Share News

Biomass Energy: జీవ ద్రవ్యాలతో విద్యుత్‌ ఉత్పత్తి

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:42 AM

ఒక పక్క భయానకమవుతోన్న వాతావరణ మార్పు, మరో పక్క అభివృద్ధి చెందుతున్న దేశాలలో గృహావసరాలకు, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు విద్యుత్‌ శక్తిని సమృద్ధిగా సమకూర్చవలసిన తక్షణ అవసరం... ఈ రెండు సవాళ్ల దృష్ట్యా విద్యుదుత్పాదనకు బొగ్గును వాడుకోవాలా...

Biomass Energy: జీవ ద్రవ్యాలతో విద్యుత్‌ ఉత్పత్తి

ఒక పక్క భయానకమవుతోన్న వాతావరణ మార్పు, మరో పక్క అభివృద్ధి చెందుతున్న దేశాలలో గృహావసరాలకు, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు విద్యుత్‌ శక్తిని సమృద్ధిగా సమకూర్చవలసిన తక్షణ అవసరం... ఈ రెండు సవాళ్ల దృష్ట్యా విద్యుదుత్పాదనకు బొగ్గును వాడుకోవాలా లేక మానివేయాలా అన్నది జిలియన్‌ (పరిమితి లేని అనిర్దిష్ట సంఖ్య) డాలర్ల ప్రశ్న. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయి. సమస్త మానవాళి శ్రేయస్సుకు దోహదం చేసే విధంగా వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించుకోవలసిన అవసరమున్నది. ఇదిగో ఇక్కడే విద్యుదుత్పత్తికి బొగ్గును ఉపయోగించుకోవాలా అన్న ప్రశ్న మరింత సంక్లిష్టమవుతోంది. బొగ్గును భూగర్భంలోనే ఉండనివ్వండి– విద్యుదుత్పత్తికి బొగ్గును ఉపయోగించ వద్దు అని చెప్పడం తేలికే. ఇప్పటికే ధరిత్రి వాతావరణాన్ని నిండుగా కమ్మివేసిన హరిత గృహవాయువుల ఉద్గారాలకు బొగ్గు ఆధారిత ఉత్పత్తి ప్రక్రియలే అత్యధికంగా కారణమని భావిస్తున్నందున బొగ్గు వాడకాన్ని నిలిపివేయాలనే మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇంధన అవసరాలు తగినంతగా చేకూరని దేశాలు అనేకం ఉండగా వాతావరణ మార్పు సమస్యకు అటువంటి పరిష్కారం ఎలా సాధ్యమవుతుంది?

మరి ఇంధన కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న భారత్‌ లాంటి దేశాలు ఏమి చేయాలి? సరసమైన అభివృద్ధి సాధన అనే వాటి స్వప్నం ఎలా ఫలిస్తుంది? బొగ్గు ఆధారిత ఉత్పత్తి పద్ధతులను పూర్తిగా త్యజించాలా? లేక పాత, కొత్త ఇంధన వనరులను సమతుల్యంగా ఉపయోగించుకోవాలా? కాలుష్యరహిత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? విద్యుదుత్పత్తిలో బొగ్గు వినియోగాన్ని క్రమంగా తగ్గించడమే లక్ష్యంగా ఉన్న భారత ప్రభుత్వ ఇంధన పరివర్తన ప్రణాళికే సమస్య పరిష్కారానికి సరైన మార్గాంతరమని నేను మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నాను. వాస్తవమేమిటంటే మన ఇంధన అవసరాలు 2030 సంవత్సరం నాటికి రెట్టింపు అవనున్నాయి. జీవనోపాధుల రక్షణకు, ఆరోగ్య భద్రత అవసరాలకు విద్యుదుత్పత్తి సమృద్ధిగా జరగడం తప్పనిసరి. పెరిగిన ఇంధన అవసరాలను ప్రాథమికంగా పవన, సౌరశక్తితో తీర్చుకునే వెసులుబాటు ఉన్నది. ఈ విధంగా 2030 నాటికి బొగ్గు, మన విద్యుత్‌ అవసరాలను 70 నుంచి 75 శాతం కాకుండా కేవలం 50 శాతాన్ని మాత్రమే తీర్చగలుగుతుంది.


బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన రంగం నుంచి హరిత గృహవాయువు ఉద్గారాల తగ్గింపునకు మనం ఏమి చేయాలో చర్చిద్దాం. బొగ్గు త్వరలోనే చరిత్ర చెత్తబుట్టలోకి చేరుతుందని సర్వత్రా విశ్వసిస్తున్న దృష్ట్యా ఆ శిలాజ ఇంధనంపై చర్చ నిషిద్ధ విషయమని నాకు తెలుసు. అయితే వాస్తవాల ప్రాతిపదికన మనం ఆలోచిద్దాం. అన్ని రంగాలలోను హరిత గృహవాయు ఉద్గారాలను తగ్గించవలసిన అవసరమున్నది. మనకు ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్న విషకారక వాయు ఉద్గారాలను తగ్గించుకున్నప్పుడే మనకు స్థానికంగా వాయు నిర్మలత సమకూరుతుంది. అదే సమయంలో ప్రపంచ వాతావరణ పరిరక్షణ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని మనం వ్యవహరించాలి. ఆరోగ్య సవాళ్లు ప్రపంచ ప్రయోజనాలు రెండిటికీ దోహదం చేసే వ్యూహాలను మనం రూపొందించుకోగలిగితే మనకు ఆ రెండు అంశాలలోను సమ విజయం సమకూరుతుంది.

‘Decarbonizing the Coal based Thermal Power Sector in India : A Roadmap’ అన్న నివేదికలో నా సహచరులు ఇదే ప్రతిపాదన చేశారు. థర్మల్‌ విద్యుత్కేంద్రాల డీ కార్బొనైజింగ్‌ చేసే వ్యూహాన్ని అనుసరించేందుకు దేశం నిర్ణయం తీసుకుంటే ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమల కర్బన ఉద్గారాలతో సమస్థాయిలో థర్మల్‌ విద్యుత్కేంద్రాల కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. తగ్గింపును విధిగా పరిగణనలోకి తీసుకోవాలి. తగ్గింపుపై దృష్టి పెట్టాలి.

ఈ మార్గదర్శక ప్రణాళికలో మొదటి అడుగు ప్రస్తుతమున్న విద్యుత్కేంద్రాలను, ఆ తరహా పరిశ్రమలలోని ఉత్తమ ప్లాంట్ల ఉత్పాదక సామర్థ్యంతో సమంగా విద్యుదుత్పాదన చేసేలా మెరుగుపరచాల్సిన అవసరమున్నది. ఉదాహరణకు సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఆధారిత విద్యుత్కేంద్రాలలో అగ్రశ్రేణివి అయిన టాటా పవర్‌ ట్రాంబే యూనిట్‌ లేదా తెలంగాణ లోని కొత్తగూడెం విద్యుత్కేంద్రం ఉద్గారాల స్థాయికి సమ రీతిలో తమ ఉద్గారాలనూ తగ్గించుకోవాలి. దీనివల్ల ఉద్గారాల పరిమాణం మొత్తంగా తగ్గిపోతుంది.


చేపట్టవలసిన రెండో చర్య బొగ్గు స్థానంలో జీవద్రవ్యాన్ని (వృక్షాలు, జంతువుల నుంచి సమకూరిన సేంద్రియ పదార్థాలు) ముడి పదార్థంగా ఉపయోగించడం. మా ప్రతిపాదన ఏమిటంటే ప్రతి థర్మల్‌ విద్యుత్కేంద్రమూ 20 శాతం జీవద్రవ్యాన్ని ఉపయోగించుకోవాలి. దీనివల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోతాయి.

అయితే వీటన్నిటికీ ఒక ప్రణాళిక అవసరం. ఇందుకు ఉద్గారాల తగ్గింపునకు లక్ష్యాలు నిర్దేశించి, వాటి పరిపూర్తికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం అవసరం. ఉదాహరణకు ప్రస్తుత ప్రభుత్వ ప్రణాళిక అత్యాధునిక బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇవి నిస్సందేహంగా పాత సాంకేతికతల కంటే మరింత సమర్థమైనవి. అయితే విధానపరంగా సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో ఈ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో నలభై శాతం, 50 శాతం కంటే తక్కువ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ కన్నా తక్కువగా పని చేస్తున్నాయి. అంటే ఉద్గారాలు పాత సాంకేతికతతో నడిచే ప్లాంట్లలో కంటే అధికంగా విడుదలవుతున్నాయి. పాత విద్యుత్కేంద్రాలలో విద్యుదుత్పాదన ఉత్పత్తి వ్యయం తక్కువ. పెట్టుబడి వ్యయాలూ తక్కువ. సాంకేతికతల, ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన పెట్టుబడులూ తక్కువే. ఈ కారణంగానే బొగ్గు ఇప్పటికీ విద్యుదుత్పాదనకు అనివార్యంగా ప్రధాన అవసరంగా ఉన్నది. దానిని తొలగించాల్సిన అవసరమున్నది. అది సుసాధ్యమే.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:42 AM