అందాల పోటీలు అనేక సవాళ్లు
ABN , Publish Date - May 15 , 2025 | 02:19 AM
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు, అధికారుల్లో అత్యుత్సాహాన్ని, ఆలోచనాపరుల్లో కొంత కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఈ పోటీలకు పెద్ద ఖర్చు పెట్టడం లేదనీ, పైగా దీని ద్వారా తెలంగాణాలో టూరిజం పెరుగుతుందని ప్రభుత్వం అంటోంది. డబ్బు తక్కువైన రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులని...
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు, అధికారుల్లో అత్యుత్సాహాన్ని, ఆలోచనాపరుల్లో కొంత కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఈ పోటీలకు పెద్ద ఖర్చు పెట్టడం లేదనీ, పైగా దీని ద్వారా తెలంగాణాలో టూరిజం పెరుగుతుందని ప్రభుత్వం అంటోంది. డబ్బు తక్కువైన రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులని ఆహ్వానించటానికి పడే తంటాల్లో ఇదీ ఒకటని అర్థం చేసుకుందాం అనుకున్నా, అంతకుమించి గత ప్రభుత్వం చేయలేనిది తామేదో కొత్తది చేసి, తామెంత గొప్ప వాళ్ళమో నిరూపించుకోవాలన్న కోరికే ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. మిస్ వరల్డ్ నిర్వాహకులు దీనివల్ల ఆడవాళ్ళలో ‘స్ఫూర్తి’ పెరుగుతుందని ప్రకటించారు. కానీ, ఈ కార్యక్రమం ప్రధానంగా మగవాళ్ళలోనే ఎక్కువ స్ఫూర్తిని నింపుతోందని మీడియా రిపోర్టులు చూస్తే తెలుస్తుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో మానవ అభివృద్ధి సూచికలో, ముఖ్యంగా చదువు, ఆరోగ్యంలో వెనకబడి, అన్ని రకాల హింసనీ ఎక్కువగా ఎదుర్కొంటున్న సాధారణ తెలంగాణ మహిళలకి, రాజకీయాలు, ఉద్యోగాలు, పరిశ్రమల్లో వాటా లేనట్లే ఈ ప్రపంచ సుందరి పోటీలని టీవీలలో చూడటం తప్ప ఏమీ దొరకదు. వాళ్ళకేమీ సౌందర్య పిపాస తక్కువ లేదు. ఉన్నంతలో మంచిగా తయారవుతారు. చీరల రంగులు, జాకెట్ల డిజైన్లు, మ్యాచింగ్ నగల విషయంలో అన్ని సమూహాల స్త్రీలకీ, తమ స్థోమతని బట్టి కావాల్సినంత ఆసక్తి ఉంది. అదే లేకుంటే ఇన్ని రకాల దుకాణాలు, ఇంస్టాగ్రామ్ అకౌంట్లు, గల్లీ చివర మగ్గం వర్క్ షాపులు పెరిగేవి కాదు. ఈ గల్లీ ఫ్యాషన్ ప్రపంచంలో భర్తలు, మగవాళ్ల కంటే, తోటి ఆడవాళ్ళ ప్రశంసలే ప్రధానం.
తెలుగు సినిమాలు ఆడవాళ్లకి ఉండాల్సిన ప్రధాన గుణం అందం అనీ, వాళ్ళు కేవలం మగవాళ్ళ కోసమే అందంగా తయారవుతారనీ దశాబ్దాలుగా అందర్నీ నమ్మించటానికి ప్రయత్నిస్తున్నాయి. 20వ శతాబ్దం మధ్యలో చదువులు, ఉద్యోగాల కోసం పరదా నుంచి బయటకొచ్చిన ఆధిపత్య కుల స్త్రీలకి ఆధునిక సంస్కృతి తొడిగిన కొత్త పరదాల్లో ఒకటి అందం. చీర, దాన్నుండి కనీ కనిపించకుండా అతి సన్నటి నడుము, పెద్ద జడ, బొట్టు ఉండే స్త్రీ శరీర రూపాన్ని తెలుగు సౌందర్యానికి ప్రతీకగా చేసిన బాపు బొమ్మ కొన్ని తరాల ఊహల్ని నిర్దేశించింది. ఓల్గా రాజకీయ కథలు, స్త్రీవాద కవిత్వం స్త్రీల జీవితాలని ఇటువంటి ఊహలు ఎంత బలంగా నియంత్రిస్తాయో వివరంగా విశ్లేషించినప్పటికీ, వాటి ప్రభావం చదువుకుని ఆలోచించే ప్రజలకే పరిమితమైంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, కొద్ది మినహాయింపులతో, స్త్రీలు = అందం అనే మూసలోనే బందీగా ఉండిపోయాయి. హీరోయిన్ల శరీర కొలతల గురించి బహిరంగంగా మాట్లాడటం, ‘మిల్కీ బ్యూటీ’, ‘అందాలు ఆరబోయటం’, ‘నడిచొచ్చిన అందం’ అంటూ వర్ణించటం ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ రోజువారీ పదజాలంతో భాగం.
ఇలా ఆడవాళ్ళని అందమైన శరీరాలుగా మాత్రమే చూసే భావన 1990లో జరిగిన ప్రపంచీకరణ తర్వాత వస్తు ప్రధాన సంస్కృతిలో బాగా ఊపందుకుంది. 1990 లలోనే సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరీమణులు అయ్యారు. గత ఇరవయ్యేళ్ళల్లో వస్తువుల ఉత్పత్తితో పాటు వాటిని అమ్ముకోవటానికి స్త్రీల అందం ఒక ప్రధాన వనరుగా మారింది. ఈ సంస్కృతిలో అందమనే భావన కూడా రూపాంతరం చెందింది. అప్పటి వరకూ పుట్టుకతో వచ్చిన శరీర సౌందర్యం కొంతమంది ఆడవాళ్ళకి పెళ్లి కోసం పనికొచ్చేది. అందాన్ని ఆడవాళ్ళందరికీ తప్పకుండా ఉండాల్సిన గుణాల్లో ఒకటిగా మార్చింది మార్కెట్. అందానికి ఒక కొత్త మూసని తయారు చేసింది. శరీరంపై ఒక్క వెంట్రుక లేకుండా, గీసిన కనుబొమలు, నల్లటి జుట్టు, సన్న ముక్కు, తెల్లటి చర్మం, ఎర్రని పెదవులు కలిగి ఉండటం దీనిలో భాగం. అత్యధిక శాతం భారతీయ స్త్రీలు దీనిలో ఇమడరు. చక్కగా కనిపించాలనే వారి సహజమైన కోరికని మార్కెట్ సంస్కృతి వాళ్ళ బలహీనతగా రూపుదిద్దింది. మా ఉత్పత్తులు వాడితే మీరు అందంగా తయారవుతారు అంటూ ఊదరగొట్టింది. అంతే కాదు, అందంగా ఉంటేనే సంతోషం, ఉద్యోగం, కెరీర్ అన్నీ సాధ్యమవుతాయనే సరికొత్త సక్సెస్ నమూనాని సమాజంలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అందాల పోటీలు ప్రపంచ స్థాయి నుండి సాధారణ కాలేజీ ఫెస్టివల్‌లో భాగంగా మారితే; చర్మ సౌందర్య ఉత్పత్తులు, మేకప్ సామాగ్రి అనేకమంది విద్యార్థులు, ఉద్యోగినుల నెలవారీ సామాన్లలో భాగమయ్యాయి. తెల్ల జుట్టు ఉండే ఆడవాళ్లు సినిమాలు, సీరియళ్లలోనే కాదు, నిజ జీవితంలో కూడా కనిపించటం మానేశారు. మార్కెట్ సంస్కృతిని తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా దీని నుంచి బయట పడలేనంత లోతుగా ఈ సౌందర్య భావజాల ప్రభావం వ్యాపించింది. ఈ నిర్దేశిత సౌందర్య నమూనా నుండి పక్కకి జరిగితే చాలు, దాన్నొక జీవిత వైఫల్యంగా చూడటం మొదలైంది.
