Share News

Citizens Voting Rights: భారత పౌరుల ఓటుహక్కుపై దాడి

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:49 AM

భారత గణతంత్ర రాజ్యంలో పుట్టిన, పుట్టబోయే ప్రతి భారత పౌరుడికి ఒక విలువైన ఆస్తి ఉన్నది. ఓటు హక్కే ఆ అమూల్య ఆస్తి. భారత పౌరుల సామూహిక ఓటు హక్కుల తొలగింపునకు మన పాలకులు ఇప్పుడొక సాహసోపేతమైన...

Citizens Voting Rights: భారత పౌరుల ఓటుహక్కుపై దాడి

భారత గణతంత్ర రాజ్యంలో పుట్టిన, పుట్టబోయే ప్రతి భారత పౌరుడికి ఒక విలువైన ఆస్తి ఉన్నది. ఓటు హక్కే ఆ అమూల్య ఆస్తి. భారత పౌరుల సామూహిక ఓటు హక్కుల తొలగింపునకు మన పాలకులు ఇప్పుడొక సాహసోపేతమైన ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ‘సర్‌’)ను చేపట్టనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ బృహత్‌ కార్యానికి తొలుత బిహార్‌లో శ్రీకారం చుట్టారు. ఆ తరువాత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోను, ఆపై విశాల భారతదేశమంతటా ఆ ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టి పూర్తి చేస్తారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కచ్చితంగా భారత పౌరుల సామూహిక ఓటుహక్కుల తొలగింపే, సందేహం లేదు.

నోట్‌ బంది (పెద్ద నోట్ల రద్దు– డీమోనిటైజేషన్‌), దేశ్‌ బంది (కోవిడ్‌ ఆపత్కాలంలో లాక్‌డౌన్‌) గుర్తున్నాయా? ఇప్పుడు ఓటుబంది (సామూహిక ఓటు హక్కుల తొలగింపు)కే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు పూనుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏమో గానీ ఈ ప్రక్రియ ప్రాథమికంగా లోపభూయిష్టమైనది, చాలా హానికరమైనది, నైతికంగా ఎంత మాత్రం సమర్థించలేనిది. ‘సర్‌’ పర్యవసానాలు భయానకంగా కనిపిస్తున్నాయా? ఆ ప్రతిపాదన వాస్తవికంగా లేదు. భయాందోళనలకు దారి తీసేదిగా ఉన్నది. దానిని నిశితంగా పరిశీలిద్దాం.

ప్రస్తుతమున్న ఓటర్ల జాబితాను పునఃపరీక్షించడం ద్వారా ప్రత్యేక సమగ్ర సవరణ ఎనాడో జరిగి ఉండవలసిన ప్రక్రియ అనే భావన చాలా మందిలో ఉన్నది. దీనిని పక్కన పెడదాం. బిహార్‌లో అటువంటి ప్రక్రియ ఆరు నెలల క్రితమే జరిగింది. లక్షలాది కొత్త ఓటర్ల పేర్లను చేర్చారు. దాదాపుగా అంతే సంఖ్యలో పాత ఓటర్ల పేర్లను తొలగించారు. చెప్పుకోదగ్గ ఫిర్యాదులు ఏవీ రాలేదు. అయితే ఎన్నికల సంఘం ఇప్పుడు ఆదేశించిన ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తిగా కొత్త ప్రక్రియ. సరికొత్తగా ఆరంభించి పూర్తి చేసేది. ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందిస్తారు. గతంలో ఎన్నడూ జరగనిది. సమగ్ర సవరణ పేరిట గతంలో ఓటర్ల జాబితా సవరణ జరిగేది. ఓటర్ల జాబితా కంప్యూటరీకరణతో 2003 తరువాత అటువంటి సవరణ ప్రక్రియను కొనసాగించలేదు. ఇప్పుడు ఎన్నికల సంఘం పూర్తిగా ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఈ కొత్త ప్రక్రియతో ఓటర్ల జాబితాలో తన పేరు ఉండేలా చూసుకునే బాధ్యత పూర్తిగా పౌరుడిదే.


రాజ్యవ్యవస్థకు ఎంత మాత్రం సంబంధముండదు. జూలై 25లోగా పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్‌ను సమర్పించని వారి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండదు. అలా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత పూర్తిగా పౌరుడిదే. మరింత ఘోరమైన విషయమేమిటంటే ఓటర్ల జాబితాలో ఉండేందుకు అర్హత పొందాలంటే ప్రతి వ్యక్తీ తన భారత పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రామాణిక పత్రాలు విధిగా సమకూర్చాలి. ఇది నిజానికి అనధికారిక జాతీయ పౌర పట్టికే (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌) అవుతుంది.

ప్రత్యేక సమగ్ర సవరణ అసలు ఉద్దేశాలను ఎన్నికల సంఘం చాలా తెలివిగా కప్పిపుచ్చుతోంది. అవేమిటో శోధిద్దాం. ఓటర్ల జాబితాలో ఉండే అర్హత పొందేందుకు అవసరమైన డాక్యుమెంటరీ రుజువులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎన్నికల సంఘం ఉత్తర్వు స్పష్టంగా ఉన్నది: ప్రతి ఓటర్‌ ఎన్యూమరేషన్‌ ఫామ్‌ను ప్రస్తుత ఫోటో, సంతకాలు, కొన్ని మౌలిక వివరాలతో నింపి, పౌరసత్వ రుజువుతో సమర్పించాలి. 2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారి (పేరు, నివాసం మారకుండా ఉంటే) కొత్త జాబితాలో స్థానం సంపాదించుకోవడం సులువవుతోంది. 2003 ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్న పేజీ కాపీని తమ ఎన్యూమరేషన్‌ ఫామ్‌తో జత చేసి ఇవ్వాలి. ఇది వారి పౌరసత్వానికి రుజువుగా పరిగణితమవుతుంది. 4.96 కోట్ల మందికి (ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఉన్న 63 శాతం మంది) ఈ దగ్గరి దోవను ఉపయోగించుకునేందుకు అర్హులు అని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఓటర్ల జాబితాలో ఉండేందుకు తమ అర్హతలను నిరూపించుకోవల్సినవారు 3 కోట్ల మంది కంటే తక్కువగా ఉంటారని పేర్కొంది. ఇదొక విచిత్ర వాదన అని, ఇందులో నిజం లేదని రాహుల్‌ శాస్త్రి నిర్ధారించారు (జూలై 1, ‘డేటా పాయింట్’, ది హిందూ). 2003 నుంచి మరణాల సంఖ్యను, వలసపోయిన వారి సంఖ్యను, నివాసం మారిన వారి సంఖ్యను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని, తత్కారణంగా కొత్త ఓటర్ల జాబితాలో ఉండేందుకు తమ అర్హతలను నిరూపించుకోవల్సిన వారి సంఖ్య యథార్థంగా 3.16 కోట్లు అని రాహుల్‌ శాస్త్రి నిరూపించారు.


ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 7.9 కోట్ల మందిలో 4.74 మంది పుట్టిన తేదీ, ఊరుకు సంబంధించిన రుజువులతో తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి బాధ్యత ఉన్న వారిని మూడు తరగతులుగా వర్గీకరించవచ్చు. మొదటి తరగతివారు 38 సంవత్సరాలకు మించిన వయసు ఉన్నవారు (జూలై 1, 1987కు ముందు పుట్టిన వారు). వివిధ కారణాల వల్ల 2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేని వీరు తమ పుట్టిన తేదీ, ఊరుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 20 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు (జూలై 1, 1987, డిసెంబర్‌ 2, 2004 మధ్య పుట్టినవారు) రెండు రుజువులు చూపవలసి ఉన్నది. తాము పుట్టిన తేదీతో పాటు తల్లి లేదా తండ్రి పుట్టిన తేదీకి కూడా ధ్రువీకరణపత్రాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇక 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు (డిసెంబర్ 2, 2004 తరువాత పుట్టినవారు) మూడు రుజువులు సమర్పించవలసి ఉంటుంది. తమ సొంత పుట్టిన తేదీతో పాటు తల్లి, తండ్రి పుట్టిన తేదీల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. 2003 ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల పేర్లు వారి పుట్టిన తేదీలకు రుజువులుగా పరిగణన అవుతాయి. అయితే దరఖాస్తుదారు విధిగా తాను పుట్టిన తేదీ, ఊరుకు సంబంధించి ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర జాబితా సామూహిక ఓటు హక్కుల తొలగింపు ఎలా కాదో ఇప్పుడు మీరే నిర్ణయించాలి. పరోక్షంగానే అయినప్పటికీ, ఓటు హక్కుకు సంపద, విద్యార్హతల పరమైన వివక్షాపూరిత అవరోధాలు సృష్టించడమనేది అమెరికా దక్షిణాది రాష్ట్రాలలో ఆఫ్రికన్‌ అమెరికన్ల ఓటుహక్కును తొలగించడానికి అనుసరిస్తున్న పద్ధతి కాదూ? బిహార్‌లోను, విశాల భారతదేశంలోనూ విద్యార్హతల ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి మినహాయించడమనే చర్యకు మహిళా ఓటర్లు, పేద, దళిత్‌–ఆదివాసీ, బహుజన్‌ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా నష్టపోతారు. అంతేకాదు ఈ సామాజిక సమూహాలలో కూడా కొన్ని వర్గాలు మరింతగా ఎక్కువగా నష్టపోవడం సంభవిస్తుంది. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమని మరి చెప్పనవసరం లేదు.


మరో ప్రశ్న కూడా తప్పక అడగవలసి ఉంది: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఈ హాస్యాస్పద కాలక్రమాన్ని హఠాత్తుగా ఎందుకు ప్రకటించింది? జూన్‌ 25– జూలై 25 మధ్య 30 రోజుల వ్యవధిలో బిహార్‌ ప్రభుత్వం లక్ష మంది పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులను (వీరిలో ఇరవై వేల మందిని ఇంకా నియమించవలసి ఉన్నది) సంప్రదించవలసి వున్నది; ప్రత్యేక సమగ్ర సవరణ పద్ధతులలో వారికి శిక్షణ ఇవ్వవలసి ఉన్నది; సకల రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లతో వీరు సంబంధాలు పెట్టుకుని, ‘సవరణ’పై ఆ రాజకీయ కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించవలసి ఉన్నది; ప్రతి కుటంబానికి ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ పంపిణీ చేసి, 2003 ఓటర్ల జాబితాను వారికి అందుబాటులో ఉంచి తోడ్పడవలసి ఉన్నది. అంతేనా? సంబంధిత వివరాలతో పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ను ప్రతి కుటుంబం నుంచి (అవసరమైతే మూడుసార్లు సందర్శించి అయినా) సేకరించి, వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేయవలసి ఉన్నది. వివిధ ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉన్నయో లేదో నిర్ధారించి తమ సిఫారసులు చేయాలి. ఇవన్నీ ఒక నెల రోజుల్లోనే జరగాలి సుమా! (మరి ఆ నెలలో ఇప్పటికే ఒక వారం గడిచిపోయింది) ఇవన్నీ జరగాల్సిన రోజులు ఎటువంటివి? బిహార్‌లో ఇది వర్షాకాలం. వరదలు వెల్లువెత్తడం కద్దు. మరి ఇటువంటి సహజ ప్రతికూల పరిస్థితుల్లో ఇవన్నీ జరగడం సాధ్యమేనా? ఎన్నికల సంఘం వద్ద మంత్రదండం ఏదైనా ఉంటే మినహా ఈ ‘సమగ్ర సవరణ’ మహాకార్యం అసంభవం. కనుక ఈ ‘సవరణ’ ఆదేశాన్ని ఉపంహరించుకునే అవకాశముందని మనం భావించవచ్చు లేదా జూన్‌ 30న ప్రకటించిన ఆవశ్యక డాక్యుమెంట్ల జాబితాలో పెద్ద మార్పులు చేసేందుకు ఆస్కారమున్నది. లేదూ? అసలు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయవచ్చు.


అటువంటి పెనుమార్పులు అవసరమవుతాయా? అవుతాయని అనుకుందాం. మరయితే కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గత నెలలో పేర్కొన్న 21 కొత్త చర్యల జాబితాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎందుకు లేదు? అలాగే గత నెలలోనే వివిధ జాతీయ రాజకీయ పక్షాల అధినేతలతో నిర్వహించిన సమావేశంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రతిపాదనను ఎన్నికల సంఘం ఎందుకు చేయలేదు? ఆ సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా జరిపిన 4000కు పైగా సంప్రదింపులలో కూడా దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం 25 రోజుల క్రితమే ఎన్నికల సంఘం ఆలోచనలు ఎందుకు మారిపోయాయి? అనుకోకుండా వచ్చిన ఫోన్‌కాల్‌ అందుకు కారణమా? లేక చాయ్‌ పే చర్చా? సర్‌ (ప్రత్యేక సమగ్ర సవరణ) వెనుక ఉన్న ‘సర్‌’ ఎవరు?

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:49 AM