Share News

MGNREGA Crisis: గాంధీ ఆశయాలపై కేంద్రం తూటా

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:18 AM

గ్రామీణ భారతదేశానికి ఊపిరిలా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు నిర్వీర్యమవుతోంది. ఇది యాదృచ్ఛిక పరిపాలనా వైఫల్యం కాదు. ఉద్దేశ్యపూర్వక విధాన...

MGNREGA Crisis: గాంధీ ఆశయాలపై కేంద్రం తూటా

గ్రామీణ భారతదేశానికి ఊపిరిలా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు నిర్వీర్యమవుతోంది. ఇది యాదృచ్ఛిక పరిపాలనా వైఫల్యం కాదు. ఉద్దేశ్యపూర్వక విధాన నిర్ణయాల ఫలితం. పేదలకు పని హక్కు ఇచ్చే ఈ పథకాన్ని క్రమంగా ఊపిరాడనీయకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వ అసలైన ఉద్దేశ్యం అనిపిస్తోంది. మహాత్మాగాంధీ పేరు పెట్టుకుని అమలు చేస్తున్న పథకాన్నే బలహీనపరచడం కన్నా పెద్ద ద్రోహం ఇంకేముంటుంది? గ్రామాలే భారతదేశానికి పునాది అని గాంధీ అన్నారు. పేదల శ్రమకు గౌరవం కావాలన్నారు. ఆకలి మానవత్వానికి అవమానం అని చెప్పారు. కానీ నేటి పాలనలో గాంధీ ఆశయాలకు సమాధి కడుతున్నారు.

గతంలో ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం నిధులు భరించేవి. ఇది పథకం సజావుగా నడవడానికి కీలకం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో కేంద్రం 60శాతం, రాష్ట్రాలు 40శాతం ఖర్చు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలు తమ 40శాతం వాటా ఇవ్వలేక చేతులెత్తేస్తాయి. అప్పుడు కేంద్రం ‘రాష్ట్రాలు ఖర్చు చేయడం లేదు’ అని నెపం వేసే అవకాశం ఉంది. ఇది కపటత్వం కాకపోతే మరేమిటి? 15 రోజుల్లో వేతనం ఇవ్వాలన్న చట్టాన్ని కేంద్రం తానే ఉల్లంఘిస్తోంది. నెలల తరబడి జీతాలు రాకపోయినా ఎవరూ బాధ్యత వహించడం లేదు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు – పేదల శ్రమను దోచుకోవడమే. ఆధార్‌, బయోమెట్రిక్‌, ఆన్‌లైన్‌ విధానాలన్నీ– లీకేజీ అరికట్టడానికన్నా, పేదలను పథకం నుంచి బయటకు నెట్టడానికి పనికొస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ లేని కూలీకి పని లేదన్నట్టుగా వ్యవహరించడం, ఉపాధి హామీని హక్కు నుంచి దయగా మార్చడం ప్రమాదకరం. గాడ్సే ఒక్కసారే మహాత్మాగాంధీని శారీరకంగా చంపాడు. మోదీ ప్రభుత్వం మాత్రం గాంధీ ఆలోచనలను, పేదల పట్ల ఆయన నమ్మిన మానవత్వాన్ని, శ్రమ గౌరవాన్ని తన విధానాల ద్వారా రోజూ చంపుతోంది. ఇది ఒక్కసారిగా జరిగే హత్య కాదు. నెమ్మదిగా జరిగే, లోతుగా గాయపరచే వ్యవస్థాగత హత్య. పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. అందుకే నిధులు తగ్గిస్తూ, బాధ్యతలు మళ్లిస్తూ, సాంకేతిక అడ్డంకులు పెడుతూ నిశ్శబ్దంగా చంపుతున్నారు.


ఉపాధి హామీ నిర్వీర్యమైతే గ్రామీణ నిరుద్యోగం పెరుగుతుంది. వలసలు ఉధృతమవుతాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కూలిపోతుంది. పేదరికం మరింత లోతుగా మారుతుంది. ఇది అభివృద్ధి కాదు వెనుకడుగు. ఈ దేశానికి గాంధీ విధానాలు కావాలి. ఉపాధి హామీ పథకం దానం కాదు. అది హక్కు. ఆ హక్కును నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన బాధ్యతను స్వీకరించాలి. లేదంటే చరిత్రలో ఇది గాంధీ పేరు చెప్పుకుని గాంధీ ఆశయాలను హతమార్చిన పాలనగా నమోదు అవుతుంది.

రాంభూపాల్‌ రెడ్డి

ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ

ఇవి కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 24 , 2025 | 02:18 AM