Share News

Caste Census Debate: కులాల లెక్కలతో జాతి నిర్మాణమా

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:08 AM

కఠోర వాస్తవాలకు అక్షర రూపాలుగా, సిద్ధాంతాలుగా నిలిచినవి ఒకపట్టాన అంతరించిపోవు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు ఫ్రెంచ్‌ విప్లవంతో హోరెత్తాయి. అవి సాకారం కావాలన్న తపన మనుషుల్లో బలంగా ఉండబట్టే ఇప్పటికీ అవి మారుమోగుతున్నాయి. మనుషులను...

Caste Census Debate: కులాల లెక్కలతో జాతి నిర్మాణమా

కఠోర వాస్తవాలకు అక్షర రూపాలుగా, సిద్ధాంతాలుగా నిలిచినవి ఒకపట్టాన అంతరించిపోవు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు ఫ్రెంచ్‌ విప్లవంతో హోరెత్తాయి. అవి సాకారం కావాలన్న తపన మనుషుల్లో బలంగా ఉండబట్టే ఇప్పటికీ అవి మారుమోగుతున్నాయి. మనుషులను తట్టిలేపుతూనే ఉన్నాయి. కడలి ఆటుపోటుల్లా కొంతకాలం వాటికి ప్రాబల్యం పెరగొచ్చు. తరగొచ్చు. పూర్తిగా సమసిపోవటమంటూ ఉండదు. సోషలిజం పేరుతో ఏర్పాటైన రాజ్యాలన్నీ కుప్పకూలిన తర్వాత మార్క్సిజం ప్రపంచం నుంచే అంతరించిపోతుందనే భావన కలిగింది. మానవమేధపై 150 ఏళ్ల మార్క్సిస్టు భావాల నియంతృత్వం తొలగిపోయిందని ఘనంగా ప్రకటనలూ వెలువడ్డాయి. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభాలు కుదిపివేస్తున్నప్పుడూ, పర్యావరణం ప్రమాదస్థాయికి చేరుతోందన్న హెచ్చరికలు ప్రబలుతున్నప్పుడూ పరిష్కారాల అన్వేషణలో ఆ భావాలకు ప్రాధాన్యం ఏదో విధంగా వస్తూనే ఉంది. వాటిల్లో కొన్ని ఇప్పటి పరిస్థితులకు సరిపోకపోవచ్చు. కొన్నిటిని పరిపుష్టం చేయాల్సి రావొచ్చు, కొన్నిటిని వదులుకోవాల్సీ రావొచ్చు. కానీ అన్నిటినీ పూర్తిగా పక్కకుపెట్టే స్థాయికి మానవ సమాజం ఇంకా ఎదగలేదు. సంపద పంపిణీలో న్యాయబద్ధత ఉండాలనే మనుషుల యుగయుగాల తపనకు అక్షరరూపం ఇవ్వబట్టే అవి అంతరించటం లేదు. అలాగే మన చేతల్లో, చేతనలో, మంచిచెడుల అంచనాల్లో, ఎక్కువ తక్కువ కొలతల్లో కులదృష్టి ప్రబలంగా ఉన్నంతవరకూ 90 ఏళ్ల క్రితం అంబేడ్కర్‌ వ్యక్తంచేసిన భావాలకూ కాలదోషం పట్టదు. ‘కులం పునాదులపై మీరు దేన్నీ నిర్మించలేరు. ఆ పునాదిపై జాతిని నిర్మించలేరు. ఆ పునాదిపై నైతికతను స్థాపించలేరు. ఆ పునాదిపై దేన్ని నిర్మించినా అది పగుళ్లు వారుతుంది. అసంపూర్ణంగా మిగిలిపోతుంది’ అని అంబేడ్కర్‌ ఆనాడు చేసిన హెచ్చరికలో ఎంతో ప్రగాఢత, కఠోర సత్యం ఉన్నప్పటికీ సమకాలీన భారతం అందుకు వ్యతిరేక దిశలోనే వెళుతోంది.

