Share News

వృద్ధులందరికీ ఒకే పింఛన్ అవసరం

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:51 AM

మలి వయసులో జీవితం సాఫీగా గడవాలంటే పింఛన్ చాలా ముఖ్యం. మన దేశ పింఛన్ ఆస్తులు చాలా స్వల్పంగా ఉన్నాయని 2025–26 ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఆయా దేశాల జీడీపీల్లో 80 శాతంగా పింఛన్...

వృద్ధులందరికీ ఒకే పింఛన్ అవసరం

మలి వయసులో జీవితం సాఫీగా గడవాలంటే పింఛన్ చాలా ముఖ్యం. మన దేశ పింఛన్ ఆస్తులు చాలా స్వల్పంగా ఉన్నాయని 2025–26 ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఆయా దేశాల జీడీపీల్లో 80 శాతంగా పింఛన్ ఆస్తులు ఉన్నాయి. కానీ మన దేశ జీడీపీలో 17 శాతం మాత్రమే ఉన్నాయని తాజా ఆర్థిక సర్వే తెలిపింది. నేడు 12 శాతం ఉద్యోగులకు మాత్రమే ఫార్మల్ పింఛన్ కవరేజీ ఉంది, అది కూడా అసమతుల్యంగా. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంఘటిత రంగ ఉద్యోగులకు పలు రకాల పింఛన్ స్కీంలు అందుబాటులో ఉన్నాయి. అసంఘటిత రంగానికి వస్తే జాతీయ పింఛన్ విధానం, అటల్ పెన్షన్ యోజనలు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా స్వచ్ఛందంగా చేరే వారికే పింఛన్ లభిస్తుంది. ఈ రెండు స్కీంల ద్వారా దేశ జనాభాలోని కేవలం 5.3 శాతం మందే లబ్ధి పొందుతున్నారు.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పింఛన్ సార్వత్రికంగా అమలవుతున్నది. జపాన్‌లో 20–59 మధ్య వయసు పౌరులందరూ పింఛన్ కోసం ఫ్లాట్ రేట్ కంట్రిబ్యూషన్ స్కీములో తప్పనిసరిగా చేరాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, వారిపై ఆధారపడ్డవారికి ఒకటే స్కీం అమలుపరుస్తున్నారు. న్యూజిలాండ్‌లో కూడా పింఛన్ సార్వత్రికం. స్వీడన్, నార్వే, నెదర్లాండ్ దేశాలు సార్వత్రిక పెన్షన్ అమలు చేస్తున్నాయి. ఇండియాలో అసంఘటిత ప్రజల కోసం అమలులో ఉన్న పెన్షన్ స్కీంలు పూర్తిగా స్వచ్ఛందం. అర్హులందరికీ పింఛన్ అందకపోవడానికి ఇదొక అవరోధం. జనసామాన్యంలో పింఛన్ పట్ల సరైన అవగాహన లేదు. ప్రభుత్వం, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, విద్యాధికులు... ప్రజలకు పింఛన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి.


పింఛన్‌దారులకు సులువుగా డబ్బులు పొందే వీలు కల్పించటం, పింఛన్ వ్యవహారాలు చూసే సంస్థ ఆర్థిక ఆరోగ్యం కాపాడటం చాలా ముఖ్యం. పింఛన్ సంస్థ ఈ రెండు పనులు సమర్థవంతంగా నిర్వహిస్తే, ఆ సంస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మెర్కర్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ ప్రపంచ దేశాల పింఛన్ తీరుతెన్నులు గమనిస్తుంది. ర్యాంకింగ్ ఇస్తుంది. పెన్షన్ ఇండెక్స్ 2024లో 48 దేశాలలో పింఛన్ అమలుపై అధ్యయనం చేసింది. ఇందులో భారత్‌కు 44వ స్థానం దక్కింది. చైనాది 31వ స్థానం. అయినా పబ్లిక్ పెన్షన్ విధానంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రైవేట్ నిధుల సాయం తీసుకోకుంటే పబ్లిక్ పింఛన్ సేవలు కుంటుపడవచ్చు అంటోంది. కనుక బలమైన మార్కెట్ అభివృద్ధికి ప్రైవేట్ నిధుల మద్దతు అవసరం. నెదర్లాండ్స్, డెన్మార్క్‌, ఆస్ట్రేలియాలు ప్రజా పెన్షన్ సక్రమ నిర్వహణకు ప్రైవేట్ నిధులు స్వీకరిస్తున్నాయి. నమ్మకమైన రాబడి కోసం అమెరికా పెన్షన్ నిధులను ఎంపిక చేసిన ఋణ నిధులలో పెట్టుబడులు పెడుతోంది.

దేశంలో పలురకాల పెన్షన్ స్కీములు ఉన్నాయి. స్థూలంగా వీటిని ప్రభుత్వ స్కీములు, ప్రైవేటువి, వార్షిక ప్లానులుగా వర్గీకరించవచ్చు. వీటిలోనే జాతీయ పింఛన్ పథకం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ ప్రావిడెంట్, మరెన్నో ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా వున్న పెన్షన్ స్కీములను సమన్వయపరచి, ఆదర్శవంతమైన మూడు అంచెల పెన్షన్ స్కీంగా రూపొందించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. పని, హోదాలతో నిమిత్తం లేకుండా అర్హులందరికీ ఒకే ఫ్లాట్ రేట్ కాంట్రిబ్యూషన్ తప్పనిసరి చేసి, కనీస పింఛన్ గ్యారంటీ చేయాలి. ఉద్యోగుల కోసం కంపెనీ చెల్లించే ఆక్యుపేషనల్ పెన్షన్‌ను క్రమబద్ధీకరించాలి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కనీస చందా నియమానికి కట్టుబడి ఈ స్కీముని నిర్వహించాలి. స్వచ్ఛంద పెన్షన్ సేవింగ్స్ ప్రోత్సహించాలి. రిటైర్మెంట్ కాలానికి మంచి రిటర్న్ రావాలంటే ఈ రకమైన పొదుపులకు పన్ను రాయితీ ఇవ్వాలి. స్త్రీ, పురుష, పని భేదం లేకుండా వృద్ధులందరికీ పింఛన్ అందితే వారి జీవిత చివరి మజిలీకి కనీస ఆర్థిక భద్రత లభిస్తుంది.

వి. వరదరాజు

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:54 AM