Atal Bihari Vajpayee legacy: సుపరిపాలనకు స్ఫూర్తిప్రదాత
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:25 AM
పండితుడు, ప్రజల మనస్సులో ఇప్పటికీ ప్రతిధ్వనించే కవి; క్రమశిక్షణ, సేవాభావంతో నిండిన స్వయంసేవకుడు; పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన రాజనీతిజ్ఞుడు; అధికారం కంటే...
పండితుడు, ప్రజల మనస్సులో ఇప్పటికీ ప్రతిధ్వనించే కవి; క్రమశిక్షణ, సేవాభావంతో నిండిన స్వయంసేవకుడు; పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన రాజనీతిజ్ఞుడు; అధికారం కంటే నైతికతను మిన్నగా భావించిన అరుదైన రాజకీయ నాయకుడు; దేశభక్తుడు; ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు– భారతరత్న అటల్‌బిహారీ వాజపేయి. ఆయన జన్మ శతాబ్ది, ఒక సత్యాన్ని దేశానికి గుర్తుచేసింది. నాయకులు కాలంతో వెళ్లిపోవచ్చు, కానీ వారి సిద్ధాంతాలు శాశ్వతంగా నిలుస్తాయి. వాజపేయి ఆదర్శాలు నేటికీ ప్రతి భారతీయుడికీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకు నవ భారత నిర్మాణంలో ప్రేరణ ఇస్తూనే ఉన్నాయి.
1984లో ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వాజపేయి మాట్లాడుతూ ‘‘అంధేరా ఛటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా’’ (చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది) అన్నారు. అప్పట్లో బీజేపీకి కేవలం రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నాయి. అయినా ఆయన నమ్మకం కోల్పోకుండా, కార్యకర్తల హృదయాల్లో ఆ నమ్మకాన్నే నాటారు. జనసంఘ్ నుంచి బీజేపీ వరకు 10సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా గెలిచారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ నియంతృత్వానికి ఎదురొడ్డి నిలిచిన నాయకుడు వాజపేయి.
బీజేపీ నుంచి తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విభిన్న భావజాలాల మిత్రపక్షాలను కలుపుకొని విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయినా, నైతిక విలువలతో రాజీపడని నాయకత్వం ఆయనదే. 1999లో కార్గిల్ చొరబాటు సమయంలో, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ వాజపేయి వెనుకడుగు వేయలేదు. ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యం విజయం సాధించింది. భారీ అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి, భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సాధించింది. ఈ ఆలోచనను మోదీ మరింత ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ ఇందుకు నిదర్శనాలు. నేడు రక్షణ రంగంలో భారత్ దిగుమతిదారుని నుంచి ఎగుమతిదారుగా మారింది.
సర్వ శిక్షా అభియాన్, స్వర్ణ చతుర్భుజి– జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధాన్‌మంత్రి గ్రామ సడక్ యోజన– గ్రామీణ రహదారుల నిర్మాణం, టెలికాం సంస్కరణలు, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి సంస్కరణలను మోదీ మరింత విస్తరించారు. నేడు భారత్ ప్రపంచంలో 67 లక్షల కిలోమీటర్ల రోడ్లతో రెండో అతిపెద్ద రహదారి నెట్‌వర్క్ కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరతో మన దేశంలో మొబైల్ డేటా లభ్యమవుతోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, వాజపేయి సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ నెలలో 14 రోజుల పాటు ‘అటల్–మోదీ సుపరిపాలన యాత్ర’ను ఆరంభించారు. ఈ ప్రత్యేక బస్ యాత్ర ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రయాణించి, ప్రతి జిల్లాలో కూటమి నేతలతో కలిసి వాజపేయి విగ్రహావిష్కరణలు, సభలు, సమావేశాలు నిర్వహించింది. ఈ యాత్ర ద్వారా ఆధునిక భారత నిర్మాణంలో వాజపేయి చేసిన సేవలను, ఆ స్ఫూర్తితో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలకు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాజపేయిని రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా, దార్శనికుడిగా అభివర్ణించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ధర్మవరం నుంచి యాత్రను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి మదనపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మతో పాటు అనేక ఎన్డీయే ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ 25 వాజపేయి జన్మదినోత్సవాన, అమరావతిలో ఈ యాత్ర ముగింపు సభ జరుగనున్నది.
వినుషారెడ్డి
బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News