కులాలవారీగా మనుషులను లెక్కించి ఆ మేరకు పదవులూ, ఉద్యోగాలూ, విద్యా సీట్లనూ పంచాలన్న విధానాన్ని ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకుంటే.. బీజేపీ కూడా తన సిద్ధాంతాలను సవరించుకుని పరుగుపందెంలో రెండడుగులు ముందుకే వేసి అందరినీ ఆశ్చర్యపరచింది. లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో కులగణన గురించి ఒక్క ప్రస్తావన కూడా లేకుండా జాగ్రత్తపడిన బీజేపీ, బిహార్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో, కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ ప్రచారాస్త్రం లేకుండా చేయాలనో దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివర నుంచి ప్రారంభమయ్యే జనాభాగణనలో కులాలను లెక్కించటానికి మంత్రివర్గం ఆమోదముద్ర కూడా వేసేసింది.


కులాలకు సంబంధించి ఏ సమాచారాన్ని సేకరిస్తారన్న దాని గురించి ఇప్పటికింకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. కులాల వారీగా తలలెక్కలు తేల్చినంత మాత్రాన సామాజిక, ఆర్థికస్థితిగతులపై కొత్తవెలుగులేవీ ప్రసరించవు. ఎస్సీ, ఎస్టీల గణనకు సంబంధించి ఇప్పటి వరకూ అనుసరిస్తున్న పద్ధతులను మాత్రమే ఇతర కులాల తలలెక్కల విషయంలో అనుసరిస్తే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియటం చాలా కష్టం. సంపదల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాపరంగా ఒక కులం ముందంజలో ఉందా? బాగా వెనుకబడి ఉందా? అన్నది తెలుసుకోలేం. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీలు కులాలవారీగా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వారి అక్షరాస్యతా శాతాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. పట్టణ, గ్రామీణాల్లో నివసించే శాతాలనూ గ్రహించొచ్చు. ఇంకాస్త కష్టపడి కూడికలు వేయగలిగితే విద్యా స్థాయిలనూ లెక్కించవచ్చు. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇంతకుమించి సమాచారాన్ని తెలుసుకోలేం.

కులంతో పాటు ఆర్థిక, ఉద్యోగ, విద్యా పరిస్థితులపై సర్వే చేపడితేనే కొంత సమగ్ర చిత్రం వస్తుంది. ఆస్తులు, సంపదల గురించి ప్రజలు పూర్తి సమాచారం వెల్లడించరు. అందుకే అది పరిమిత చిత్రంగానే ఉంటుంది. ఈ పరిమితి ఉన్నా బిహార్‌లో చేపట్టిన కుల సర్వేలోనే కొన్ని అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని బహిరంగపరచారు. మిగతా సర్వేల విషయంలో అదీ జరగటం లేదు. తెలంగాణలో చేపట్టిన సర్వేలో తేలిన కీలక విషయాలను ఇప్పటికీ వెల్లడించలేదు. కర్ణాటకలోనూ అదే చేశారు. రాజకీయంగా సున్నితమనుకున్న సమాచారాన్ని తొక్కిపట్టటం ఒక అలవాటుగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను వర్గీకరించటానికి ఏర్పాటు చేసిన జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయలేదు. అయిదున్నర ఏళ్లు కసరత్తుచేసి రూపొందించిన నివేదికను వెల్లడించటానికి రాజకీయ అవసరం ఇంకా రాలేదు. అనధికారికంగా వెల్లడైన సమాచారం ప్రకారం కేంద్ర జాబితాలో 2,633 బీసీ కులాలు ఉంటే అందులో కేవలం 40 కులాలు.. మొత్తం రిజర్వేషన్లలో 50 శాతాన్ని దక్కించుకున్నాయి. 994 కులాలు ఒక్క ఉద్యోగాన్నీ, ఒక్క విద్యా సీటునూ పొందలేదు. 1400 కులాలకు 1 శాతం కంటే తక్కువ ప్రాతినిధ్యం లభించింది. బిహార్‌ కులసర్వేలో వెల్లడైన విషయాలను పరిశీలించినా తేలేది అదే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు 20,49,370 ఉంటే 6,21,481 ఉద్యోగాల్లో ఓబీసీలు (జనాభాలో 27శాతం) ఉన్నారు. ఓబీసీల కంటే జనాభాలో ఎక్కువ ఉన్న ఈబీసీలకు (36శాతం) 4,61,725 ఉద్యోగాలు మాత్రమే దక్కాయి. మొత్తంగా చూస్తే బీసీలకు ఉద్యోగాల్లో 52శాతం వరకూ ప్రాతినిధ్యం లభించినా విడివిడి కులాల పరంగా లెక్కిస్తే నాలుగైదు కులాల ఆధిపత్యమే కనపడుతుంది.


