అసమాన పరాక్రమశాలి అల్లూరి
ABN , Publish Date - May 07 , 2025 | 05:02 AM
భరతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తూ అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించిన తరుణంలో, దానికి భిన్నంగా సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. విశాఖ, గోదావరి ఏజెన్సీ...
భరతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తూ అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించిన తరుణంలో, దానికి భిన్నంగా సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. విశాఖ, గోదావరి ఏజెన్సీ ఏరియాల్లో నాగరికతకు దూరంగా బతుకుతున్న ఆదివాసీలను సంఘటితపరచి, వారిలో దేశభక్తిని రగిల్చి సాయుధులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించిన మన్యం వీరుడు ఆయన.
జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ సారథ్యంలో సాగిన అహింసామార్గ స్వాతంత్ర్య పోరాటం ఒక ఎత్తు, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి యోధులు సాగించిన పోరాటాలు మరో ఎత్తు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా జరిపిన ఈ మహనీయుల పోరాటాలు బ్రిటిష్ వారిని తరిమికొట్టడంలో కీలక భూమిక పోషించాయి. సీతారామరాజు నేతృత్వంలో సాగిన మన్య విప్లవం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడ లాడించింది. రెండున్నరేళ్ల పాటు బ్రిటిష్ వారిపై అవిశ్రాంత పోరాటం చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన అసాధారణ వ్యక్తి అల్లూరి.
1897, జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన రామరాజు, చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఫోర్త్‌ఫారం మధ్యలోనే చదువు ఆపేశాడు. పదిహేడేళ్ల వయసులో మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణరాజుతో కలిసి జయపురం, బస్తర్ వంటి మన్యం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఈ యాత్రలోనే ఆయనలో విప్లవబీజాలు మొలకెత్తాయి. అమాయక గిరిజనులు పరాయి పాలనలో పడుతున్న పాట్లను చూసి చలించిపోయి, అసమాన లక్ష్యాన్ని తలకెత్తుకున్నాడు. కనీస సదుపాయాలు లేని మన్యం ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. గుర్రపు స్వారీ నుంచి ఆయుధ ప్రయోగం వరకు పలు విద్యల్లో ఆరితేరాడు. తల్లికి చెప్పకుండా ఇల్లు వదిలి దేశాటన చేశాడు.
పోలీసులు, అటవీ అధికారుల దౌర్జన్యాలతో తల్లడిల్లుతున్న మన్యం ప్రజలను సమాయత్తపరచడం ఆరంభించాడు. ఒక పక్క బ్రిటిష్ వారితో పోరాటం చేస్తూనే మరోపక్క మన్య ప్రజల్లో మద్యపానం వంటి దురలవాట్లను రూపుమాపాడు. ప్రభుత్వ న్యాయస్థానాల గడప తొక్కవద్దని, పంచాయతీ కోర్టు కేంద్రాలను ఐదారు గ్రామాల్లో నెలకొల్పి రోజుకో కేంద్రానికి వెళ్లి అక్కడ వ్యాజ్యాలను విచారించి స్థానికుల సమక్షంలో తీర్పు చెప్పేవాడు.
బ్రిటిష్ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడాలంటే అల్లూరి సైన్యానికి తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై 300మంది అనుచరులతో దాడి చేశాడు. ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకుని వాటి వివరాలను పోలీస్‌స్టేషన్ డైరీలో నమోదు చేసి సంతకం చేశాడు. తాను చేయదలచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపి, అదే సమయానికి దాడి చేసేవాడు. ఆగస్టు 23, 1922న కృష్ణదేవీపేట, 24న రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం బ్రిటిష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తి చెంది దేశభక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది.
గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధ వ్యూహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి గుంటూరు కలెక్టర్ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన నేతృత్వంలోని 700 మంది సాయుధ పోలీసులు మన్యం ప్రాంతాన్ని జల్లెడ పట్టసాగారు. ఇరువర్గాలకు జరిగిన పోరులో అల్లూరి విప్లవ సైన్యం విజయం సాధించింది. ఆ తర్వాత దామనల్లి ఘాట్ వద్ద జరిగిన పోరులో ఇద్దరు బ్రిటిష్ సైనికులు మృతి చెందడం ఆంగ్లేయులను కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలో విప్లవాన్ని నిలువరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. విప్లవకారులకు సహాయపడే వారిని కఠినంగా శిక్షించింది. అమాయక ప్రజలను తీసుకెళ్లి హింసించి, కఠిన శిక్షలను విధించింది. తన కారణంగా అమాయక ప్రజలు నరకయాతన పడడాన్ని ఇష్టపడని రాజు బిట్రిష్ ప్రభుత్వానికి లొంగిపోవాలనుకున్నాడు. 1924, మే 7వ తేదీన మంప గ్రామంలో సీతారామరాజును బ్రిటిష్ బలగాలు నిర్బంధించాయి. మేజర్ గుడాల్ జరిపిన కాల్పులకు ఆయన నేలకొరిగాడు.
కొంతమంది చేసిన త్యాగం, చూపిన తేజం, అందించిన స్ఫూర్తి శతాబ్దాల పాటు జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. అలాంటి చరిత్రలో చెరగని పేరు అల్లూరి సీతారామరాజు. 27 ఏళ్ల జీవితం, కానీ శతాబ్దాలను తాకే ప్రభావం. ఆయన్ను స్మరించే ప్రతి మనసులో ఆయన ఆశయం ఇంకా గర్జిస్తూనే ఉంటుంది.
పెన్మత్స శ్రీహరిరాజు
సీనియర్ జర్నలిస్టు
(నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి)
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి