భారత్‌కు హసీనా పరీక్ష
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:22 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణ జరుపుతోన్న ట్రిబ్యునల్ ఆమెపై అరెస్టువారెంట్ జారీచేసింది. గత ఏడాది విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి అవామీలీగ్ ప్రభుత్వం అతి క్రూరంగా వ్యవహరించి, సామూహిక మారణకాండకు పాల్పడిందన్నది...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణ జరుపుతోన్న ట్రిబ్యునల్ ఆమెపై అరెస్టువారెంట్ జారీచేసింది. గత ఏడాది విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి అవామీలీగ్ ప్రభుత్వం అతి క్రూరంగా వ్యవహరించి, సామూహిక మారణకాండకు పాల్పడిందన్నది ప్రాసిక్యూషన్ ఆరోపణ. దీనిని పరిగణనలోకి తీసుకున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాతో పాటు అప్పటి బంగ్లా హోంమంత్రి, ఇనస్పెక్టర్ జనరల్‌కు సైతం అరెస్టువారెంట్లు జారీ చేసింది. సామూహిక హత్యాకాండలో ఈ ముగ్గురిదే ప్రధానపాత్రని నిర్థారించింది. విద్యార్థులపై దాడులు చేయవలసిందిగా భద్రతాదళాలతో పాటు అధికారపార్టీ కార్యకర్తలను, అనుబంధ గ్రూపులను సైతం హసీనా ప్రభుత్వం ఆదేశించి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరణించడానికి కారణమైందని చీఫ్ ప్రాసిక్యూటర్ వాదన. ఈ హత్యలన్నీ పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసినవని ఆయన వాదన. అభియోగాలను నమోదు చేసిన న్యాయస్థానం ఈ నెల 16లోగా హసీనాను ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. దోషులుగా తేలితే ఐసీటీ–బంగ్లాదేశ్ చట్టం ప్రకారం వీళ్ళకు ఉరిశిక్ష పడుతుందట.
హసీనా దుర్మార్గాలను నిరూపించడానికి 81మంది సాక్షులను, వందలాది వీడియోలు, మెసేజ్‌లను కూడా న్యాయస్థానం ముందు ప్రభుత్వం ఉంచింది. హసీనామీద వందకు పైగా కేసులు పెట్టి, భారతదేశం నుంచి వెనక్కు రప్పించాలని ప్రయత్నిస్తున్న యూనిస్ ప్రభుత్వానికి ఐసీటీ ఆదేశాలు కొత్త శక్తినిస్తాయి. భారత ప్రభుత్వం పలురకాల కారణాలు, అభ్యంతరాలతో హసీనా అప్పగింతకు సిద్ధపడకపోవడం తెలిసిందే. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన హసీనా తన పదవిని పరిరక్షించుకోవడానికి నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన మాట నిజం. ఆమె ఆదేశాల మేరకే భద్రతాబలగాలు విద్యార్థులమీద అంత అమానుషంగా విరుచుపడ్డాయి. అందుకు ఆమెను బాధ్యురాలిని చేసి, శిక్షించేందుకు సిద్ధపడినప్పుడు ఆ ప్రక్రియ పారదర్శకంగా, నిజాయితీగా జరగాలి. ఆమెపట్ల కక్షపూరితంగా కాక, ప్రస్తుత పాలకులు తటస్థంగా ఉండాలి. కానీ, నోబెల్ పురస్కార గ్రహీత నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో హసీనా ఉనికినీ, చిహ్నాలను తుడిచిపెట్టేయాలన్న కక్షతో కదులుతోంది. అవామీలీగ్ నాయకులను జైళ్ళలోకి తోయడమే కాదు, దశాబ్దాలనాటి ఓ ఉగ్రవాద చట్టాన్ని రాత్రికిరాత్రి తమకు అనుగుణంగా సవరించి, ఇటీవల ఏకంగా ఆమె పార్టీనే ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఇక, హసీనాకు ట్రిబ్యునల్ అరెస్టువారెంట్ జారీ చేసిన మర్నాడే ఆ దేశ సుప్రీంకోర్టు 1971 ఊచకోతలో పాకిస్థాన్‌తో కుమ్మక్కయిన మతోన్మాద జమాతే ఇస్లామీని రాజకీయపార్టీగా ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించడం విశేషం.
ఉన్నతంగా, తటస్థంగా దేశాన్ని నడిపించాల్సిన యూనిస్ ప్రభుత్వం ఏకపక్షంగా, ఒక మతతత్వసంస్థలాగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సాధించిన ముజిబుర్ రహ్మాన్ ఆనవాళ్ళేమీ దేశంలో మిగలకుండా చేసే ప్రయత్నాలు అక్కడ బలంగా, ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి. విగ్రహాల కూల్చివేత, బంగ్లావిమోచనంలో ఆయన పాత్రను కుదించడం, పాకిస్థాన్ మెచ్చేరీతిలో పాఠ్యపుస్తకాలను తిరగరాయడం ఇత్యాదివి సాగిపోతున్నాయి. జూన్ 1నుంచి జారీ అయిన నోట్ల మీద కూడా ఆయన ఫోటో లేకుండాపోయిన విషయం తెలిసిందే. కొత్తపాఠ్యపుస్తకాల్లో ముజిబుర్ రహ్మాన్‌ను వెనక్కునెట్టేసి, జియావుర్ రహ్మాన్‌ను ఆకాశానికెత్తే ప్రయత్నమూ జరిగింది. బంగ్లావిముక్తి పోరాటానికి మసిపూసి, దాని ఆవిర్భావానికి దోహదపడిన పరిస్థితులను, కారణాలను చెరిపివేసి, ఆనాటి ఆదర్శాలకు పాతరేసి, పాకిస్థాన్ అనుకూల, మతఛాందస దేశంగా బంగ్లాదేశ్‌ను మార్చేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్–ఉద్ దావా నాయకులు కొందరు ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగిస్తూ, 1971లో పాకిస్థాన్‌ను దెబ్బతీసి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌ను సృష్టిస్తే, గత ఏడాది అందుకు ప్రతీకారం తీర్చుకున్నామంటూ హసీనా వ్యతిరేక ఉద్యమంలో తమ సంస్థ పాత్ర ప్రముఖంగా ఉన్నదని చెప్పుకున్నారట. పొరుగుదేశం పరిణామాలు భారత్‌కు పరీక్షపెట్టే విధంగా పరిణమిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News