Share News

Osmania University Challenges: ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్న వేళ

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:28 AM

నూట ఎనిమిది సంవత్సరాల ఓయూ సమాజ మార్పులతో పాటు, విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులను తనలో ఇముడ్చుకున్నది. ప్రకృతి, జీవ, సామాజిక శాస్ర్తాలలోనే కాకుండా వివిధ సాహిత్యాంశాలకు...

Osmania University Challenges: ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్న వేళ

నూట ఎనిమిది సంవత్సరాల ఓయూ సమాజ మార్పులతో పాటు, విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులను తనలో ఇముడ్చుకున్నది. ప్రకృతి, జీవ, సామాజిక శాస్ర్తాలలోనే కాకుండా వివిధ సాహిత్యాంశాలకు వేదికగా ఉండి సమాజంతో సంవాదం నడిపింది. అధ్యయనం, పరిశోధన మాత్రమే కాకుండా ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థులు తమ సామాజిక బాధ్యత పట్ల కూడా నిబద్ధతతో ఉండటం చరిత్ర నిరూపించిన సత్యం. నిజాం వ్యతిరేక పోరాటానికి, జాతీయోద్యమానికి, ప్రత్యేక తెలంగాణ సాధనకు, నక్సల్బరీ మేఘ గర్జనకు, అస్తిత్వ వసంత గానాలకు కావలసిన మేధోపరమైన, నిర్మాణపరమైన అవసరాలను ఓయూ తీర్చింది. భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయానికీ దక్కని అరుదైన ఘనతను ఉస్మానియా సొంతం చేసుకున్నది. సమాజానికి, విశ్వవిద్యాలయానికి ఉండవలసిన సజీవ సంబంధాన్ని కొనసాగిస్తూ, సమాజం ఎదుర్కొన్న రాజకీయార్థిక, సాంస్కృతిక సవాళ్లకు పరిష్కార మార్గాన్ని చూపింది. అపురూపమైన నాయకత్వాన్ని రూపొందించి, ఈ దేశానికి అందించిన తొలితరం విద్యాలయం ఓయూనే.

ఇంతటి కీర్తి కలిగిన ఓయూ చరిత్ర గత మూడు దశాబ్దాల నుంచి మసకబారుతూ వస్తోంది. ప్రపంచీకరణ విసిరిన సవాళ్లను తట్టుకుని నిలబడలేక తాను నిర్దేశించుకున్న ప్రమాణాలు ప్రశ్నార్థకమయ్యే స్థితికి చేరుకుంది. సరైన నిధులు లేక, ఉత్తమమైన అధ్యాపకుల నియామకం జరగక విద్యాసంబంధ కార్యకలాపాలకు అనేక పరిమితులు ఏర్పడ్డాయి. తెలివైన విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ప్రవేశిస్తున్నా వారి అవసరాలను తీర్చే బోధన, పరిశోధన కుంటుపడింది. ఫలితంగా విద్యార్థులు శాస్త్రాల అధ్యయనం కంటే పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికే మొగ్గు చూపుతున్నారు. రాను రాను ఓయూ షెల్టర్ జోన్‌గా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యా సంబంధం లేని కార్యకలాపాలకు ఉస్మానియా కేంద్రంగా మారింది. కొందరు అధ్యాపకులలో కూడా వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత లోపించి అలసత్వం ప్రవేశించింది. మరికొందరు విశ్వవిద్యాలయాన్ని తమ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఈ విద్యాలయాన్ని వనరుగా వాడుకుంటున్నారు. సైద్ధాంతిక వాదన, సంవాదం, చైతన్యం ఉండవలసిన చోట రాజకీయ నాయకుల, కొందరు ప్రైవేట్ వ్యక్తుల బర్త్‌డే వేడుకలు నిర్వహించుకునే చోటుగా ఆర్ట్స్ కళాశాల మారిపోయింది. బయటి వ్యక్తులు ఎలాంటి పరిమితులు లేకుండా క్యాంపస్ లోపలికి ప్రవేశించి విద్యా సంబంధ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సవాళ్లు విసురుతున్నారు. కొందరు మతవాదులు కూడా ఓయూను తమ కార్యకలాపాలకు కేంద్రంగా మలుచుకుంటున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు, విద్యార్థినులు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓయూ పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్లటానికి భయపడుతున్నారు. ఆకతాయిల ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొంటున్నారు.


