Share News

Communist Revolutions Lessons: కమ్యూనిస్టు విప్లవాల్ని టెక్నాలజీతో అణచగలరా

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:35 AM

గత 60 ఏళ్ళుగా భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు నడిపిన ఉద్యమాలన్నీ, కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆ ఉద్యమాలు...

Communist Revolutions Lessons: కమ్యూనిస్టు విప్లవాల్ని టెక్నాలజీతో అణచగలరా

గత 60 ఏళ్ళుగా భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు నడిపిన ఉద్యమాలన్నీ, కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆ ఉద్యమాలు బలహీనపడడానికి ఎన్ని కారణాలున్నా, ప్రధానమైన కారణం– ప్రభుత్వాల చేతుల్లో ఉన్న ‘అత్యంత ఆధునిక టెక్నాలజీ’ అనే వాదన ఇప్పుడు విరివిగా వినిపిస్తోంది. నేను ఈ వ్యాసంలో ఇక్కడి మావోయిస్టుల గురించి కాకుండా ‘కమ్యూనిస్టు ఉద్యమాలను టెక్నాలజీతో పాలకులు నిజంగా అణచగలరా?’ అనే విషయం గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. దీనికి ఉదాహరణగా, దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టు విప్లవకారులు జరిపిన పోరాటాన్ని తీసుకుంటున్నాను. ఆ దేశ ప్రభుత్వానికి మద్దతుగా అమెరికా సైన్యం 10 వేల మైళ్ళ నుంచి వచ్చి, స్థానిక సైనికులతో కలిసి విప్లవకారుల మీద, అప్పటికి ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో దాడులు చేసింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో చివరికి వియత్నాం విప్లవకారులు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వివరాలు ‘వియత్నాం’ మీద రాసిన పుస్తకాలలో, వ్యాసాలలో దొరుకుతాయి. అలా కనపడే పుస్తకాల్లో ఒకటి– నిక్‌టర్స్ అనే అమెరికా జర్నలిస్టు పరిశోధించి రాసిన పుస్తకం ‘కదిలే ప్రతిదాన్నీ చంపెయ్యి: 1965–73ల మధ్య అమెరికా యుద్ధ నేరాలూ, వియత్నాంలో దాని అకృత్యాలూ.’


‘టెక్నోవార్’గా (టెక్నాలజీని ఉపయోగించిన యుద్ధంగా) పేరున్న ఆ యుద్ధం ఎలా జరిగిందో చూడండి– దట్టమైన అడవుల్లో, భూమి మీద ఉన్న విప్లవ సైన్యం కదలికల్ని గగనతలం నుంచి ఫొటోలు తీసి, కింద ఉన్న తన సైన్యానికి సమాచారం అందించే ‘లైటెనింగ్ బగ్’ అనే యూఏవీ (Unmanned Aerial Vehicles) డ్రోన్లను అమెరికా సైన్యం వాడింది. దీనికి వ్యతిరేకంగా వియత్నాం విప్లవకారులు రకరకాల పద్ధతులను అనుసరించారు. నేలమీద విప్లవ సైనికుల కదలికలూ, ఆయుధ రవాణా పైన తిరిగే డ్రోన్లకు కనపడకుండా, చెట్లకొమ్మలకు బరువైన రాళ్ళు కట్టి వంచడం ఒక పద్ధతి. కుండీల వంటి వాటిల్లో మొక్కల్ని పెట్టి చెట్లకి వేళ్ళాడగట్టడం ఇంకో పద్ధతి. దానివల్ల పై యూఏవీలకు నేల మీద వెళ్తున్నవాళ్ళు కనపడరు. అలాగే, వీలైనంత వరకూ పాద ముద్రలూ వగైరా కనపడకుండా నడవడం, పొగ పైకి పోకుండా వంటలు చేయడం, చప్పుళ్ళు రాకుండా మాట్లాడుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. పైన తిరిగే డ్రోన్లకు నేల కనిపించని వాతావరణ పరిస్థితుల్ని వాడుకునేవారు. కింద ఎగిరే డ్రోన్లను రకరకాల విమాన విధ్వంసక ఫిరంగులతో కూల్చేవారు.

పాదచారులూ, సైక్లిస్టులు ఎక్కువగా ఉండే వియత్నాం మీదకు అమెరికా యుద్ధ ట్యాంకులను, మంటలు విసిరే ట్యాంకులను పంపింది. రహదారుల్లో సాయుధ శకటాలూ, నదుల మీద ప్రయాణానికి మరపడవలూ, భూ భాగంలోకి విమానాలను తీసుకెళ్ళే యుద్ధనౌకలూ వగైరాల్నీ; నిప్పులు చిమ్మే రాకెట్ లాంచర్లనూ ఆ దేశం మీదకు అగ్రరాజ్యం ప్రయోగించింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా స్థానిక ప్రజలే తిరగబడే విధంగా ప్రజలను సంఘటితం చేసింది కమ్యూనిస్టు పార్టీ. నాడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలూ, కార్మిక సంఘాలూ, విద్యార్థి సంఘాలూ ఏర్పడి పనిచేస్తూ ఉండినాయి.


అక్కడితో అయిపోలేదు. దాదాపు పది పదిహేను ఎకరాలలో ఉన్న చెట్లను కూడా భస్మీపటలం చెయ్యగలిగే ‘డెయిసీ కట్టర్’ బాంబులను వియత్నాంపైకి అమెరికా ప్రయోగించింది. ఏకే 47 తుపాకుల కంటే వేగం తక్కువైనా, ఎక్కువ నష్టం కలగజేసే ఎం.16 రైఫిళ్ళనూ అగ్రరాజ్య సైన్యం ఉపయోగించింది. కొన్ని వందల రౌండ్ల తుపాకీగుళ్ళు ఉండే ఎం.60 మెషీన్‌గన్స్‌ను అమెరికా సైన్యం వాడింది. వియత్నాం విప్లవ గెరిల్లాల దగ్గర పాత రైఫిళ్ళూ, స్థానికంగా తయారు చేసుకున్న గ్రెనేడ్లూ, చిన్న స్థాయి ఫిరంగులూ మాత్రమే ఉండేవి. అయినప్పటికీ, ఉత్తర వియత్నాం లోని కమ్యూనిస్టు ప్రభుత్వం దక్షిణాది విప్లవకారులకు ఇచ్చిన ఆయుధ సహకారం కూడా ఎంతో ఉపయోగపడింది.

అనేక మారణాయుధాలతో పాటు, 3 లక్షల 88 టన్నుల ‘నాపాం’ బాంబుల్ని అమెరికా సైన్యం, వియత్నాం మీద వేసింది. రెండు కోట్ల గ్యాలన్ల విష రసాయనాలను పొలాల మీదా, జలాశయాల లోనూ, ఊళ్ళ పైనా విమానాలతో చల్లించారు. ఆ బాంబులూ, విష రసాయనాలూ దాదాపు 40 లక్షలమంది మరణాలకూ, ప్రాణాంతక రోగాలకూ కారణమయ్యాయి. తర్వాత కాలంలో క్యాన్సర్లూ, మృత శిశువుల జననాలూ, పుట్టిన పిల్లలకు మెదళ్ళలో అనేకానేక లోపాలూ, ఎముకల బలహీనతలూ, వెన్నుపూసల్లో జబ్బులూ– ఇలా ఎన్నో దౌర్బల్యాలు!


వియత్నాంలోని ‘మైలై’ అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆ దేశ ప్రజలమీద అమెరికా సైన్యం చేసిన అతి కిరాతక దాడికి నిదర్శనం. పొద్దున్నే వంట చేసుకుంటున్నప్పుడు, సైనికుల పటాలం వచ్చి ఆ గ్రామం మీద పడి, ఆడవాళ్ళనూ, పిల్లలనూ, వృద్ధులనూ ఇలా దాదాపు 500 మంది నిరాయుధుల్ని చంపేసింది. కోళ్ళనూ, పందులనూ, ఆవుల్నీ, గేదెల్నీ... కదిలే ప్రతీ దాన్నీ సైన్యం చంపింది (అందుకే, ‘నిక్’ తన పుస్తకానికి ‘కదిలే ప్రతీ దాన్నీ చంపు’ అనే పేరు పెట్టాడు). హత్యలూ, చిత్రహింసలూ, అత్యాచారాలూ, జనాల నివాసాలను ఖాళీ చేయించడాలూ, ఇళ్ళు తగలబెట్టడాలూ, ఎడాపెడా అరెస్టులూ, జైళ్ళల్లో పెట్టడాలూ నిత్యమూ కొనసాగేవి, అమెరికా సైన్యం ఉన్నంత కాలమూ! ప్రజల తరఫున పోరాడుతున్న వియత్నాం జాతీయ విముక్తి సైన్యానికీ, ప్రజలకూ మధ్య సఖ్యత ఉండేది. జనాల్ని ఆ విముక్తి సైన్యం నుంచి వేరు చేయాలని, అమెరికా చేసిన ఎత్తుగడలు ఎన్నో! అవేవీ ఫలించలేదు. విప్లవ సైనికులకు తిండీ, ఆశ్రయమూ కల్పిస్తున్నారనే నెపంతో, ‘వ్యూహాత్మక గూడేలు’ (‘స్ట్రాటజిక్ హామ్లెట్స్’) పేరుతో నిర్బంధ శిబిరాల్లాంటివి ఏర్పరిచి, జనాల్ని అక్కడ బంధించింది అగ్రరాజ్యం. అమెరికా బంట్లుగా ఉన్న దక్షిణ వియత్నాం పాలకులు, తమ సైన్యాన్ని అమెరికా సైన్యంతో కలిపి, ప్రజలమీద దాడులకు పంపేవాళ్ళు. కానీ, విప్లవం పురోగమించే కొద్దీ– 1974లో దక్షిణ వియత్నాం సైనికులు, దాదాపు 2 లక్షల మంది సైన్యాన్ని వదిలి, ప్రజలపక్షం వైపే చేరారు.


