Share News

Poetry Against Violence: దేశం పేరు శూన్యం

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:24 AM

నన్ను పూర్తిగా దహించివేయక ఈ రాత్రి గడిచేట్టు లేదు నా దేహం బూడిదయ్యాక కాలభైరవుడిలా శరీరమంతా నన్ను పులుముకొని ఈ కారు చీకటి...

Poetry Against Violence: దేశం పేరు శూన్యం

నన్ను పూర్తిగా దహించివేయక

ఈ రాత్రి గడిచేట్టు లేదు

నా దేహం బూడిదయ్యాక

కాలభైరవుడిలా శరీరమంతా నన్ను పులుముకొని

ఈ కారు చీకటి ఇక్కడి నుండి ఎక్కడికీ కదిలేటట్టు లేదు

అగ్నికీలలు

నా ఎముకల మాలను

తమ మెళ్ళో వేసుకొని ఈ వీధుల గుండా

నర్తిస్తూ

నెత్తుటి నాలుకను

నా ఇంటి గుమ్మానికి వేలాడదీ‌సి గానీ

కనుమరుగయ్యేటట్టు లేవు

నా దేశాన్ని నా నుంచి లాగేసుకొన్న

మిసైళ్ళవాన కురవడం ఆపనంటోంది

నేను ముక్కముక్కలుగా

పేలిపోతూనే ఉన్నాను

దిక్కులన్నీ మూసుకుపోయేలా

మాంసపు కుప్పలా మారిపోతూనే ఉన్నాను

యుద్ధ‌దాహం ఎంత క్రూరమైందీ?

మరణించినవారిని మళ్ళీ మళ్ళీ చంపుతుంది!

‘‘అక్కడా ఎవరూ మిగిలి లేరు’’ అని తెలిశాక కూడా

శూన్యం మీద కూడా బాంబులు విసురుతుంది

ఇప్పుడు నా దేశం ఒక నిండైన శూన్యం

నా నామరూపాల గురించి

ఇంకెప్పుడూ ఏ ప్రపంచపటం చెప్పదు

ఒకప్పుడు అందరిలా

నేనో దేశాన్ని కలిగి ఉండేవాడినని

ఇక ఎవరూ గుర్తించరు

అవును నేను

ఎవరికీ గుర్తుగా కూడా మిగలను

ఈ రాత్రి నన్ను పూర్తిగా

దహించి వేశాక

నా దేశానికి శూన్యం

అనే నామకరణం చేసి వెళ్ళిపోండి

మహమూద్

94410 27462

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:24 AM