Share News

Tirumala Temple Lord Venkateswara: ఆధ్యాత్మికతపై అధర్మ దాడి

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:29 AM

శేషాచల కొండలపై ఆసీనుడైన శ్రీనివాసుడు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాక, భారతీయ చరిత్రకూ, సంస్కృతికీ ప్రతీక. తిరుమల ఆలయ చరిత్ర దాదాపు 9వ శతాబ్దం నుంచి లిఖిత రూపం...

Tirumala Temple Lord Venkateswara: ఆధ్యాత్మికతపై అధర్మ దాడి

శేషాచల కొండలపై ఆసీనుడైన శ్రీనివాసుడు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాక, భారతీయ చరిత్రకూ, సంస్కృతికీ ప్రతీక. తిరుమల ఆలయ చరిత్ర దాదాపు 9వ శతాబ్దం నుంచి లిఖిత రూపం దాల్చింది. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాట్లు ఈ క్షేత్ర ప్రతి‌ష్ఠను కాపాడారు, వైభవాన్ని విస్తరించారు. తాళ్లపాక అన్నమాచార్యులు వంటి మహాకవులు తమ అమర కీర్తనలు, కావ్యాల ద్వారా స్వామి మహిమను లోకమంతటా ప్రచారం చేశారు. 14వ శతాబ్దంలో దిల్లీ సుల్తానులు దండయాత్రల్లో దక్షిణ భారత దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో కూడా తిరుమలను ఎవరూ తాకలేదు. ఆ కాలంలో శ్రీరంగం శ్రీరంగనాథస్వామి విగ్రహాలను సైతం ఇక్కడే భద్రపరిచారంటే ఆ దివ్య శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. బ్రిటిష్ వారి పాలనా కాలంలోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, అభివృద్ధికి సహకరించింది. వేలాది సంవత్సరాలుగా రాజులు, మతాలు, శాసనాలు మారినా తిరుమల మాత్రం దివ్యత్వంతో అజరామరంగా నిలిచింది.

తిరుమల అంటే ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం– లడ్డు. 1715 ఆగస్టు 2న (శ్రావణ శుద్ధ ఏకాదశి శనివారం) మొదలైన ఈ దివ్య ప్రసాద పంపిణీ 310 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పప్పు, నెయ్యి, చక్కెర, ఏలకులు, జీడిపప్పు, కిస్మిస్‌లతో శాస్త్రోక్తంగా తయారయ్యే ఈ లడ్డూ, రుచిలో అపూర్వం, సుగంధంలో అమోఘం, పవిత్రతలో అనుపమానం. ఆ అమృత ప్రసాదానికి 2009లో భారతదేశంలోనే తొలి ఆలయ ప్రసాదంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్, 2014లో ట్రేడ్‌మార్క్, 2017లో ఇండియా పోస్ట్ ప్రత్యేక తపాలా బిళ్ల... ఇలా అరుదైన గౌరవాలు దక్కాయి.


సహస్రాబ్దాల చరిత్ర గల తిరుమల పవిత్రతను వేలాది ఏళ్లుగా అందరూ కాపాడుకున్నారు. కానీ హిందూమత విశ్వాసాలపై నమ్మకం లేని గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్ల కల్తీ నెయ్యితో ప్రసాదం కలుషితం, పరకామణి కుంభకోణం, స్వామివారి ఆస్తుల దోపిడీ, ఆలయ నిర్వహణలో పలు అక్రమాలు, అవకతవకలు వంటి దారుణ సంఘటనలు టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాయి. కోటానుకోట్ల హిందూ భక్తులకు తీరని బాధను కలిగించాయి. ఇది కలియుగ వైకుంఠం పవిత్రతపై, భక్తి భావంపై జరిగిన దారుణమైన దాడి, క్షమించలేని నేరం.

కలియుగ బ్రహ్మాండ నాయకుడి దర్శనం తర్వాత భక్తి భావంతో స్వీకరించే పవిత్ర ప్రసాదమే ‘తిరుమల లడ్డూ’. అటువంటి లడ్డూలో రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి ఉపయోగించారన్న చేదు సత్యాలు బయటపడ్డాయి. అలాగే ప్రతి ఒక్కరూ తమ కోరిక నెరవేరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీలో కానుకలు, ముడుపులు సమర్పిస్తారు. భక్తుల కోరికలు తీర్చే ఆపదమొక్కుల వాడికి ముడుపులు చెల్లించే భక్తులను పరకామణి దోపిడీ కేసు తీవ్రంగా కలచివేసింది. అలాగే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు తలనీలాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. వీటి వేలం ద్వారా టీటీడీకి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీనిని కూడా గత ప్రభుత్వ దోపిడీదారులు వదల్లేదు. తలనీలాలను మయన్మార్, థాయ్‌లాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా, అస్సాం రైఫిల్స్ బృందం పట్టుకున్నది.

ఇవేకాక తిరుమలలో అన్యమతస్థుల నియామకాలు, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, కొండపై అన్యమత గుర్తులు, టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత బోధనలు, భక్తులకు అశ్లీల వెబ్ లింకులు పంపడం వంటి చర్యలతో స్వామివారి ప్రతిష్ఠను మరింతగా దిగజార్చారు. దర్శనం, వసతి అద్దె, టోల్‌గేట్, ప్రసాదాల ధరలు భారీగా పెంచి సామాన్య భక్తుడికి వెంకన్న దర్శనం దూరం చేశారు. టీటీడీని ఆదాయ మూలంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రచారానికి దుర్వినియోగం చేశారు. ఒకే సామాజికవర్గానికి పాలకమండలిలో ఎక్కువ పదవులు కట్టబెట్టారు. అన్నదానంలో నాణ్యతలేని బియ్యం, కల్తీ పదార్థాలు వాడారు; తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తుల తిరుగుబాటు దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. స్వామి నిధులను తిరుపతి మున్సిపాలిటీ పేరుతో దారి మళ్లించి దోచుకున్నారు. వీఐపీ బ్రేక్, సేవా టిక్కెట్ల అమ్మకాలు, దర్శన టిక్కెట్లు, ప్రసాదాల్లో బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు. విశాఖ శారదా పీఠానికి నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.

భక్తుల కోరిక ఒక్కటే– ఆలయ నిర్వహణలో రాజకీయ ప్రభావం, ధన ప్రాధాన్యం లేకుండా ఉండాలి. ఆలయ చరిత్ర– సంప్రదాయాలకు కట్టుబడి, శాస్త్రోక్త విధానాలను తప్పక పాటించాలి. ఏ వ్యవస్థనైనా దాని సంప్రదాయాలను గౌరవిస్తూ, సంస్కార వంతంగా నిర్వహించే పాలకులు ఉండాలి.

అనగాని సత్యప్రసాద్

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రి

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:29 AM