ఎదుగూబొదుగూ లేని వ్యవసాయ విశ్వవిద్యాలయం
ABN , Publish Date - May 15 , 2025 | 02:07 AM
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడి 60 ఏళ్ళు పూర్తి అయింది. ఈ తరుణంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించాల్సిన అవసరముంది. 1945లో వ్యవసాయ కళాశాలను స్థాపించాలని అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి...
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడి 60 ఏళ్ళు పూర్తి అయింది. ఈ తరుణంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించాల్సిన అవసరముంది. 1945లో వ్యవసాయ కళాశాలను స్థాపించాలని అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ సంస్థను తమిళ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ, అందుకు అవసరమైన భూమిని ఇస్తామని తమిళులు ముందుకొచ్చారు. ఆ సమయంలో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉన్న పాములపాటి వెంకటకృష్ణయ్య నాయుడు బాపట్లలోని జిల్లా బోర్డు హై స్కూల్‌లో పది ఎకరాల స్థలాన్ని విడగొట్టి యూనివర్సిటీకి కేటాయించారు. దానితో పాటు పక్కనే మాచవరం గ్రామంలోని తన వంద ఎకరాల భూమిని కళాశాల కోసం ఏడాదికి కౌలుకు ఇచ్చారు. (1940లో కృత్తివెంటి పేరరాజు పంతులు కోనసీమలోని రామచంద్రాపురంలో తన వంద ఎకరాలను ఈ కళాశాల ఏర్పాటు కోసం బ్రిటిషు వారికి దానంగా ఇచ్చారు.) దీంతో 1945లో బాపట్లలో వ్యవసాయ కళాశాల ఏర్పడింది. దశల వారీగా అక్కడ వ్యవసాయ, ఇంజనీరింగ్, హోమ్‌సైన్స్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో పాటు పొన్నూరులో తమలపాకు పరిశోధనా కేంద్రం ఏర్పడింది.
తరువాత బాపట్లలో ఆర్ట్స్, ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించారు. అక్కడ విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జాతీయ స్థాయిలో అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులుగా, పరిశోధనా కేంద్రాల్లో అగ్రగణ్యులుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారు. వారిలో అజయ్ కల్లామ్ ఐఏఎస్‌గా, మాలకొండయ్య ఐపీఎస్‌గా, మరికొందరు ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ చింతల గోవిందరాజులు నాబార్డు ఛైర్మన్‌గా జాతీయ స్థాయిలో సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 1964 జూన్ 12న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రెండువేల ఎకరాల్లో స్థాపించారు. ఈ ప్రాంగణంలోనే జాతీయ గ్రామీణాభివృద్ధి కేంద్రం, MANAGE, NAARM, జాతీయ సహకారరంగ శిక్షణా సంస్థ, జాతీయ వరి–నూనె గింజల పరిశోధనా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా క్రీడా, ఇక్రిశాట్ వంటి సంస్థలూ అక్కడకు చేరాయి. ఢిల్లీ తరువాత అత్యధికంగా వ్యవసాయరంగ పరిశోధనా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడ్డాయి.
నేను 1988–91, 2000–2003 మధ్య కాలంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ఉన్నాను. అప్పటి వరకు యూనివర్సిటీల్లో బదిలీ విధానం లేదు. దీని కోసం కమిటీని ఏర్పాటు చేసి, బదిలీలకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ అనుబంధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ నేను రూపొందించిన బదిలీల విధానమే కొనసాగుతోంది.
2000 సంవత్సరంలో పొగాకు క్రాప్ హాలిడే అమల్లోకి తెచ్చాం. యూనివర్సిటీ శాస్త్రవేత్తల సలహాతో పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా శనగ (బెంగాల్ గ్రామ్)ను లక్షలాది ఎకరాల్లో రైతులతో సాగు చేయించాం. జాతీయ స్థాయిలో పప్పుధాన్యాల కొరత తీర్చడానికి ఈ నిర్ణయం దోహదపడింది. సాగునీటికి కొరత ఏర్పడిన సమయంలో మురుగు నీటిని శుద్ధిచేసి, సాగునీటిగా ఉపయోగించుకుంటే మేలు జరుగుతుందని రైతులకు సూచించాం. ఈ నిర్ణయం కూడా సత్ఫలితాలనిచ్చింది. వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ ఐవి సుబ్బారావు ఉన్న సమయంలోనే ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది.
2004లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు నాటి రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అమర్త్యసేన్, ఎంఎస్ స్వామినాథన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వారు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ కీర్తిని పెంచే మరో సంఘటన జరిగింది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ భారత్‌లో పర్యటించాలనుకున్నారు. బుష్‌కు మన వ్యవసాయ రంగాన్ని పరిచయం చేయడానికి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అనువైనదిగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించింది. బుష్ గంటపాటు ఈ విశ్వవిద్యాలయాన్ని పరిశీలిస్తారని కేంద్రం తెలిపింది. కానీ ఆయన మూడు గంటలకు పైగానే యూనివర్సిటీలో గడిపారు. అక్కడి అభివృద్ధి, మౌలిక వసతులు, పరిశోధనలను ఆయన మెచ్చుకున్నారు.
ఆచార్య ఎన్జీ రంగా 1995 జూన్‌లో మృతి చెందారు. జూన్ 25న నిడుబ్రోలు రామనీడు విద్యాలయంలో రంగా సంతాప సభను నిర్వహించారు. ఆ సమావేశానికి అప్పటి ఆర్థికమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత రోశయ్య, ఇతర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రాజేంద్రనగర్‌లోని అగ్రి యూనివర్సిటీకి ఆచార్య ఎన్జీ రంగా పేరు పెట్టాలని ఈ సభలో నేను సూచించాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని 2014 విభజన చట్టంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ మొదటి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ దీనికి తొలుత రూ.500 కోట్లు కేటాయించారు. కొన్ని కారణాల వల్ల తర్వాత రూ.100 కోట్లు మాత్రమే ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2015 నవంబరు 11న ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌లు హాజరయ్యారు. అరుణ్‌జైట్లీ తొలుత ప్రకటించిన విధంగా ఈ విశ్వవిద్యాలయానికి రూ.500 కోట్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరాను. కానీ అరకొర నిధుల కారణంగా నాటి నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక ఒడిదుడుకులతో కుంటినడక నడుస్తోంది. ప్రభుత్వం మారడంతో ఒక దశలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు సమీపంలోని లాం నుంచి తరలించాలని ప్రయత్నించారు. విభజన జరిగి పదేళ్లు దాటినా ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంకా అసమగ్రంగానే కొనసాగుతోంది. ఆచార్య ఎన్జీ రంగా పేరుతో లాంలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్‌ను కూడా ప్రభుత్వం నియమించలేదు. మణిపూర్, మిజొరం వంటి చిన్న రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పసుపు, పొగాకు తదితర పంటలకు జాతీయ స్థాయిలో కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రమైన వ్యవసాయ విశ్వవిద్యాలయం లేకపోవడం విచారకరం.
ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం టీడీపీ మద్దతుతో కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి తమ వ్యవసాయ యూనివర్సిటీలో అన్ని పోస్టులను భర్తీ చేసుకుంది. విశ్వవిద్యాలయం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఏపీలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందేలా పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా. యలమంచిలి శివాజీ
రాజ్యసభ మాజీ సభ్యుడు
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి