ఇన్ని అసమానతలతో ఆర్థికశక్తిగా నిలవగలమా?
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:00 AM
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 10న సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మలిదశ బడ్జెట్...

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 10న సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మలిదశ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పద్దులు, జమాఖర్చులు, లెక్కల పైనే కాకుండా దేశ ఆర్థిక గమనం, గమ్యంపై చర్చ జరగాల్సిన అవసరముంది. ఆ చర్చ ఆర్థిక అసమానతలు రూపుమాపేలా ఉండాలి. ఇందుకు కొన్ని అధ్యయన వివరాలను, వాస్తవ స్థితిగతులను, పరిష్కార మార్గాలను కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ముందు పెట్టాలి. ఇందుకు ఇటీవల విడుదలైన ఓ ప్రతిష్టాత్మక సర్వే దోహదపడుతుందని భావిస్తున్నాను.
ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతో కూడిన ‘వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్’ సంస్థ ‘భారతదేశంలో ఆదాయం, సంపద, అసమానతలు: 1922–2023’ పేరుతో విడుదల చేసిన ఓ నివేదిక భారతదేశంలోని ప్రజల గత వంద సంవత్సరాల స్థితిగతులను బహిర్గతం చేసింది. సంపద, ఆదాయంలో తారతమ్యాలు విస్తృతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. సామాజిక, ఆర్థిక విభజనను సృష్టించడంపై తక్షణం దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం– భారతదేశంలో అట్టడుగు 50శాతం జనాభా వద్ద 6.4శాతం సంపద మాత్రమే ఉంటే; 10శాతం ధనికుల వద్ద 65శాతం సంపద; 40శాతం మధ్యతరగతి ప్రజల వద్ద 28.6శాతం సంపద మాత్రమే ఉంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విధాన నిర్ణయకర్తలు, రాజకీయ పార్టీలు ప్రణాళికలను, ఆర్థిక విధానాలను, బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు ఈ అసమానతలను పరిగణనలోకి తీసుకోవాలి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలినాళ్లలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మిశ్రమ ఆర్థికవ్యవస్థ గురించి ఆలోచించింది. పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం రెండింటి సూత్రాలను సమన్వయంతో పాటిస్తూ దేశీయ పరిశ్రమలను సురక్షితం చేసింది. మిశ్రమ అర్థికవ్యవస్థ స్వావలంబన ఆర్థికవ్యవస్థకు పునాదులు వేసింది. కీలక రంగాల్లో అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఆర్థిక విస్తరణకు పునాదిగా దోహదపడ్డాయి. ప్రభుత్వరంగ సంస్థలు విజయాలు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో అసమర్థ పనితీరు, అధికారికమైన ఆటంకాలు, పరిమితమైన ప్రైవేటురంగం భాగస్వామ్యం వల్ల ఆర్థిక ప్రగతి కుంటుపడింది. ఈ లోపాల నేపథ్యంలో 1990 దశకంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) సంస్కరణను స్వీకరించేందుకు దోహదం చేశాయి.
భారత మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులకు దారులు తెరవడం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థతో ఏకమైంది. ఆర్థిక సంస్కరణలు అంతకు ముందెప్పుడూ లేనంత వృద్ధికి దారితీశాయి. సాంకేతిక, టెలీ కమ్యూనికేషన్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్థిక సంస్కరణలు ఉత్ప్రేరకంగా పనిచేశాయి. దీంతోపాటు అనేక సవాళ్లనూ సృష్టించాయి. ఆర్థిక సంస్కరణలు ఆచరణలోకి వచ్చిన సమయంలో సృష్టించిన సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది. సంపద ఫలాలను పంపిణీ చేయడంలో నియంత్రణ వ్యవస్థలు విఫలమయ్యాయని చెప్పవచ్చు. పన్నుల విధింపులో ప్రగతిశీల విధానాలు, సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా సంపద పునః పంపిణీకి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. సరళీకరణ ఆర్థిక విధానాల ఫలాలను జనాభాలోని కొంతమంది మాత్రమే అందిపుచ్చుకున్నారు. విస్తృతమైన మెజారిటీ ప్రజలు పెరగని ఆదాయంతో, పెరిగిన జీవనవ్యయంతో, వ్యవస్థాగతమైన అసమానతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గుతుండగా, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. తగినంత నగదు లభ్యత కూడా ఉండటం లేదు. ఫలితంగా చాలా కుటుంబాలు ఆర్థికపరమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాయి. ప్రముఖ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పరిశీలనలు చెప్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నేను టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంటల్ రీసెర్చ్‌కు వెళ్లినపుడు, అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులు కూడా విపరీతంగా పెరిగిన స్కూల్ ఫీజుల కారణంగా తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం గగనమైపోయిందని వాపోతున్నారు. ఓ వైపు అధిక ధరలు, మరోవైపు జీవన ప్రమాణాలు పెంచలేని ఆర్థికవనరులతో మధ్యతరగతి ప్రజలు అయోమయంలో చిక్కుకున్నారు.