జనాభా సేకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి లభ్యమైన సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా ప్రజలముందు పెట్టటం లేదు. ఆ వర్గాలకు సంబంధించి విద్యా, ఉద్యోగ విషయాలతో పాటు ఇళ్లకూ, ఇతర సౌకర్యాలకు సంబంధించిన (వాహనాలు, ఫోన్‌, టీవీ తదితరాలు) కులాలవారీ సమాచారాన్ని కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తయారుచేయగలదు. కానీ దానికీ పూనుకోలేదు. కులాల మధ్య అవాంఛిత పోటీ పెరుగుతుందనీ, వర్గీకరణ డిమాండ్లు ఊపందుకుంటాయనే మిషతో వాటికి దూరంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని కులాల జనాభాను లెక్కించాలన్న నిర్ణయంతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. మొట్టమొదటిసారిగా 75శాతం పైగా జనాభాకు సంబంధించి కులాలవారీ లెక్కల వెల్లడితో ఎన్నో రూపాల్లో వర్గీకరణ డిమాండ్లు ఊపందుకుంటాయి. ఇక రాజకీయ డిమాండ్లు కూడా ఒక పట్టాన పరిష్కరించలేని సమస్యలుగా మారతాయి. కులలెక్కలతో ప్రతి సమస్యనూ ఆ కోణంలో చూసే దృక్పథం పెరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. రాజకీయ కారణాలతో బహిరంగపర్చని సమాచారాన్ని వెల్లడించాలనే ఒత్తిళ్లూ ఎక్కువవుతాయి.

కులలెక్కలతో ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటురంగంలో కూడా ఎవరు ఎక్కడ ఉన్నారో తేల్చాలనే డిమాండ్లు ఊపందుకుంటాయి. అతితక్కువ ప్రాతినిధ్యం ఉన్న కులాలు ఎక్కువగా దాన్ని సాధించటానికి కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. మూడు నాలుగు వర్గీకరణలు ఉన్నచోట పది వర్గీకరణలు కావాలనే డిమాండ్లు మొదలవుతాయి. ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు పరిమితం అయిపోతున్న నేపథ్యంలో ప్రైవేటురంగంలో చోటు కల్పించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వటంలోనూ సంక్లిష్టతలు తలెత్తుతాయి. రెండుమూడు కులాలు జట్టుకట్టి ఫలితాలను శాసించటానికి పూనుకోవచ్చు. మరో రెండుమూడు కులాలు ప్రత్యర్థి శిబిరంగా మారి వ్యవహారాలు నడపొచ్చు. కులాల లెక్కలు జిల్లాల స్థాయిల్లో లభ్యమైన తర్వాత తలెత్తే రాజకీయ పెనుగులాటలు ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోయినా కులదృక్పథాలను అవి విపరీతంగా పెంచుతాయి. ఇక ప్రతి పదేళ్లకూ కులలెక్కలు తీయటం సర్వసాధారణమైతే తలెత్తే పరిస్థితి మన ఆలోచనలను మరింతగా కులమయం చేస్తుంది.


రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ విధానాన్నీ ఏ పార్టీ తలకెత్తుకోదు. కులాలు ఆధారంగా ప్రత్యేక గుర్తింపూ, రాజకీయ డిమాండ్లూ తలెత్తకుండా చూడాలన్నది హిందూత్వ సాంస్కృతిక జాతీయవాదంలో ప్రధానంగా ఉంటుంది. కులగణనతో పెరిగే కులచైతన్యానికి ఆ సాంస్కృతిక జాతీయవాదానికి ఒకపట్టాన పొసగదు. ఈ సమస్య పొంచి ఉన్నా హిందూత్వ అజెండాగా ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కులగణనకు మొగ్గుచూపింది. ఎందుకిలా చేసిందని ప్రశ్నించుకుంటే కులగణనతో లభ్యమయ్యే సమాచారాన్ని తన ప్రయోజనాలకు అనుగుణంగా వెల్లడించే చాకచక్యం తనకుందన్న భావన కారణం కావొచ్చు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ అజెండా లేకుండా చేయాలన్న లక్ష్యం ఎలాగూ ఉండనే ఉంది. హిందూత్వకు అడ్డంకి అనుకుంటే కులగణన సమాచారాన్ని ఓసీలు ఇంతమంది.. బీసీలు ఇంతమంది.. అన్నదానికే పరిమితం చేసి (విడివిడి కులాలవారీ కాకుండా) జాతి సమైక్యత పేరుతో మిగతా సమాచారాన్ని వెల్లడించకుండా ఉండే అవకాశాన్నీ కొట్టేయలేం. 2011లో 5000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో సేకరించిన కులలెక్కలను పనికిరానివిగా తేల్చి మూలనపడేయటమే ఇందుకు నిదర్శనం. నిజానికి అప్పటి కులలెక్కల్లో తలెత్తిన చిక్కుముడులను విప్పి సమాచారాన్ని అందుబాటులో ఉంచటం అసాధ్యమేమి కాదు. రాజకీయ సంకల్పం లేకపోవటంతో అది పరిష్కరించలేని చిక్కుముడిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఆనాటి సర్వేలో 45 లక్షల కులాలు నమోదవ్వటం అసంబద్ధమని అన్నారే గానీ దానికి కారణం ఎవరనే విషయంపై మౌనం దాల్చారు.

కొన్ని కులాలు అంతర్గతంగా అతితక్కువ ఆర్థిక అంతరాలతో మొత్తంగా వెనుకబడి ఉన్న పరిస్థితి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కానీ అన్ని కులాలకు అది వర్తించదు. బీసీ కేటగిరిలో ఉన్న కులాలన్నీ ఆ పరిస్థితుల్లో లేవు. ఎన్నో కులాల్లో విపరీతమైన ఆర్థిక అంతరాలూ నెలకొన్నాయి. వివిధచోట్ల ఆధిపత్య స్థానాల్లోనూ ఉన్నాయి. అందుకే ఆర్థిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్లు బలం పుంజుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో కూడా సంపన్న శ్రేణులను మినహాయించి రిజర్వేషన్లను వర్తింపచేయాలనే సూచనలు గట్టిగా వస్తున్నాయి. కులగణనతో రాజకీయ ప్రయోజనం కలగొచ్చు. కానీ కులదృష్టి పెరిగిపోతే అంబేడ్కర్‌ హెచ్చరించినట్లు ఆ పునాదిపై స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వాల ప్రాతిపదికన జాతిని (నేషన్‌) ఎన్నటికీ నిర్మించలేం. ఇప్పటికే అంబేడ్కర్‌ ఆశించిన కులనిర్మూలనలూ కులరహితాలూ రాజకీయ రంగాన అప్రాధాన్యతలైపోయి అంతటా కులసహితాలూ, కులసమ్మోహనాలూ, కులసమ్మేళనాలూ ఉరకలేస్తున్నాయి. ఆ ఉరకల ఉధృతికి ప్రజాస్వామ్య విలువలే పలచనైపోతున్నాయి.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి..

అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ

ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 25 , 2025 | 01:08 AM