ఇన్ని మాటలు ఎందుకు, ఆ నాటికి ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన టెక్నాలజీ అంతటినీ వియత్నాం మీద అమెరికా ప్రయోగించిందని అనేక యూనివర్సిటీల పరిశోధనలు తెలిపాయి. ఇన్ని అకృత్యాలు జరిగినా, 1970లో ఒక వియత్నాం నాయకుడు అన్నట్టు... ‘దూరం నుంచి విసిరే ‘బి–52’ రకం బాంబులూ, కంప్యూటర్లూ ఏవీ న్యాయమైన పోరాటంతోనూ, ప్రజల తెలివితోనూ పోటీ పడలేవు.’ అమెరికా అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని వాడినా, ఎంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించినా, వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినా, లక్షలాది మంది జీవితాలు నాశనం చేసినా– ఐసెన్ వోవర్, కెనడీ, జాన్సన్, నిక్సన్, ఫోర్డ్ ఇలా నలుగురు అధ్యక్షులు ఒకరి తర్వాత ఒకరు ఎన్ని రకాల కుటిల ప్రయత్నాలు చేసినా, వియత్నాం వంటి అతి చిన్న దేశాన్ని ఏమీ చెయ్యలేకపోయారు.

దీనికంతటికీ ప్రధాన కారణం– వియత్నాం ప్రజల సామ్ర్యాజ్యవాద వ్యతిరేక చైతన్యం. ఒక అమెరికా చరిత్రకారుడు అన్నట్లు... ‘‘బాణాలతో, విల్లంబులతో పోరాటం మొదలుపెట్టిన వియత్నాం ప్రజలు, వారిని కమ్యూనిస్టు విప్లవకారులు సంఘటితం చేశాక, ఈ భూ మండలంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని ఓడించగలిగారు.’’ ప్రజా పునాది బలంగా ఉంటే ఎంతటి టెక్నాలజీనైనా దీటుగా ఎదుర్కోవచ్చునని వియత్నాం విప్లవం రుజువు చేస్తున్నది. అయితే, ఆ ప్రజలకు నాయకత్వం వహించగలిగే ‘కమ్యూనిస్టు’ పార్టీ చాలా ముఖ్యం! ఆ పార్టీకి వర్గపోరాట సిద్ధాంతమైన మార్క్సిజం తెలిసివుండాలి. ఈ విషయాన్ని గ్రహించిన ఒక వియత్నాం కమ్యూనిస్టు నాయకుడు, ఆ రోజుల్లోనే– ‘కార్ల్‌మార్క్స్ చూపిన మార్గంలో ముందుకు’ అని ఒక వ్యాసం రాశాడు. ‘వందేళ్ళ పాటు వలసవాదాన్ని వదుల్చుకోలేక పోవడానికి కారణం శాస్త్రీయ దృక్పథం (మార్క్సిజం) అలవర్చుకోక పోవడమే’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నాడు. వియత్నాం అనుభవం చెప్పేదేమిటంటే... విప్లవాలు సఫలం కావాలన్నా, విఫలం కావాలన్నా కావలిసింది టెక్నాలజీ కాదు, ప్రజాబలమే.

బి.ఆర్. బాపూజీ

ఈ వార్తలు కూడా చదవండి:

AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత

MLA Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. అత్యవసర విచారణకు నో చెప్పిన హైకోర్టు..

Updated Date - Dec 21 , 2025 | 04:35 AM