Jagan Argument : అయోమయం... జగన్‘వాదం’!
ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు నిరంతరం తీసుకోవాల్సిన బహుముఖ మార్గాలను ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు తన ప్రతిభావంతమైన పుస్తకం ‘రైజింగ్ ఇన్‌కమ్ ఇనిక్వాలిటీస్ ఇన్ ద వేక్ ఆఫ్ గ్లోబలైజేషన్: ఎమర్జింగ్ ఛాలెంజెస్’ (ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు: ఉద్భవిస్తున్న సవాళ్లు)లో సూచించారు. మౌలిక వసతుల కల్పనలోను, విద్య వైద్య రంగాల్లోను ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని సూచించారు. గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ; వ్యవసాయేతర రంగాలకు, తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే అసమానతలు తగ్గించేందుకు సరిపడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్ఘాటించారు. అలాగే కార్మిక హక్కులను బలోపేతం చేయాలని, న్యాయమైన వేతనాల భరోసాను కల్పించాలని, శ్రామికవర్గాల సాధికారత, ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు.
దేశంలో పాలకులు భారీ పరిశ్రమలను పూర్తిగా ప్రైవేటు రంగానికి వదిలేయకుండా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. 1997 ఆసియా టైగెర్స్ ఆర్థిక సంక్షోభం నుంచి, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకులే దేశాన్ని కాపాడాయి. మన దగ్గర ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త తరానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైల్వే, విమానయాన రంగాలు, ఉక్కు, బొగ్గు వంటి తయారీ రంగాల్లో ప్రభుత్వరంగ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం సరికాదు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించడం అంటే నష్టాలను భరించడం కాదని పాలకులు గుర్తించాలి. ప్రభుత్వరంగ సంస్థల విజయాలెన్నో చరిత్రలో ఇందుకు నిదర్శనాలుగా ఉన్నాయి. ఏవైనా నష్టపోయిన సంస్థలుంటే అందుకు కారణమైన గత తప్పిదాలను గుర్తించాలి. పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. మెరుగైన విధానాలను ప్రవేశపెట్టాలి. లిస్టెడ్ కంపెనీలకు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ (ఎంపీఎస్) అవసరంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిర్దేశాలు జారీచేసింది. ఎంపీఎస్ నియమం ప్రకారం ఒక కంపెనీ ఈక్విటీ షేర్లలో కనీసం 25శాతం ప్రజల వద్ద కలిగి ఉండాలి. ఎంపీఎస్ శాతాన్ని 50 శాతానికి పెంచితే ప్రైవేట్ సంపద సామాన్య మధ్యతరగతి ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో బడా కంపెనీలలో కేవలం 3 శాతం ప్రజలే పెట్టుబడి పెడుతున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో 50–70 శాతం ప్రజలు కంపెనీలలో భాగ్యసామ్యాన్ని కలిగి ఉన్నారని తెలుస్తున్నది. భారత్ ఆర్థిక మహాశక్తిగా ఎదుగుతున్న ఈ కీలక తరుణంలో సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లోను, ప్రైవేట్ కంపెనీలోను ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక విధానాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. అదే విధంగా ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం, కూడా పెట్టుబడులు పెట్టేలా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తగు చొరవ చూపాలి. అప్పుడే కొందరి లాభమే కాకుండా అందరి శ్రేయస్సు సాధ్యమవుతుంది.
బోయినపల్లి వినోద్‌కుమార్
న్యాయవాది, పార్లమెంట్ మాజీ సభ్యులు
Read Latest Telangana News And Telugu News