Share News

A New Chapter in Bihars Political Landscape: బిహార్‌లో నూతన అధ్యాయం

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:48 AM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి, విజయదుందుభి మోగించిన ఎన్డీయే కూటమి, నితీశ్‌కుమార్‌ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మంత్రివర్గం కూర్పు ఎంతో చక్కగా...

A New Chapter in Bihars Political Landscape: బిహార్‌లో నూతన అధ్యాయం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి, విజయదుందుభి మోగించిన ఎన్డీయే కూటమి, నితీశ్‌కుమార్‌ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మంత్రివర్గం కూర్పు ఎంతో చక్కగా, అత్యంత సాఫీగా జరిగి, మరోవిడత పాలన మొదలైంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. బిహార్‌ రాజకీయ చరిత్రలో దశాబ్దాల తరబడి వెంటాడుతున్న హింసాత్మక నీడలను చెరిపేసి, అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు ముగియడం ఈసీ సాధించిన విజయం.

ఒకప్పుడు ఎన్నికలు అంటేనే బిహార్‌ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ఉండేది. బ్యాలెట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఘర్షణలు, హింసాత్మక ఘటనలు సాధారణంగా కనిపించేవి. కానీ, మొన్నటి ఎన్నికలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకపోవడం, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఈ మార్పు బిహార్‌ సామాజిక, రాజకీయ పరిణితికి నిదర్శనం.

ఎన్నికలలో ప్రశాంత వాతావరణం ప్రజలలో విశ్వాసాన్ని నింపింది. దీని ఫలితమే రికార్డు స్థాయి పోలింగ్‌ నమోదు కావడం. కనీవిని ఎరగని రీతిలో 67.1 శాతం పోలింగ్‌ జరగగా, 71.7 శాతం మహిళా ఓటర్ల పోలింగ్‌ జరిగింది. 1951 తర్వాత బిహార్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది 2025 ఎన్నికల్లోనే కావడం గమనార్హం. మహిళలు, వృద్ధులు, యువత అనే తేడా లేకుండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఈసీఐ సాధించిన అతిపెద్ద, చారిత్రక విజయం ‘జీరో రీ-పోలింగ్‌’. సాధారణంగా సాంకేతిక లోపాలు, ఈవీఎంల మొరాయింపు లేదా అక్రమాలు జరిగినప్పుడు ఆయా కేంద్రాల్లో మళ్ళీ పోలింగ్‌ నిర్వహిస్తారు. కానీ, 2,616 మంది అభ్యర్థులు, 12 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బరిలో ఉన్నా, ఒక్కరంటే ఒక్కరు కూడా ‘రీ-పోలింగ్‌’ కోరకపోవడం అపూర్వం. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఓట్ల తొలగింపు లేదా ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత, ఓటర్ల జాబితాపై ‘జీరో అప్పీల్స్‌’ నమోదు కావడం గమనార్హం.


ఈ ఎన్నికల్లో స్వయం సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని భారీ పోలింగ్‌కు సహకారం అందించారు. వీరు భాజపా తరపున ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి మోదీ ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌, ఉజ్వల యోజన, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాల లబ్ధిని వివరించారు. అలాగే బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి... రోడ్లు, విద్యుత్‌, ఆస్పత్రులు, లా అండ్‌ ఆర్డర్‌ వంటి వాటిలో మెరుగుదలను ఉదాహరణలతో వివరించారు. గత జంగిల్‌ రాజ్‌లో ప్రతి గ్రామంలో రోజూ కిడ్నాప్‌, హత్యలు, అవినీతి, మహిళలపై అత్యాచారాలతో పాటు రోడ్లు, కరెంటు, ఉద్యోగాలు లేకుండా ప్రజలు భయంతో బతికిన దుర్గతిని గుర్తు చేశారు. దాంతో పాటు ఇప్పుడు నితీష్‌–మోదీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తెచ్చిన శాంతి, అభివృద్ధి, సంక్షేమాన్ని పోల్చి చూపించారు. ఈ పోలికతోనే ఓటు అడిగారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన అవశ్యకతను వివరించి, ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొనేలా సిద్ధం చేశారు. అందువల్లే ఓటింగ్‌లో భారీ పెరుగుదల కనిపించింది.

బిహార్‌ 2025 అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఓటర్లే కారణం. ప్రతిపక్షాలు ఎన్నికలకు అంతరాయం కలిగించే ప్రయత్నాలను వారే అడ్డుకుని ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. కమిషన్‌ పారదర్శకతను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన దరిమిలా ఆయనతో పాటు ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌, కమ్యూనిస్టులు లేవనెత్తిన ‘ఓట్‌ చోరీ’, ‘ఈవీఎం ట్యాంపరింగ్‌’, ఓటర్ల జాబితా అవకతవకల వంటి ఆరోపణలు ప్రారంభించారు. వీటిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రతిపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై నిందలు వేస్తున్నాయని, వారి వద్ద స్పష్టమైన అభివృద్ధి అజెండా లేదని ఓటర్లు గ్రహించారు. మరోవైపు, ఎన్‌డీఏ ప్రభుత్వం అందించిన ‘సుపరిపాలన’, శాంతిభద్రతల మెరుగుదల ప్రజల్లో గాఢమైన విశ్వాసాన్ని నింపింది. గతంలో బిహార్‌ను పట్టి పీడించిన అరాచక పరిస్థితులు మళ్ళీ తిరిగి రాకూడదని యువత బలంగా కోరుకుంది. అందుకే, కుల రాజకీయాలకు అతీతంగా, అభివృద్ధి, ఉపాధి అవకాశాల వైపు చూస్తూ యువత ఎన్‌డీఏకు పట్టం కట్టింది. మోదీ–నితీశ్‌ల ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు వల్లనే రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్తుందని యువత నమ్మింది. హింస ద్వారా అధికారాన్ని దక్కించుకునే రోజులు పోయాయని, ఓటు అనే ఆయుధంతోనే మార్పు సాధ్యమని యువత నిరూపించి, తద్వారా ఎన్‌డీఏ విజయానికి బాటలు వేసింది.


ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయానికి వెన్నెముకగా నిలిచింది మాత్రం నిస్సందేహంగా మహిళా ఓటర్లే. మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి ఓట్లు వేయడానికి ప్రధాన కారణం ఎన్‌డీఏ ప్రభుత్వం కల్పించిన ‘భద్రత’, ‘మహిళా సంక్షేమ పథకాలు’. నితీశ్‌కుమార్‌ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపులో ఉండటం, మద్యనిషేధం వంటి నిర్ణయాలు మహిళల రోజువారీ జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చాయి. తమ కుటుంబాలకు రక్షణ కల్పించే ప్రభుత్వం వైపే వారు మొగ్గు చూపారు. కేవలం భద్రతే కాకుండా, మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, ‘మహిళా రోజ్‌గార్‌ యోజన’ వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు వారిని ఆర్థికంగా బలోపేతం చేశాయి. ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటాలను పట్టించుకోకుండా, తమకు మేలు చేసిన ప్రభుత్వానికి నిశ్శబ్ద విప్లవంలా ఓట్లు వేశారు.

2025 బిహార్‌ ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వ మార్పును మాత్రమే సూచించడం లేదు. అవి ఎన్నికల నిర్వహణ ప్రమాణాలను ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. సాంకేతికత, పారదర్శకత, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎంతటి క్లిష్టమైన ఎన్నికలనైనా ప్రశాంతంగా నిర్వహించవచ్చని బిహార్‌ దేశానికి చాటిచెప్పింది.

వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ్‌

బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 05:48 AM