అయితే, సౌందర్య భావజాలం కేవలం శరీరం బయట ఆగిపోదు, లోపలికి ఇంకుతుంది. అది ఆడవాళ్ల ఆంతరంగిక చూపులో భాగంగా మారి, వాళ్ళు తమని తాము అంచనా వేసుకునే తీరునీ, ఆత్మవిశ్వాసాన్నీ ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం టీనేజీ అమ్మాయిలు, యువతులలో తీవ్రంగా కనిపిస్తుంది. ఈ సౌందర్య మూసల్లో ఇమడటానికి అమ్మాయిలు తిండి మానెయ్యటంతో వారిలో అనేక శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ పుణ్యమాని నగరాలకి పరిమితమైన ఈ రుగ్మతలు అన్ని చోట్లకీ పాకాయి. ముప్పై ఏళ్ల ప్రపంచీకరణ తర్వాత, బ్యూటీ పార్లర్లు ప్రతి గల్లీలో పుట్టుకొచ్చి, అనేకమంది యువతుల జీవితాల్లో సౌందర్య ఉత్పత్తులు భాగమైపోయి, అందం పరిశ్రమగా మారిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలని నిర్వహించి కొత్తగా ఏం సాధించాలని అనుకుంటోంది? దీనితో పాటు ఒక సమాజంగా మనం ఇప్పుడు వేరే ప్రశ్నలు కూడా అడగాలి. ఫ్యాషన్ పరిశ్రమలోకి వెళ్లే ఆడవాళ్ళని మినహాయిస్తే, ఈ అందం నమూనాలలో ఇమడలేని అత్యధిక శాతం అమ్మాయిల మానసిక సంఘర్షణ గురించి మన వ్యవస్థలో అసలేమైనా అవగాహన ఉందా? ప్రభుత్వం గానీ, ఇతర విద్యా సంస్థలు గానీ దీని గురించి అధ్యయనాలు చేశాయా? చదువు, ఉద్యోగాలతో వచ్చే ఆత్మవిశ్వాసాన్ని ఈ సౌందర్య నమూనాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి?
ఈ విమర్శ మార్కెట్ నుంచి బయటపడి, అందంగా కనిపించాలనే ఆశని, చక్కగా తయారవ్వాలనే కోరికని వదిలేసుకొమ్మని, ఇతరులిచ్చే కాంప్లిమెంట్లని ఆస్వాదించరాదని చెప్పదు. అలంకరణలో స్త్రీల వ్యక్తిగత ఇష్టాలు, నిర్ణయాధికారం ఉంటాయి. కానీ వారి నియంత్రణలో లేని మార్కెట్ పెద్దది, అక్కడ స్వయం నిర్ణయాధికారం తక్కువ. మార్కెట్ ఆడవాళ్ళకిచ్చే ‘ఛాయిస్’ ఎటువంటిది? బట్టలు, చెప్పులు, హెయిర్ క్లిప్పులు చవకగా అందించటం సరే, మన వేడి వాతావరణానికి సరిపడే సౌకర్యవంతమైన బట్టలు దొరుకుతున్నాయా? ఆడవాళ్ళ చెప్పులు గట్టిగా నడిస్తే తెగిపోయేటట్లు ఎందుకు తయారు చేస్తున్నారు? సల్వార్‌లకి జేబులు ఎందుకుండవు? అత్యధిక శాతం వాడే చర్మ సౌందర్య ఉత్పత్తులకి ప్రభుత్వ నియంత్రణ ఉందా? వివిధ వయసుల ఆడవాళ్ల ఆరోగ్యంపై వీటి ప్రభావం ఏంటి? ఇవి కేవలం ఆడవాళ్లే కాదు, ఈ మధ్య ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చిన మగవాళ్ళ గురించి కూడా వెయ్యాలి. వాళ్ళు వేసుకుంటున్న బిగుతు జీన్స్, వాడుతున్న హెయిర్ జెల్స్ శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
ఈ వ్యవస్థీకృత సౌందర్య నమూనా మనుషులకి తమతో, ఇతరులతో ఏర్పడే సంబంధాలని ప్రభావితం చేసి, జీవితంలో వచ్చే ఒత్తిళ్లకి తోడయినప్పుడు దాని గురించి లోతుగా ఆలోచించాలి. మా ఆవిడ ఎప్పుడూ దుప్పటి లాంటి నైటీ వేసుకు తిరుగుతుంది అంటూ ఇంట్లో పని చేసేటప్పుడు కూడా అందంగా ఉండాలని ఆశించే భర్తలు, నేను అందంగా లేను కాబట్టే నాకు స్నేహితులు లేరు అని ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న టీనేజీ పిల్లల కుంగుబాటు, ఉద్యోగినులు ‘స్మార్ట్’గా తయారైతేనే ప్రమోషన్లు ఇచ్చే బాసులు, అమ్మాయిలు వ్యాక్సింగ్ చేసుకోకుంటే డేటింగ్ కష్టం అని నమ్మే యువతీ యువకులు – ఈ పరిణామాలన్నీ అందం ఒక సామాజిక సమస్యగా తయారయిందని తెలియచేస్తున్నాయి. వ్యక్తిగతంగా సంతోషం కలిగించే స్థాయి నుంచి మనల్ని నియంత్రించే పనిముట్టుగా తయారయిన సౌందర్య పిపాసని మళ్ళా మన నియంత్రణలోకి ఎలా తెచ్చుకోవాలన్నది ఇప్పుడు మన ముందున్న సవాలు!
ఎ. సునీత
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి