Bihar Elections: ఆటగాళ్ళకన్నా అంపైర్ ముఖ్యం
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:56 AM
బిహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ఎన్నికల వ్యూహరచన సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా నవంబరు 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికలు ఇండియా బ్లాక్/ మహాగఠ్...
బిహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ఎన్నికల వ్యూహరచన సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా నవంబరు 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికలు ఇండియా బ్లాక్/ మహాగఠ్ బంధన్ బలహీనతల్ని, తేజస్వీ యాదవ్ అత్యుత్సాహాన్నీ, రాహుల్‌గాంధీ మంద్రస్థాయి ప్రతిస్పందననీ మరోసారి చాటి చెప్పాయి. రాహుల్‌గాంధీ ఓట్ చోరీ ఉద్యమాన్ని సాగించినంత ఉధృతంగా బిహార్ ఓటర్లను ఆకట్టుకునే పని చేయలేకపోయారు.
సంఘపరివారంలో వందకు పైగా సంఘాలు ఉన్నాయి. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ వంటి ధార్మిక సంఘాలే గాక పసిపిల్లల నుంచి అంధుల వరకు అనేక రకాల సంఘాలు ఇందులో ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమూహాల్లో పని చేయడానికి కూడా వేరువేరు సంఘాలు ఉన్నాయి. వీటన్నింటి రాజకీయ వేదిక బీజేపీ. ఇవన్నీ ఏకశిలా సదృశ్యంగా మనసా వాచా కర్మణా ఒకే ఆలోచనతో, ఒకే లక్ష్యంతో తమతమ రంగాల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తుంటాయి. వాటికి అవసరానికి మించిన నిధుల్ని దేశంలోని మెగా కార్పొరేట్లు సరఫరా చేస్తుంటాయి. దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పార్టీ నడిపే సోషల్ మీడియాలు, వారి అభిమానులైన ‘అన్–సోషల్’ మీడియా హౌస్‌లు సహజంగానే విపక్షాలను అప్రతిష్ఠపాలు చేయడం కోసం, బీజేపీని గెలిపించడం కోసం 24/36౫ రోజులు పనిచేస్తుంటాయి. ఇది సంఘపరివారం విజయ రహస్యం.
మరోవైపు, బీజేపీ ప్రత్యర్థులకు సిద్ధాంతపరంగా ఏక సమైక్యతా సూత్రం ఏమీ లేదు. వాళ్ళకు ఒక బైండింగ్ వైర్ లేదు. ఒక పదం కోసం, ఒక్కోసారి ఒక్క అక్షరం కోసం, ఒక్క సీటు కోసం ఆ పార్టీలు హోరాహోరీగా కొట్లాడుకుని వీధులకు ఎక్కుతుంటాయి. పైగా నాలుగున్నరేళ్ళు పూర్తి విశ్రాంతి తీసుకుని ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే మేలుకుంటాయి. వీటికి కూడా కొన్ని ప్రజాసంఘాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ భాగం లెటర్ హెడ్ సంస్థలు. నేల మీద నిలబడి ప్రజల్లో పనిచేసేవి చాలా తక్కువ. బీజేపీ–ఎన్డీఏలను వ్యతిరేకించేవారు సహితం ఇండియా బ్లాక్/ మహాగఠ్ బంధన్ అంతఃకలహాలను చూసి అసహ్యించుకుంటారు.
తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ మీద సహజంగానే ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఈసారి మహిళా ఓటర్లు గుర్రుగా ఉన్నారనే మాట బిహార్‌లో వినిపించింది. అంతే, ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద అక్టోబరు 6న ఒక్కో మహిళ అకౌంట్లో పది వేల రూపాయల చొప్పున వేసేశారు నితీశ్. ఈ పథకం కింద కోటి 40 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి రూ.14వేల కోట్లు జమ చేశారని అంచనా. నిజానికి, బిహార్‌లో అక్టోబరు 6 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఒక విధంగా ‘ఓటుకు నగదు’ పథకం. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి. అలా జరగలేదు.
స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రధాన ఆదర్శాలుగా ప్రకటించిన భారత రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నెత్తిమీద పెట్టుకుంటారు. వీలున్నప్పుడల్లా ‘‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’’ తమ విధానం అంటుంటారు. కానీ, వారి పార్టీ మాత్రం దేశం మొత్తం మీద ఒక్క సీటు కూడా ముస్లింలకు కేటాయించదు. ముస్లింలను అణచివేస్తున్నామనే సంకేతాలు ఇస్తే హిందూ సమాజంలోని ఛాందస సమూహం తమకు ఓటేస్తుందనేది ఆ పార్టీ ఎత్తుగడ. ఇది ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలను ఇస్తోంది.
మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీతో అంత హోరాహోరీగా పోరాడిన ఎంఐఎం పార్టీని మీడియా ‘బీజేపీ–బీ టీమ్’ అనడం విచిత్రం. ఈ నింద నుంచి బయటపడడానికి ఈసారి ఎంఐఎం బిహార్‌లో మహాగఠ్ బంధన్‌లో చేరడానికి చాలా ప్రయత్నించింది. కానీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎంను తమలో చేర్చుకోవడానికి బీజేపీ వ్యతిరేక మహాగఠ్ బంధన్ (ఇండియా బ్లాక్) భయపడింది. ఎంఐఎంతో జతకడితే సంఘపరివారం తమను మొత్తంగా ‘గడ్డాలు, టోపీల కూటమి’ అంటుందని దాని భయం. తమకు 6 సీట్లు ఇచ్చినా సర్దుకుంటామని ఎంఐఎం అభ్యర్థించినప్పటికీ, ఈ ప్రతిపాదనను ఆర్జేడీ తేజస్వీయాదవ్ గట్టిగా తిరస్కరించారు. ఫలితంగా ఎంఐఎం గ్రాండ్ డెమోక్రాటిక్ అలయన్స్ (జీడీఏ)ను ఏర్పాటు చేసింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న పద్ధతిలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారన్నదే ప్రామాణికంగానీ, ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు మద్దతు పలికారన్నది కొలమానం కాదు. ఆర్జేడీకి కోటి 80లక్షల ఓట్లు (23శాతం) వచ్చాయి గానీ సీట్లు 25 మాత్రమే వచ్చాయి. బీజేపీకి 96లక్షల ఓట్లు, అంటే ఆర్జేడీ కన్నా రెండున్నర శాతం తక్కువ ఓట్లు వచ్చినా 91 సీట్లు వచ్చాయి. జేడీయూకు 90 లక్షల ఓట్లు వచ్చాయి (19 శాతం) 84 సీట్లు వచ్చాయి. 9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు 5 సీట్లు వస్తే, 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చిన ఎల్‌జేపీకి 20 సీట్లు దక్కాయి. ఇక్కడ ఓట్లకూ సీట్లకూ పొంతన లేదు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవో చాలామందికి గుర్తుండవు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ, ఎన్నికల కమిషన్‌లను మాత్రమేగాక, అవసరం అయితే సుప్రీంకోర్టును సహితం బీజేపీ తన భాగస్వామ్య పక్షంగా మార్చుకోగలదు. దాని సామర్థ్యం అపారం. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) బిహార్ ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తీసేసింది. మరికొన్ని లక్షల మందిని కొత్తగా చేర్చింది. బిహార్‌లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్లేస్తారనే సమూహాలను జాబితా నుంచి తొలగించారనీ, ఎన్డీఏ కూటమికి అనుకూలురైన వారిని కొత్తగా చేర్చారని ఆరోపణలున్నాయి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఈ వ్యూహాన్ని రచించి అమలు చేశారని రాహుల్‌గాంధీ గణాంకాలతో సహా చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని తేలిగ్గా కొట్టివేయలేం.
1980–90ల నాటి మాట. స్వదేశీ పిచ్‌ల మీద ఇండియా కన్నా పాకిస్థాన్ మెరుగైన ఫలితాలను సాధిస్తున్న కాలంలో ఒక స్పోర్ట్స్ ప్రతినిధి ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్‌ను ఒక చిత్రమైన ప్రశ్న వేశాడు. ఇండియా టీమ్‌లోకి పాకిస్థాన్ టీమ్ నుంచి ఒక ప్లేయర్‌ను తీసుకోవాల్సి వస్తే తన ప్రాధాన్యం ఎవరూ? అని అడిగాడు. దానికి గవాస్కర్ అంతకన్నా చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ‘‘నేను ఏ పాకిస్థానీ ఆటగాడినీ ఎంచుకోను. నిజానికి, నేను భారత జట్టులోకి పాకిస్థానీ అంపైర్‌ను తీసుకుంటాను!’’ అన్న అర్థం వచ్చేలా సమాధానం చెప్పాడు. ‘ఆటగాళ్లకన్నా అంపైర్ల తప్పుడు నిర్ణయాలవల్లే పాకిస్థాన్ గెలుస్తున్నది’ అని చెప్పడం గవాస్కర్ ఉద్దేశ్యం. బిహార్ ఎన్నికల ఫలితాలను చూశాక గవాస్కర్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నికల ప్రధానాధికారులు ఉంటే చాలు మోదీజీ–అమిత్‌జీల జోడీ ఎన్ని విజయాలనైనా సాధించగలదు.
డానీ
సమాజ విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం