Share News

స్వతంత్ర మహిళ.. రాహుల్‌జీ స్వప్నం

ABN , Publish Date - Mar 07 , 2025 | 03:53 AM

స్త్రీ జాతి పట్ల తరతరాలుగా వస్తున్న సంకుచిత, సాంప్రదాయ భావాలని మహాపండితుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంగీకరించరు. స్ర్తీ జాతి కోసం మనుస్మతిలో చెప్పిన...

స్వతంత్ర మహిళ.. రాహుల్‌జీ స్వప్నం

స్త్రీ జాతి పట్ల తరతరాలుగా వస్తున్న సంకుచిత, సాంప్రదాయ భావాలని మహాపండితుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంగీకరించరు. స్ర్తీ జాతి కోసం మనుస్మతిలో చెప్పిన నీతి నియమాలను ఆయన ఖండిస్తారు. మనుస్మృతిలో ఇలా ఉంది. ‘‘బాల్యావస్థలో స్ర్తీ– తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుని సంరక్షణలో ఉండాలి. స్ర్తీ స్వాతంత్ర్యానికి అనర్హురాలు. తన కోర్కెలకి అనుగుణంగా ఏ పనీ చేయరాదు.’’

బాల్యావస్థలో సంరక్షణ అనివార్యమైనా, తరువాత స్ర్తీ ఎవరి సంరక్షణలోనూ ఉండాల్సిన అవసరం లేదంటారు రాహుల్‌జీ. స్త్రీ పరాధీనురాలుగా ఉండటం, భర్తపైన ఆర్థికంగా ఆధారపడడం అనేది పాతకాలపు మాట. ఇప్పుడు ఆ రోజులు గతించిపోయాయి. పురుషులతో సమానంగా స్త్రీలు తమ హక్కులను పొందే నిజమైన హక్కుదారులు. మానవ సమాజం, మానవ జీవితం సాధించుకున్న అన్ని రంగాలలో ప్రవేశించడానికి స్త్రీలకి హక్కు ఉన్నది. ఆ రంగాల ద్వారాలు ఆమె కోసం తెరుచుకుని ఉన్నాయి. ఆమె ఎందుకు వెనుకబడి ఉండాలి?


ఇంటి నాలుగు గోడల మధ్యనే స్త్రీ స్థానం. ఆమె గడప బయట కాలు పెట్టరాదు. భర్త, కుటుంబానికి సేవ చేస్తూ ఇంటి పనులను చక్కబెట్టడమే ఆమె పని అనే అవగాహనని పాతకాలపు పురాణవాదుల బుర్ర నుంచి పుట్టిన నియమాలని రాహుల్‌జీ అనేవారు. వాస్తవానికి రాహుల్‌జీ జీవితంపైనా, స్త్రీ జాతి పట్ల వారి అవగాహనపైనా సామ్యవాద ఆలోచనా విధాన ప్రభావం చాలా ఉన్నది. స్త్రీని కేవలం భోగ వస్తువుగా కాకుండా సమాజంలో ఆమెకి కూడా సమాన అవకాశాలు ఉండాలని చెబుతూ ఆయన స్ర్తీల పక్షాన నిలబడ్డారు. స్త్రీలలో కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే ఉండదు. దానికంటే కూడా ఉన్నతమైన ప్రేమపాత్రురాలు అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

భారత స్త్రీల దయనీయమైన పరిస్థితిని వర్ణిస్తూ, వారిని ఉద్ధరించే మార్గాలను చెబుతూ 1942లోనే రాహుల్‌జీ భోజ్‌పురీ భాషలో చిన్న చిన్న నాటికలు చాలా రాశారు. ‘మెహరారున్‌ దురవస్థ’, ‘మందలి ప్రపంచం’ కథలలో స్త్రీ సమాజాల పట్ల, స్త్రీ పక్షపాతిగా వారి ఆలోచనలు మనకి కనిపిస్తాయి. కుసంస్కారాలు, భయంకరమైన నీతి శాసనాలలో బంధించబడి ఉన్న భారత సమాజ స్త్రీ జాతి దుర్భర పరిస్థితులను చూసి రాహుల్‌జీ హృదయం ద్రవించిపోయింది. స్త్రీ జాతి దుస్థితి పట్ల తన తిరుగుబాటు స్వభావాన్ని చాలా మార్మిక శబ్దాలలో ఇలా చిత్రించారు.

‘‘ఒకే తల్లి, ఒకే గర్భం/ ఇద్దరూ జన్మించారు/ కొడుకు జన్మించినందుకు ఆనందం/ కూతురు జన్మించినందుకు దుఃఖం/ సంపదపై కొడుక్కి హక్కు/ కూతురుకి ఏ హక్కులూ లేవు.’’


రాహుల్‌జీ తన ప్రఖ్యాత రచన ‘పారిపోకు ప్రపంచాన్ని మార్చుకో’లో ఒక అధ్యాయం మొత్తాన్ని స్త్రీ జాతికి అంకితం చేశారు. భారత సమాజంలో స్త్రీ జాతి పట్ల పురుషుల అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. ‘‘మహిళని బానిసని చేసి పురుషుడు తన ఇంటికి తెస్తాడు. దీన్ని పెళ్లి అంటారు. తండ్రి తన కూతురు కోసం వరుడిని వెతుకుతాడు, ఎందుకు? కూతురికి తిండి, బట్ట తప్పక దొరకాలి. పురుషునికి తప్పనిసరి అవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఆస్తిపాస్తులు మొత్తం అతడికే లభిస్తాయి. అతడు దుకాణం తెరవగలడు లేదా ఆఫీసులో ఉద్యోగం చేయగలడు. సంపాదించుకోవడానికి అతడికి అన్ని దారులూ తెరచి ఉన్నాయి. కానీ మహిళలకి అన్ని దారులూ మూసి ఉన్నాయి. అందుకని ఆమెకి తిండి, బట్టలు ఇచ్చేవాడు ఎవరన్నా ఒకడు కావాలి. తిండి బట్టలనే డబ్బులంటారు కదా!’’

ఇంకా తీవ్రంగా చర్చిస్తూ రాహుల్‌జీ ఇలా అంటారు. ‘‘నేను పెళ్లిని తప్పు అనడం లేదు. కానీ పెళ్లి పేరుతో ధనం, బేరసారాలు సాగటం మహిళలను అగౌరపరచటమే. ప్రేమ అనే పునాదిపై పెళ్లి ఆధారపడాలి. ప్రేమ అనేది ఇరువురు సమాన వ్యక్తుల మధ్యనే ఉంటుంది. యజమాని, కొనబడిన దాసిల మధ్య ప్రేమ ఉండదు. అందుకే సంపాదనలో, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులలో సమాన అధికారం వచ్చేవరకూ మహిళ, పురుషునికి సమానం కాలేదు.’’


ఇంకా కఠిన పదాలలో రాహుల్‌జీ ఇలా ప్రశ్నిస్తారు. ‘‘మహిళలు ఎప్పటికీ గొర్రెలుగా ఉండలేరు. చదువుకున్న మహిళలు చాలాచోట్ల బహిరంగసభలు పెట్టి ప్రశ్నిస్తున్నారు. మానవ పొట్ట నుండి మగపిల్లలు పుడితే, ఆడపిల్లలేమన్నా చింతచెట్టు తొర్రలోంచి పుట్టారా?’’

1944 నాటికే స్త్రీల పట్ల పండిట్‌జీకి స్పష్టమైన అవగాహన వచ్చింది.

ప్రస్తుత కాలంలో మహిళా జగత్తులో వస్తున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తూ, భారత స్త్రీ తన దృఢమైన మనోబలంతో, పని సామర్థ్యంతో ‘ఆడది అబల కాదు సబల’ అని నిరూపించే రోజు దూరం లేదని రాహుల్‌జీ ఆశిస్తున్నారు. ‘‘మహిళ ఏ రకమైన అన్యాయం ముందూ తలవంచదు. కచ్చితంగా ఎదిరిస్తుంది. భారత మహిళ తన బాటలు నిర్మించుకుంటున్నది. వందల సంఖ్యలో ఇంగ్లండు, అమెరికా ఇంకా ఇతర దేశాలలో చదవటానికి వెళ్లే మహిళలకి సంరక్షకులుగా ఎవరు పంపబడ్డారు? (మనుస్మృతిలో చెప్పబడినట్లు) పురుషుడు తనని తాను రక్షించుకున్నట్టు గానే స్త్రీలు తమని తాము రక్షించుకుంటారు. తమ దారికున్న అడ్డంకుల్ని తొలగించుకుంటూ ఇతర దేశాల మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆయా దేశాలు చాలాకాలం క్రితమే ఈ పనిని ప్రారంభించాయి. నేటి ప్రపంచ ప్రవాహం మనతో పాటుగా ఉన్నది.’’


తెలుసుకోవాలనే జిజ్ఞాసలో పురుషులే కాదు ఎంతో ఉత్సాహంతో స్త్రీలు కూడా రాహుల్‌జీ దగ్గరికి వచ్చేవారు. మంచి పనులను చేయటం కోసం పురుషులని ఎలా ప్రోత్సహించేవారో, అలానే స్త్రీల కోసం కూడా ప్రణాళికలు తయారుచేసేవారు. వాటికి కార్యరూపం ఇచ్చే సాధనాలు, ఉపాయాలను కూడా చెప్పేవారు. ఎవరైనా స్త్రీకి, ఆమె భర్తకి మధ్య మనస్పర్థలు వచ్చి వాటిని పూడ్చటంలో ఆమె విఫలమవుతుంటే ‘‘భర్తతో కలిసి ఉండగలిగినంతకాలం ఉండడానికి ప్రయత్నించు. పరిస్థితి ఇంకా విషమిస్తే వేరుపడి నువ్వు నీ కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయి. నువ్వు కార్యక్షేత్రంలో దిగటమే ఆలస్యం. నీలో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించు. నువ్వు ఎవ్వరికీ దేంట్లోనూ తీసిపోవు, వెనుకబడవు’’ అని ధైర్యాన్నిచ్చేవారు.

స్త్రీ జాతి ఉజ్వల భవిష్యత్‌ వైపు సూచిస్తూ మహా పండిట్‌ తన ఉన్నత భావాలని ఇలా ప్రకటిస్తున్నారు. ‘‘భారత మహిళలు మూడు తరాలుగా క్రమంగా ముందుకు వెళుతూ ఆధునిక వాతావరణంలో ప్రవేశించారు. మొదటి తరం– పరదాలను తీసేసి పూజా గ్రంథాల దాకా వెళ్ళే సాహసం చేసింది. రెండవ తరం– కొంచెం కొంచెం చదువు సంధ్యలు ప్రారంభించింది. ఇంకా కాలేజీలో చదువుతూ కూడా తనతో చదివే మగపిల్లలతో సమానత్వాన్ని పొందే సాహసం చేయలేదు. ఇప్పటి నవ యువతుల మూడో తరం– యువకులతో సరిసమానమవడానికి తయారుగా ఉన్నది. మామూలు పనులలోనే కాదు ప్రభుత్వ యంత్రాంగంలోకి, పెద్ద పెద్ద ఉద్యోగాలలోకి కూడా పోవడానికి ఇప్పటి తరం తయారుగా ఉంది.

భారత స్త్రీల పట్ల 1944లో రాహుల్‌జీ తన భావాలను ప్రకటించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో స్త్రీలు ఉన్నతమైన గొప్ప ప్రాముఖ్యత గల స్థానాన్ని తమ కోసం ఏర్పర్చుకుంటున్నారు. అన్ని రంగాలలోనూ సంపూర్ణ మహిళా విముక్తి వైపు సాగిపోవడానికి నేటి తరం యువతులు అన్ని రకాల అడ్డంకులనీ తొలగించుకోవాలనేది రాహుల్‌జీ స్వప్నం.

(రాహుల్‌ సాంకృత్యాయన్‌ సహచరి కమలా సాంకృత్యాయన్‌

హిందీ రచన ‘మహామానవ్‌–మహాపండిత్‌’ పుస్తకం నుంచి)

తెలుగు అనువాదం: ఆలూరి ఉషారాణి

(మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Jagan Argument : అయోమయం... జగన్‌‘వాదం’!


న్యాయవ్యవస్థలోనూ

మహిళలకు అన్యాయమేనా?

మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా మహిళా న్యాయమూర్తుల సంఖ్యను కోర్టుల్లో పెంచుకోలేకపోయాం. 1989, అక్టోబర్‌ 6న ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితమయ్యే వరకు మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులు లేరు. ఫాతిమా బీవీని నియమించుకున్న ఆనందం కూడా రెండున్నర ఏళ్లకు మించి లేదు. ఆమె తరువాత మళ్లీ రెండేళ్లకు సుజాతా మనోహర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలయ్యారు. ఆ తర్వాత జస్టిస్‌ రుమా పటేల్‌ ఆరేళ్ల మూణ్ణెల్లు కొనసాగారు, కానీ ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయారు. ఇలా ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర పరిపాలనలో 276 మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించుకున్నా, కేవలం 11మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిలు కాగలిగారు. ప్రస్తుత 34మంది న్యాయమూర్తులలో మహిళలు ఇద్దరే.

ఇక హైకోర్టుల వైపు చూస్తే పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. గత ఆగస్టు 31 నాటికి సుప్రీంకోర్టు లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద హైకోర్టుల్లో కొలువుదీరిన 754 మంది న్యాయాధీశుల్లో కేవలం 106 మంది మాత్రమే మహిళలు. అంటే 14శాతం అన్నమాట. అన్ని హైకోర్టుల్లో ఉండాల్సిన 1100 పై చిలుకు జడ్జీల సంఖ్య పరిగణిస్తే, మహిళా న్యాయమూర్తుల శాతం ఇంకా పడిపోతుంది. ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఉన్న హైకోర్టులు ఎనిమిది ఉన్నాయి. అవి చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మణిపూర్‌, ఒరిస్సా, పట్నా, సిక్కిం, ఉత్తరాఖండ్‌.


జిల్లా కోర్టుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. దేశం మొత్తంలోని 719 జిల్లాల్లో గల 2,188 కోర్టుల్లో దాదాపు 37 శాతం జడ్జీలు మహిళలు కావడం ఆనందదాయకమే. కాని వారికి ప్రమోషన్లు వచ్చి హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్లగలుగుతున్నారా? లేదు.

ఓ వైపు న్యాయవ్యవస్థలో మహిళల కొరత, మరోవైపు వ్యవస్థలో వారి అవస్థలు మహిళల అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి. పైపెచ్చు మహిళలకు అధికారాలు అప్పజెప్తే పనులు పకడ్బందీగా జరుగుతాయన్న అభిప్రాయానికి విలువ లేకుండా పోతోంది. నమోదైన న్యాయవాదుల్లో 18 శాతమే మహిళలున్నా వారి సంఖ్య రెండున్నర లక్షల పైనే ఉంది. మనకు అంతమంది మహిళా న్యాయమూర్తులు అవసరం లేదు. దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి ఏభై శాతం నింపితే కనీసం న్యాయవ్యవస్థలోనైనా స్త్రీలకు న్యాయం దొరుకుతుంది.

‘పెళ్లి, పిల్లలుకనడం వల్ల స్త్రీలు తమ వృత్తిని వదిలేస్తారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకానికి కావాల్సిన సమయం కేటాయించి వారు మళ్లీ వృత్తిలోకి రావచ్చని’ ఇటీవలే సుప్రీంకోర్టు జస్టిస్‌ నాగరత్న ఓ సందర్భంలో అన్నారు. న్యాయవ్యవస్థలో సగం న్యాయమూర్తులు స్త్రీలే ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

డా. పి. మాధవరావు

ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్‌ సలహాదారు


Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 03:53 AM