవడానికి ఒంటరిగా నడిచి వెళ్లేది. 1946–51 మధ్య విప్లవ తెలంగాణ రైతాంగ పోరాటం ఉధృతమైంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వేలాది రైతులు సంగంలో చేరారు. వీరి ధైర్యానికి ఆదర్శంగా నిలిచింది ఐలమ్మ పోరాటం.


ఐలమ్మ పాలకుర్తి పొలాన్ని, పండిన వరి ధాన్యాన్ని రక్షించుకోవాలని నిలబడ్డప్పుడు అది ఒక వ్యక్తి కోసమే కాదు సమాజం కోసం నిలబడ్డ ఒక మహిళా స్వరం, దొర పట్ల ఒక స్పష్టమైన సవాల్ అయ్యింది. నల్లగొండ జిల్లా నాయకత్వం నాటి పరిస్థితులను విచారించి భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు వంటి నేతలు పాలకుర్తికి చేరి కార్యకర్తలలో ధైర్యసాహసాన్ని పూయించారు. దేశ్‌ముఖ్ పంపిన నాలుగు వందల గూండాల బృందాన్ని, అనుచరులను ఐలమ్మ కుటుంబం, స్థానిక వలంటీర్లు, సంఘ నాయకులు ఐక్యంగా ఎదుర్కొని, వారిని పొలంలో అడుగు పెట్టనీయకుండా చిత్తశుద్ధితో నిలిచారు. గూండాలు ఊరు వదిలిపోవడంతో ఐలమ్మపై ప్రజాభిమానం మొదలైంది. దొరల దౌర్జన్యాన్ని ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న ఆమెను పాలకుర్తి ప్రజలంతా ‘బాలనాగమ్మ’ అని పిలిచారు.

పుచ్చలపల్లి సుందరయ్య పాలకుర్తికి వచ్చి ఐలమ్మ ఇంట్లో అరుణ పతాకాన్ని ఎగురవేసి, ఆమె కుటుంబంతో భోజనం చేసి, సోమనాథాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సంఘటన ఐలమ్మ పోరాటానికి చరిత్రాత్మక ముద్ర వేసింది. ఐలమ్మ జీవితం– ధైర్యం, పట్టుదల, సమూహబలం, మహిళా నాయకత్వం, సామాజిక న్యాయం, రైతాంగ ప్రేమ వంటి విలువలను తెలంగాణ సమాజానికి అందిస్తోంది. ప్రతి తరానికి ఇది ఒక ప్రేరణ, మార్గదర్శకం. మహిళా విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ఆమె పేరు పెట్టడం సంతోషకరమైన విషయం.

ప్రొఫెసర్ సూర్యాధనంజయ్

వైస్ చాన్సలర్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం

(నేడు చాకలి ఐలమ్మ జయంతి)

ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 26 , 2025 | 02:36 AM