Share News

కాల్పుల విరమణ సరైన వ్యూహమేనా

ABN , Publish Date - May 15 , 2025 | 02:16 AM

ఆపరేషన్ సిందూర్‌కు ముందు, తర్వాత జరిగిన అంతర్జాతీయ పరిణామాలు, ఇదే సమయంలో దేశీయంగా గత కొన్నాళ్లుగా నక్సలిజంపై కేంద్రం అనుసరిస్తున్న అణచివేత ధోరణి గమనించిన విశ్లేషకులకు మోదీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. సాగేచోట ఆధిపత్యం చెలాయించడం, సాగనిచోట రాజీకి రావడం...

కాల్పుల విరమణ సరైన వ్యూహమేనా

ఆపరేషన్ సిందూర్‌కు ముందు, తర్వాత జరిగిన అంతర్జాతీయ పరిణామాలు, ఇదే సమయంలో దేశీయంగా గత కొన్నాళ్లుగా నక్సలిజంపై కేంద్రం అనుసరిస్తున్న అణచివేత ధోరణి గమనించిన విశ్లేషకులకు మోదీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. సాగేచోట ఆధిపత్యం చెలాయించడం, సాగనిచోట రాజీకి రావడం... ఈ పద్ధతి ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఇంట మావోయిస్టుల మీద అప్రతిహతంగా గెలుస్తూ, అక్కడ ఉగ్రవాదం విషయంలో అర్ధాంతర కాల్పుల విరమణకు సిద్ధపడటం భారత ప్రభుత్వ ద్విముఖ విధానాన్ని చాటుతున్నది.

పహల్గామ్ ఉగ్రహింస తర్వాత పాకిస్థాన్‌పై వరుస దాడులతో సమర్థంగా విరుచుకుపడి, వెంటనే ఆకస్మిక అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించడం వల్ల, మన దేశం టెర్రరిజంపై బేషరతు ఆధిపత్యాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయిందని వస్తున్న విమర్శ అర్థరహితమైనదేమీ కాదు. ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌ సైనిక వ్యవస్థను పతనం అంచుకు తీసుకువచ్చింది. అలాంటి స్థితిలో, వ్యూహాత్మకంగా ప్రశ్నార్థకమైన నిర్ణయంతో, భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది.

పాకిస్థాన్‌ సైన్యం పాటించే అసమాన యుద్ధ సిద్ధాంతంపై నిర్ణయాత్మకమైన నష్టాన్ని కలగజేసే అరుదైన అవకాశాన్ని ఈ కాల్పుల విరమణ ద్వారా కోల్పోయామని, ఇది వ్యూహాత్మక తప్పిదమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరవయ్యవ శతాబ్దం చివరి నుంచి పాకిస్థాన్‌ సైన్యం కాపాడుతూ వచ్చిన ఉగ్రవాద సైద్ధాంతిక స్థావరాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడానికి ఇదొక మంచి అవకాశం అయ్యేది. దేశం లోపల నక్సలిజంపై చూపిస్తున్న కర్కశ, నిర్దయాత్మక విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏమైంది? ఎవరి ఒత్తిడికి లేదా ఏ భీతికి గురై ప్రధానమంత్రి మోదీ ఈ రకమైన వెనకడుగు వేశారు? మొన్నటి వరకూ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని శపథాలకు పోయిన పట్టుదల ‘‘ఇది యుద్ధాల యుగం కాదు’’ అనే నీతివాక్యాల స్థాయికి ఎలా దిగజారింది? అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారతదేశం తాత్కాలిక ప్రశాంతతను పొంది ఉండవచ్చు, కానీ అందుకు బదులు దీర్ఘకాలిక వ్యూహాత్మక లాభాన్ని త్యాగం చేసింది. అలా చేయడం ద్వారా జిహాదిస్ట్ భావజాలంతో బలపడుతున్న విరోధికి కొత్త ప్రాణం పోసింది.


భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడానికి మూలాలు 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో జనరల్ జియా–ఉల్–హక్ ఆధ్వర్యంలో స్థాపితమైన సైనిక సిద్ధాంతంలో ఉన్నాయి. భారత సైన్యం అఖండమైన సాంప్రదాయిక ఆధిపత్యాన్ని చవిచూసిన పాకిస్థాన్‌ చేసేదేం లేక అసమాన యుద్ధ వ్యూహాన్ని ఎంచుకుంది. మతపరమైన తీవ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని, కశ్మీర్‌లో ‘‘స్వాతంత్ర్య సమరయోధుల’’ ముసుగులో ఉగ్రవాద గ్రూపులను పెంచింది. దీనిని ‘‘వెయ్యి కోతలతో భారతదేశాన్ని రక్తసిక్తం చేయడం’’ అనే వ్యూహంగా పిలుస్తారు. దీన్ని పాటిస్తూ ఆ దేశం భారతదేశ పౌర, సైనిక సంస్థలపై నిరంతర నష్టాన్ని కలగజేసింది.

ఈ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం సమస్యాత్మక నిర్ణయమని అర్థమవుతుంది. ఆపరేషన్‌ సిందూర్‌ జంట ఆపరేషన్లు కీలకమైన సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని, పాకిస్థాన్‌ సంప్రదాయ సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీశాయని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌ సైన్యంలో నైతిక స్థైర్యం సన్నగిల్లిపోయింది. ప్రజల అసంతృప్తి వీధుల్లోకి వ్యాపించింది. ఆ దేశ అంతర్గత లోపాలు విస్తరించడం మొదలైంది (ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో). వ్యూహాత్మక ఆధిపత్యం చెలాయించే ఈ తరుణంలో కాల్పుల విరమణ ఉదారతను గానీ, సంయమనాన్ని గానీ సూచించదు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు సంవత్సరాల ప్రయత్నాలను ఈ నిర్ణయం దెబ్బతీసింది. ప్రత్యర్థి మళ్ళీ ధైర్యం పుంజుకునేట్టు చేసింది.


దేశాలు పైచేయి సాధించిన తర్వాత ఆ బలంతో దీర్ఘకాలిక శాంతిని పొందిన ఉదాహరణలు చరిత్ర నిండా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో భారతదేశం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. కాల్పుల విరమణ కారణంగా పాకిస్థాన్‌ తన దుష్ట సిద్ధాంతాల్ని విరమించుకుంటుందని ఆశించడం అమాయకత్వం మాత్రమే కాదు, ప్రమాదకరం కూడా. ఇటువంటి వ్యూహాల వల్ల పాకిస్థాన్‌ సైన్యం ఉగ్రవాదంపై ఆధారపడటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. గొప్ప శక్తులు స్నేహధర్మాన్ని అనుసరించి కాదు, స్వీయ ప్రయోజనాలను అనుసరించి వ్యవహరిస్తాయని భారతదేశం ఇప్పటికైనా గుర్తించాలి. బాహ్య ఒప్పందాలకు లోబడి జాతీయ ప్రయోజనాలను త్యజించే ఏ విదేశాంగ విధానమైనా దీర్ఘకాలికంగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. జాతీయ భద్రతకు ఆటంకం కలిగించే అంశాల విషయంలో న్యూఢిల్లీ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నొక్కి చెప్పడం నేర్చుకోవాలి.

దోర్బల బాలశేఖరశర్మ

ఇవి కూడా చదవండి..

BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 02:16 AM