BC Movement Losing Its Roots: మూలాలు విస్మరిస్తున్న బీసీ ఉద్యమం
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:08 AM
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న వంటి నాయకులు బీసీల సమస్యలపై అంకితభావంతో పనిచేశారు. సిద్ధాంత బలం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజసేవే....
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న వంటి నాయకులు బీసీల సమస్యలపై అంకితభావంతో పనిచేశారు. సిద్ధాంత బలం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజసేవే పరమావధిగా వీరి ఆలోచనలు ఒక తరం బీసీ నాయకత్వాన్ని తీర్చిదిద్దాయి. విద్య, ఉద్యోగ రంగాలలో బీసీ రిజర్వేషన్లు సాధించడం వారి చారిత్రక విజయం. ఇది లక్షలాది బీసీల జీవితాలలో మార్పు తెచ్చింది. 1991 తర్వాత వచ్చిన ఉదార ఆర్థిక విధానాల నేపథ్యంలో సమాజ నిర్మాణం పూర్తిగా మారింది. ప్రైవేటీకరణ, మార్కెట్ ఆధిపత్యం గ్రామీణ వృత్తుల పతనం, కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నాయి. దీంతో బీసీల సంప్రదాయ నాయకత్వం బలహీనపడింది. ఇప్పుడున్న బీసీ నాయకత్వం కుల ఆధారిత చిన్న చిన్న సంఘాలకు పరిమితమైంది. సిద్ధాంతం, అంకితభావం, సామాజిక దృక్పథం కొరవడింది. అట్టడుగు స్థాయిలోని బీసీల వృత్తి సంక్షోభం, బతుకుదెరువు, ఆరోగ్యం పాఠశాలల అందుబాటు ఆహారం, నివాసం వంటి విషయాలను పాలకులు విస్మరిస్తున్నారు. దీని మూలంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ సమీకరించే నాయకత్వం లేదు. బీసీ సంఘాలన్నీ రాజధానికి పరిమితమైనాయి. గ్రామాలు, జిల్లాలు, వ్యవసాయ కార్మికులు, నేతగాళ్లు, గొర్ల కాపర్లు, పశువుల పెంపకం, మత్స్యకారులు మొదలైన వృత్తి వర్గాలతో నెట్‌వర్క్ లేదు. అందువల్ల గ్రామీణ బీసీలలో ఈ సంఘాలపై నమ్మకం తగ్గింది.
బీసీ ఉద్యమం ఇప్పుడు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వరకే పరిమితమైంది. బీసీల అసలైన జీవన్మరణ సమస్యలు అనేకం ఉన్నాయి. వీటి గురించి మాట్లాడే బీసీ సంఘాలు లేవు. ఉదాహరణకు గత రెండు సంవత్సరాల నుంచి సిరిసిల్ల మరమగ్గాల రంగంలో విద్యుత్ సబ్సిడీ సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల సగం మగ్గాలు మూతపడ్డాయి. ఫలితంగా 20 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఏ ఒక్క బీసీ సంఘం కనీసం స్పందించలేదు. ఇలాంటి సమస్యలు తెరమరుగవుతున్నాయి. బీసీ సంఘాలు తమ జీవన్మరణ సమస్యలైన జీవనోపాధుల కోసం పనిచేస్తాయనే విశ్వాసం ఎవరికీ లేదు. వీటిపై ఒక సమగ్రమైన ఉద్యమ స్వరూపం నిర్మించుకోకపోతే బీసీ ఉద్యమం సంపూర్ణతను సంతరించుకోదు.
తొలితరం బీసీ నాయకులు కులవృత్తుల రక్షణ, అభివృద్ధి కోసం సహకార సంఘాలను స్థాపించారు. వీటి ద్వారానే బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. నేటి ప్రభుత్వ విధానాల వల్ల సహకార వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నా, ఏ ఒక్క బీసీ సంఘం దానిపై ఉద్యమించలేదు. బీసీ ప్రజల ఆలోచనలకు, అవసరాలకు– సంఘాల నాయకత్వాలకు మధ్య లోతైన అగాథం ఉంది. ఈ అగాథం పూడ్చే ప్రయత్నం చేయనంతవరకు బీసీ ఉద్యమం మీడియాకే పరిమితమవుతుంది. బీసీ ప్రజల ఆలోచనలే పునాదిగా ముందుకు సాగే ఉద్యమం మాత్రమే బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధం లేని, సిద్ధాంతపరమైన అంకితభావం గల నిష్పాక్షికమైన బీసీ ఉద్యమం అవసరం ఎంతైనా ఉంది. కులాలను దాటి బీసీల ఐక్యత నిర్మించాలి.
ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) కులాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. బీసీ ఉద్యమంలోనూ నిరాదరణకు గురవుతున్నాయి. రిజర్వేషన్ల ఫలాలను 25శాతం మంది బీసీలే అనుభవిస్తున్నారని 2023లో రోహిణి కమిషన్ తేల్చి చెప్పింది. దీనిపై బీసీ ఉద్యమం వ్యూహాత్మక అడుగులు వేయాలి. అప్పుడే ఉమ్మడి అస్తిత్వం వృద్ధి చెందుతుంది. బీసీ కులాల మధ్య సాంస్కృతిక ఐక్యత రావాలి. కనీసం వీరి మధ్య సమష్టి భోజనాలు, పరస్పర వివాహాలు ప్రోత్సహించాలి. సంక్షేమం కన్నా అభివృద్ధి అంశాలను తెరపైకి తేవాలి. యువతరానికి నాయకత్వ శిక్షణ ఇవ్వాలి. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలలో బీసీ ఉద్యమశక్తులతో బలమైన నెట్‌వర్క్ ఏర్పరచాలి. బీసీల ఉమ్మడి స్వప్నం సాకారం చేసుకునేందుకు ఉద్యమాన్ని ముందుకు నడపాలి. అప్పుడే ఆధిపత్య వర్గాలలో సైతం సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
తడక యాదగిరి
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..