Share News

Wings of Resistance: రెక్కలు విప్పిన దృశ్యం కోసం

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:56 AM

ఒకరు గాయపడినపుడల్లా ఓదార్చి నెమలీక స్పర్శతో మందు రాస్తుంది వర్షం యొక్క సన్నని సంభాషణలా ధ్వనిస్తుంది ఆత్మవిశ్వాసంతో ఉంటూ నిలువెల్లా ఒక ఎదురీత పటుత్వంతో...

Wings of Resistance: రెక్కలు విప్పిన దృశ్యం కోసం

ఒకరు గాయపడినపుడల్లా ఓదార్చి

నెమలీక స్పర్శతో మందు రాస్తుంది

వర్షం యొక్క సన్నని సంభాషణలా ధ్వనిస్తుంది

ఆత్మవిశ్వాసంతో ఉంటూ

నిలువెల్లా ఒక ఎదురీత పటుత్వంతో

ప్రతి కుంగదీత తర్వాత త్వరగా లేస్తూ

పోరాడుతూ, బలపడుతూ

‘‘వి వాంట్ జస్టిస్’’ అంటూ స్వరం కలుపుతూ

రెక్కలు విప్పిన దృశ్యంకోసం పిడికిలి బిగించి

అణచివేతల కట్లు తెంపుతోంది

ఆమెకు ఆమె గుర్తుగా ఏదో చేయాలని వుంది

ఏది పువ్వో, ఏది ముల్లో

ఏది వానో, ఏది వడగళ్ళో

ఒక స్పర్శలో ఎన్ని స్పర్శలున్నవో

ఒక వానలో ఎన్ని వానలున్నవోననే

రెక్కలుండి వెలుగుండి

బంకమట్టికి అతికించిన మిణుగురులాంటి

అవస్థ నుండి బయటపడుతోంది

చేతిరేఖలరగదీసి బతుక్కి తిలకందిద్ది

పునాదిరాతిలా నిలిచిన ఆమె

ఏ గోడల వెనుకో దాక్కోకుండా

దారి అంతటా ఒకరు తోడుకావాలనే

కొన్ని గింజలేసి పట్టుకోజూస్తే లొంగిపోకుండా

వెలుగులోకొస్తోంది

స్వేచ్ఛను మాట్లాడటానికి

తన కథకు స్వరాలిస్తూ

చెదిరిన కలల రోజుల్నిదాటి

సాధికారతా సంతకం పెడుతూ

మోసిన తట్టెడు సర్వనామాల్ని

కీబోర్డుమీద కొనగోటితో చెరిపేస్తోంది

తనని ఒక గుర్తింపులేని చిరునామాగా

ఉంచిన రోజుల్ని ధిక్కరిస్తూ

తరాల నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతోంది.

శాంతయోగి యోగానంద

96522 71520

ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Sep 01 , 2025 | 12:56 AM