Share News

Bala Saraswati: వెన్నెల సునాదమే బాలసరస్వతి గానం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:32 AM

బాలమురళీకృష్ణ అసలు పేరు అది కాదు. మురళీకృష్ణ మాత్రమే! అలాగే బాలసరస్వతి అసలు పేరు కూడా అది కాదు. సరస్వతి మాత్రమే! ఎనిమిదేళ్ల వయసులో మురళీకృష్ణ సంగీత కచేరి చేసినప్పుడు....

Bala Saraswati: వెన్నెల సునాదమే బాలసరస్వతి గానం

బాలమురళీకృష్ణ అసలు పేరు అది కాదు. మురళీకృష్ణ మాత్రమే! అలాగే బాలసరస్వతి అసలు పేరు కూడా అది కాదు. సరస్వతి మాత్రమే! ఎనిమిదేళ్ల వయసులో మురళీకృష్ణ సంగీత కచేరి చేసినప్పుడు శ్రోతలు పొంగెత్తిన మురళీగాన రసవాహినిలో లీనమైపోయారట. అదే సభలో ఉన్న ప్రసిద్ధ హరికథా విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ గారు ముగ్ధులై ‘బాలమురళీ’ అని ముద్దుగా పిలిచి మూర్ధం ఆఘ్రాణించి ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. అలాగే సరస్వతి కూడా! ఆమెకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు కె.సుబ్రహ్మణ్యం (ప్రముఖ నర్తకి పద్మాసుబ్రహ్మణ్యం తండ్రి) నిర్మించిన భక్త కుచేల, భక్త యోగిని చిత్రాలలో నటించి, ఆ చిత్రాలలో దాదాపు అన్ని పాటలూ పాడారు. సుబ్రహ్మణ్యం ఆమెని ‘బాలసరస్వతి’ అని ప్రేమగా పిలిచేవారట. అప్పటి నుంచి అందరూ అలానే పిలవటం మొదలుపెట్టారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదే పేరు ఆమెకు.

మాటల మధ్యలో బాలసరస్వతి చెప్పారు, ‘‘మద్రాసు, విజయవాడ రేడియో స్టేషన్లలో నాతోనే లలిత సంగీతం మొదలైంది. ఎన్ని పాటలు పాడానో! మొదట్లో సంగీత దర్శకులు చెప్పినట్టు పాడినా తర్వాత తర్వాత నేను పాడవలసిన పాటలను నేనే స్వరపరచుకుని తిన్నగా రేడియో స్టేషన్‌కు వెళ్లి పాడేదాన్ని. నాకు శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి లేదు, అసలు ఇష్టమే లేదు. కాకపోతే క్లాసికల్ బేస్ ఉండాలని అందరూ చెప్పబట్టి మద్రాసులో అలత్తూరు సుబ్బయ్య గారి దగ్గర మూడేళ్లపాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. బొంబాయిలో సినీ సంగీత దర్శకుడు వసంతదేశాయి వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాను. మద్రాసులో ఉన్నప్పుడే పియానో, వీణ రెండూ నేర్చుకున్నాను. నా పాట బాగుంటుందని అందరూ అంటారు. ఎంత బాగుంటుందో నాకు తెలియదుగానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. ఆరుద్ర, రజనీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వింజమూరి శివరామారావు, సి.నారాయణరెడ్డి, సన్యాసిరాజు (ఎస్. రాజేశ్వరరావు సోదరుడు) ఇలా ఒకరా, ఇద్దరా ఎందరెందరో రాసిన పాటలు పాడాను. వాళ్ల సాహిత్యంలోనే సగం సంగీతం ఉండేది. ఆ పాటల్లోని భావం చెడకుండా శ్రోతల మనసుకు హత్తుకునేలా పాడాలని తాపత్రయపడేదాన్ని. పాట పాడే వారికి కవి భావనను పట్టుకోగల శక్తీ, నేర్పూ ఉండాలి’’ అన్నారు. ఎంత చక్కటి మాట!


బాలసరస్వతి పాట పాడుతూంటే ఎక్కడో ఏ వంపులోనో ఒక గమకంలోనో మాధుర్యం తొణికిసలాడటం కాదు. పాట మొత్తం నెత్తావులు చిమ్ముతుంది. ‘ఆహా! ఏమి పాట’ అని మురిసిపోతాం. మా సంభాషణ సాగుతూ ఉండగా ‘టీ’ వచ్చింది. ‘ఆ! అన్నట్లు మీరూ రేడియో మనిషే కదూ! మీకో సంగతి చెప్పాలి. రేడియోలోకి నా ప్రవేశం ఎలా జరిగిందో చెబుతా. ఇల్లాలు అనే సినిమాలో నేనూ ఎస్. రాజేశ్వరరావు కలిసి నటించాం. మద్రాసు జెమినీ స్టూడియోలో రికార్డింగ్. అప్పుడే రేడియో స్టేషన్ నుంచి జనమంచి రామకృష్ణ, ఆచంట జానకిరామ్, ఎస్.ఎన్.మూర్తి వచ్చారు. రాజేశ్వరరావు నన్ను వారికి పరిచయం చేశారు. వారు నా పాట విని మెచ్చుకున్నారు. ఎస్.ఎన్.మూర్తి– నన్నూ, రాజేశ్వరరావునూ, మా వాద్య బృందాన్నీ జెమినీ స్టూడియో నుంచి తిన్నగా రేడియో స్టేషన్‌కు తీసుకువెళ్లి, నా చేత కొన్ని పాటలు పాడించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసారు. అలా రేడియో ఆర్టిస్ట్ అయ్యాను. నేను రేడియోలో పాడిన ‘ఈ ప్రేమ ఎలా కలిగెనో నాలో, నల్లనివాడ నే గొల్ల కన్నెనోయి, ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు, బంగారు పాపాయి, హాయమ్మహాయి’ మొదలైన పాటలన్నీ గ్రాంఫోన్ రికార్డుగా కూడా వచ్చాయి.

