SDG 4 Education Goals: ఐదేళ్లలో విద్యాలక్ష్యాలు సాధించగలమా
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:27 AM
2015 మేలో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో నిర్వహించిన ప్రపంచ విద్యా ఫోరంలో ‘ఇంచియాన్ డిక్లరేషన్’ను రూపొందించారు. ఈ డిక్లరేషన్ ద్వారా 2030 నాటికి అందరికీ నాణ్యతతో కూడిన...
2015 మేలో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో నిర్వహించిన ప్రపంచ విద్యా ఫోరంలో ‘ఇంచియాన్ డిక్లరేషన్’ను రూపొందించారు. ఈ డిక్లరేషన్ ద్వారా 2030 నాటికి అందరికీ నాణ్యతతో కూడిన విద్యను అందించడంతో పాటు, జీవనపర్యంత అభ్యసన అవకాశాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం–4’ (SDG 4)కు భారత్ సహా అన్ని ఐరాస సభ్య దేశాలు తమ ఆమోదాన్ని తెలిపాయి. ఈ లక్ష్య సాధన కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా, మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, అసమానతలను రూపుమాపడం, శాంతియుత, శక్తిమంతమైన సమాజాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ SDG 4 విద్యా లక్ష్యం కింద మొత్తం పది ఉప లక్ష్యాలు ఉన్నాయి. ఇవి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు, వృత్తిపరమైన శిక్షణ నుంచి ఉపాధ్యాయుల నాణ్యత వరకు విస్తృత పరిధిని కలిగి ఉన్నాయి.
2030 గడువుగా నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల సాధనకు ఇంకా ఐదేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. రాబోయే ఐదేళ్లలో భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ‘సుస్థిర అభివృద్ధి నివేదిక–2025’ ప్రకారం... ఫిన్లాండ్ (87 స్కోర్‌తో మొదటి స్థానం), స్వీడన్, డెన్మార్క్ దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారత దేశం (67 స్కోర్‌తో) మొదటిసారిగా తొలి 100 దేశాల శ్రేణిలోకి ప్రవేశించి, 167 దేశాల వరుసలో 99వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ మన పొరుగు దేశాలైన చైనా (49వ స్థానం), భూటాన్(74వ), నేపాల్ (85వ), శ్రీలంక (93వ) వంటి దేశాలు మనదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇది లక్ష్య సాధనలో మన దేశం వెనుకబాటుతనాన్ని తెలియజేస్తోంది.
మన దేశంలో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్య పరంగా విద్యార్థుల నమోదు విషయంలో గణనీయమైన ప్రగతి ఉన్నప్పటికీ, విద్యలో నాణ్యత లేమి వేధిస్తోంది. విద్యా స్థితిగతుల వార్షిక నివేదిక–2024 (ASER) వెల్లడించిన అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. గ్రామీణ భారతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో– మూడవ తరగతి విద్యార్థుల్లో కేవలం 23.4శాతం మంది మాత్రమే రెండవ తరగతి స్థాయి వచనాన్ని చదవగలుగుతున్నారు. 33.7శాతం మంది మాత్రమే తీసివేతలు చేయగలుగుతున్నారు!
UDISE 2024–25 డేటా ప్రకారం... పై తరగతులకు వెళ్లేకొద్దీ విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల నమోదు 98శాతంగా ఉంది. అప్పర్ ప్రైమరీ (6–8 తరగతులు) విద్యార్థుల నమోదు 90.3శాతంగా ఉండగా, సెకండరీ స్థాయి (9–10 తరగతులు) విద్యార్థుల నమోదు 78.7శాతంగా ఉంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లోని విద్యార్థుల నమోదు మరింత తక్కువగా నమోదైంది. ఇక, వృత్తి విద్యకు సంబంధించి ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ స్థానం చాలా వెనుకబడి ఉంది. CII రిపోర్ట్–2024 లెక్కలను బట్టి చూస్తే, మన దేశం విద్యపై జీడీపీలో 2.7–2.9శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది కొఠారీ కమిషన్, NEP–2020 సిఫార్సు చేసినదాని (6శాతం) కంటే చాలా తక్కువ. స్వీడన్ (6.7–6.9శాతం), యూకే (5.3–5.6శాతం), చైనా (3.9శాతం) వంటి దేశాలు మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి.
నిర్దేశించుకున్న విధంగా ‘SDG 4’ లక్ష్యాలను చేరుకోవాలంటే... ECCE కవరేజీని 100శాతానికి పెంచాలి. ‘నిపుణ్ భారత్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలి. ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచాలి. వీటితో పాటు విద్యపై జీడీపీలో కనీసం 6శాతం నిధులు ఖర్చు చేయాలి. పని ఆధారిత శిక్షణతో కూడిన వృత్తి విద్యను మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో తప్పనిసరిగా అమలు చేయాలి. పరిశ్రమలతో భాగస్వామ్యం పెంచాలి. ఐటీఐలను తక్షణమే ఆధునికరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు, స్కాలర్‌షిప్స్, డిజిటల్ పరికరాల పంపిణీ ద్వారా విద్యా అంతరాలను తొలగించాలి. సెకండరీ విద్యలో డ్రాపౌట్ రేట్లను తగ్గించాలి.
ప్రస్తుత వేగంతో కొనసాగితే 2030 లక్ష్యాలు కేవలం కాగితంపైనే మిగిలి పోతాయి. భారతదేశం విద్యకు సంబంధించిన ప్రతి అంశంలోనూ అత్యవసరంగా విధాన సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరం ఉంది. తూర్పు ఆసియా దేశాలు, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ వంటి దేశాల అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్ తన విద్యా వ్యవస్థను పరివర్తనం చేయాలి.
ఏటూరి సోమశేఖర్‌శర్మ
విశ్రాంత జిల్లా విద్యా శాఖాధికారి, ఖమ్మం
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News