Share News

Andhra Pradesh Brand Image: ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అవార్డులు

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:13 AM

ప్రజా జీవితంలో అవార్డులు రావడం సహజం. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు వివిధ రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు లభించడం సాధారణ విషయం కాదు...

Andhra Pradesh Brand Image: ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అవార్డులు

ప్రజా జీవితంలో అవార్డులు రావడం సహజం. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు వివిధ రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు లభించడం సాధారణ విషయం కాదు. సమర్థ పనితీరుతో ఈ ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు ఒక విశ్వసనీయ బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మించారు. ఒక కుటుంబం ఐదు దిశల్లో ప్రజా జీవితాన్ని విలువలతో నడిపించినందుకు వచ్చిన సమష్టి గుర్తింపు ఇది. ఆ ఐదుగురు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా లోకేశ్‌, నారా దేవాన్ష్. చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు; భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుతో పాటు గోల్డెన్ పీకాక్ అవార్డు; నారా బ్రాహ్మణికి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు; నారా దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్–2025 అవార్డు; నారా లోకేశ్‌ పనితీరును దేశ ప్రధాని స్వయంగా ప్రశంసించడం. ఈ అవార్డులను కేవలం వ్యక్తిగత ఘనతలుగా చూడకూడదు. ప్రజాసేవా సంస్కృతి, బాధ్యతాయుత నాయకత్వం, విలువలతో కూడిన పనితీరుకు వచ్చిన సమష్టి గుర్తింపుగా చూడాలి.

చంద్రబాబుకు లభించిన అవార్డు ఆయన రాజకీయ జీవితానికి వచ్చిన ప్రశంస మాత్రమే కాదు. అది పాలనలో తెచ్చిన సంస్కరణలు, ఒక పాలనా మోడల్‌కు వచ్చిన గ్లోబల్ అవార్డు. అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, ఆర్థిక క్రమశిక్షణ, భవిష్యత్ తరాల కోసం రూపొందించిన విధానాలకు దక్కిన గౌరవం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐటీ విప్లవం, ఇన్వెస్టర్–ఫ్రెండ్లీ పాలసీలు ఇవన్నీ మాటలుగా కాదు, కార్యాచరణగా మారాయి. రాష్ట్రాల మధ్య పోటీ యుగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆలోచనలతో ముందుకు నడిపిస్తున్న రిఫార్మర్‌గా ఆయన నిలిచారు.


నారా భువనేశ్వరి నిస్వార్థంగా సమాజానికి స్వచ్ఛంద సేవలందిస్తూ ఆదర్శంగా నిలిచి, అంతర్జాతీయ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు–2025ను అందుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఈ అత్యుత్తమ అవార్డు, ఆమె చేసిన స్వార్థ రహిత సేవా యజ్ఞానికి దక్కిన సముచిత గౌరవం. తెలుగు మహిళా శక్తి, ఆంధ్రప్రదేశ్ సేవా సంస్కృతికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. అంతేకాదు హెరిటేజ్ ఫుడ్స్, ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో భువనేశ్వరి అందుకున్నారు.

నారా బ్రాహ్మణికి లభించిన అవార్డు వ్యాపార ప్రపంచంలో వారసత్వ ముద్రపై కాదు, సామర్థ్యంపై వచ్చినది. ఆధునిక నిర్వహణ, అంతర్జాతీయంగా నైతిక విలువల సమన్వయంతో ఆమె చూపిన నాయకత్వానికి ఇది గుర్తింపు. బ్రాహ్మణి దేశంలోనే ఉత్తమ బిజినెస్ ఉమెన్‌గా అవార్డు పొందడం, ప్రొఫెషనల్ పనితనంతో సాధించిన ఘనత. గ్లోబల్ మేనేజ్‌మెంట్ అనుభవం, కార్పొరేట్ విజన్, సంస్థల విస్తరణలో ఆమె చూపిన నాయకత్వం ఈ అవార్డుకు పునాది.

మంత్రిగా నారా లోకేశ్‌ పనితీరును దేశ ప్రధాని స్వయంగా ప్రశంసించడం సాధారణ రాజకీయ సంఘటన కాదు. ఈ ప్రశంసలు యువ నాయకత్వం పనితీరును సమర్థతతో కొలవచ్చనే సత్యాన్ని నిరూపిస్తున్నాయి. విద్య, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఆధునిక ఆలోచనలతో లోకేశ్‌ పనిచేస్తున్నారు. ప్రగతిశీల ఆలోచనలతో ఆరు నెలలుగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలను ప్రోత్సహిస్తూ నవశకానికి నవ్యాంధ్రను పరుగు తీయిస్తున్నారు. తల్లిదండ్రులు–టీచర్ల భాగస్వామ్యంతో పిల్లల భవిష్యత్తు నిర్మాణం సాధ్యమని మంత్రి లోకేశ్ నమ్మకం, అది దేశానికి ఒక మోడల్‌గా నిలిచిందని నారా లోకేశ్‌ను అభినందిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసాపత్రం ఇవ్వడం గర్వ కారణం. అట్లాగే నారా దేవాన్ష్‌ చెస్ ఆటలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్–2025 అవార్డును అందుకోవడం క్రమశిక్షణ, మేధస్సు, వ్యూహాత్మక ఆలోచనలకు దక్కిన గౌరవం.

కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం పార్లమెంట్ సభ్యులు

ఇవి కూడా చదవండి

2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

Updated Date - Dec 27 , 2025 | 01:13 AM