‘‘మా రోజుల్లో సినిమాల్లో కానీ రేడియోలో కానీ ఇప్పటిలా కాదు. సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, వాద్య కళాకారులు అందరం కలిసి కూర్చుని ఒక్కో పాట పది పదిహేను రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్లం. అందుకే ఆ పాటలు నిలబడ్డాయి. ఇప్పుడు కూడా నా పాటలు రేడియోలో వింటూ ఉంటాను’’ అన్నారు.

చాలా ఏళ్ల క్రితం ప్రసిద్ధ స్త్రీ వాద రచయిత్రి రంగనాయకమ్మ రేడియో కోసం బాలసరస్వతి గారిని ఇంటర్వ్యూ చేసారు. ‘సంగీతపు లోతులు, అంచులు చూసిన మనిషిగా మీరు ఎప్పుడో పాడిన పాటలను ఇప్పుడు వింటున్నప్పుడు... అయ్యయ్యో! ఈ పదం ఇలా పలకవలసింది, ఈ గమకం ఇలా అని ఉండవలసింది, ఇలా అని ఉంటే ఇంకా బాగుండేది’ అనిపించిన సందర్భాలు ఉన్నాయా?... ‘‘చాలానే ఉన్నాయి’’.


‘అవునూ, మీరు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే పాడతారు. ఎందుకనీ?’... ‘‘నాకు అలా పాడటమే ఇష్టం. అలవాటు కూడా! పై స్థాయిలో పాడితే స్వర లాలిత్యం పోతుందనుకునేదాన్ని. పైగా నేను ఎక్కువగా ప్రణయగీతాలు – కృష్ణుడి మీద పాడాను. ప్రేమ సున్నితంగా నాజూకుగా ఉంటుంది. దాన్ని పొదివి పట్టుకోవాలని పిచ్చి కోరిక.’’

‘1936లో మీరు సినీరంగ ప్రవేశం చేసారు. 1958 వరకూ మీరు నటించారు, పాడారు. తర్వాత అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. కారణం ఏమిటి? ఆఫర్స్ రాకనా? ఆరోగ్యం సరిగా లేకనా?’ అని రంగనాయకమ్మ అడిగితే, బాలసరస్వతి పేలవంగా నవ్వి ‘‘రెండూ కాదు. ఎంకరేజ్‌మెంట్ లేక. ఇంట్లో సందర్భాలు సరిగాలేక. ఎవరెంత గొప్ప కళాకారులైనా ఇంట్లో ప్రోత్సహించేవారుండాలి. సంగీతాన్ని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, అభినందించేవారు ఉండాలి. అది లేకపోయింది నాకు. పైగా పాడరాదని నిర్బంధించారు. దానితో నేను మూగబోయాను’’ అన్నారు.

తర్వాత రంగనాయకమ్మ అడగవలసిన ప్రశ్నే అడిగారు. ‘మీ వారిని ఎదిరించలేకపోయారా?’... ‘‘అప్పడు నాకు అంత ధైర్యమూ, చొరవా, తెలివితేటలూ లేవు. బ్రతిమాలి భంగపడదలచుకోలేదు. మానేశాను’’ అన్నారు బాలసరస్వతి.

చివరిసారిగా ఆమె ఆకాశవాణి తునిలో, ఆహ్వానితుల సమక్షంలో ఏర్పాటుచేసిన సంగీత సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె పాడలేదు. భర్త రాజారావ్ ప్రద్యుమ్నకృష్ణ సూర్యారావు బహదూర్ మరణించాక ఆమె మళ్లీ మద్రాసు వెళ్లిపోయారు. 1974లో దర్శకులు రమేశ్‌నాయుడు, విజయనిర్మల పట్టుబట్టి ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో ఆమెతో ఒక పాట పాడించారు.

ఆమె పాట గురించి చెప్పాలంటే ఆమె కన్నా పై స్థాయి ఉండాలి. నాకు ఆ అర్హతలేదు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు పాడిన సంగీత రస సరస్వతి 1928, ఆగస్టు 28న జన్మించారు. ఈ నెల 15న తొంభై ఏడేళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు. వారికిదే అక్షర నీరాజనం.

ప్రయాగ రామకృష్ణ

ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 12:32 AM