ఈ స్థితిలో, ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత పౌరసమాజం మీద ఉన్నది. తెలంగాణ సమాజానికి జ్ఞానాన్ని అందించడానికి ఉన్న ప్రధాన విశ్వవిద్యాలయం ఓయూనే. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు దీటుగా ఉస్మానియాను నిలబెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 25న టాగోర్ ఆడిటోరియంలో ప్రకటించినట్లుగా ఓయూను ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ స్థాయిలో రూపొందించాలంటే స్వయంగా ఆయనే చొరవ తీసుకోవాలి. కొందరు అధికారులు, కొన్ని కమిటీలు, మరికొందరు వ్యక్తులు పూనుకుంటే సమస్యలు పరిష్కారమయ్యే స్థాయిలో ఓయూ లేదు. సమాజం నుంచి అనేక పరిమితులు ఎదుర్కొని, తపనతో విద్యనార్జించి వీసీ స్థాయికి ఎదిగిన ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ఓయూను సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రభుత్వం వైపు నుంచి ఆదాన, ప్రదానాలు ఉండాలి. అట్టడుగు సామాజిక సమూహం నుంచి ఎదిగిన వ్యక్తులకు అవకాశం లభించినప్పుడు వ్యవస్థలను రక్షించడానికి ఎంతటి నిబద్ధతతో పనిచేస్తున్నారో వర్తమాన ముఖచిత్రం అద్దంపడుతోంది. విద్యాసంబంధం లేని అధ్యాపకుల, విద్యార్థుల, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడటమే అధికారులకు మొదటి ప్రాధాన్యంగా మారింది. ప్రతి వ్యవస్థలోనూ అరాచక శక్తులు ఉంటాయి. కానీ, వాటికి పరిమితులు విధించడం వల్ల రాజ్యాంగబద్ధ ప్రజా వ్యవస్థలను రక్షించగలం.

డిసెంబర్ 7న ఓయూలో జరగబోయే సభ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రచారానికి ముగింపు పలికే సమావేశంగా మారకూడదు. ఇదొక మేధో సమ్మేళనంగా ఉండాలి. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యల సుడిగుండంలో ఉన్న ఉన్నత విద్యారంగానికి విజన్ ప్రకటించే కార్యక్రమంగా ఉండాలి. గతంలో ఉస్మానియాకు ముఖ్యమంత్రి కేటాయించిన రూ. వెయ్యికోట్ల నిధులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడకపోతే పౌరసమాజం, విశ్వవిద్యాలయ సమూహాల నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ డబ్బులతో హాస్టళ్లు, తరగతి గదులు, కార్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, సమావేశ మందిరాలు నిర్మాణం చేయడం వరకే పరిమితం కాకుండా బోధనా పరికరాలను సమకూర్చడం మీద సీఎం దృష్టి పెట్టాలి. ఓయూలో ఖాళీగా ఉన్న వెయ్యి అధ్యాపక పోస్టులను ఎలాంటి రాజకీయ జోక్యం, బంధుప్రీతి లేకుండా– ప్రతిభ కలిగిన వారితోనే భర్తీ చేయాలి. తెలంగాణ సమాజంలో యువత నైపుణ్య లేమితో కొట్టుమిట్టాడుతోంది. కాబట్టి స్కిల్డ్ బేస్డ్ విద్యకు కావాల్సిన సిలబస్‌లను రూపొందించాలి. ఓయూ చుట్టూ పటిష్ఠమైన ప్రహరీని నిర్మించి, క్లోజ్డ్ క్యాంపస్‌గా మార్చి విద్యార్థులకు భద్రత కల్పించాలి. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సీపీఎస్ సమస్యను పరిష్కరించాలి. ఓయూలో కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు తమ సమస్యకు సీఎం తార్కిక ముగింపును ఇవ్వాలని ఆశిస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఓయూకు విద్యనభ్యసించడానికి వస్తున్నారు. వారి తెలివితేటలు ప్రపంచంతో పోటీపడాలంటే నాణ్యమైన బోధన, పరిశోధన జరగాలి. పీజీ విద్యార్థులకు నెలకు మూడువేల రూపాయల ప్రోత్సాహకం, పరిశోధకులకు పదివేల ఫెలోషిప్ అందిస్తే వారిలో నిబిడీకృతమైన ప్రతిభ వెల్లివిరియడానికి అవకాశం ఉంటుంది. ఆర్ట్స్ కళాశాల ముందు రాజకీయ నాయకుల ఫొటోలకు క్షీరాభిషేకాలు, బర్త్‌డే కేక్ కటింగులు, టపాకాయలు కాల్చడం లాంటి విద్యేతర కార్యకలాపాలు జరపకూడదని తమ అనుచర గణానికి అధికార పార్టీ నుంచే గట్టి సందేశం వెళ్లాలి. ఓయూ అభివృద్ధి అంటే కేవలం నిధుల కేటాయింపు విషయంగా కాకుండా తెలంగాణ విజ్ఞాన భాండాగారంగా భావించాలి.

ప్రొఫెసర్ సి. కాశీం

ప్రిన్సిపాల్, ఆర్ట్స్ కళాశాల, ఓయూ

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 04:28 AM