Telugu Literature Preservation: మనకు ప్రపంచస్థాయి గ్రంథాలయం అవసరం
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:00 AM
మనకు స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఇంత వరకూ తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు అవసరమైన ఒక ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని స్థాపించుకోలేకపోయాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘జ్ఞానసౌధ’ పేరిట...
మనకు స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఇంత వరకూ తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు అవసరమైన ఒక ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని స్థాపించుకోలేకపోయాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘జ్ఞానసౌధ’ పేరిట ‘తెలంగాణ ప్రజా గ్రంథాలయం’ (తెప్రగ్రం) నిర్మించుకోవాల్సిన అవసరముంది. అప్పటి వరకూ ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ నాంపల్లి ప్రాంగణాన్ని ఈ గ్రంథాలయానికి అంకితం చేస్తే తెలుగు భాషా సాహిత్యాలకు ఎంతో మేలు జరుగుతుంది.
తెప్రగ్రం ముఖ్య ఉద్దేశ్యాలు మూడు: 1) తెలుగులో ఇప్పటివరకూ ప్రచురితమైన ప్రతి తెలుగు పుస్తకం, పత్రికను సేకరించి భద్రపరచటం, దానిని సదా అందరికీ అందుబాటులో ఉంచటం. 2) పాఠకుడు ఏ తెలుగు పుస్తకం, పత్రిక అడిగినా దానిని 30 నిమిషాల్లోపు అందించటం. ఒకవేళ తెప్రగ్రంలో అది లేకపోతే, ఎక్కడ లభ్యమవుతుందో తెలియజేయటం. 3) తెప్రగ్రం నిక్షేప (డిపాజిటరీ) గ్రంథాలయంగా పనిచేస్తూ, తెలుగు సహా ఇతర భాషలలో ప్రచురితమైన గ్రంథాలను సేకరించి, అవసరమైన ఇతర గ్రంథాలయాలకు చేర్చడం.
ఈ తెప్రగ్రం కనీసం పది అంతస్తుల హరిత భవనంలో ఉండాలి. అందులో ముఖ్యంగా పౌర గ్రంథాలయాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్; తెలుగు పుస్తకాల ప్రపంచ నిక్షేపణస్థానం (డిపాజిటరీ); తెలుగు పత్రికల, వార్తా పత్రికల ప్రపంచ నిక్షేపణస్థానం, పరిశోధక విద్యార్థుల సమావేశ ప్రదేశం, తెలంగాణ అమర వీరుల స్మృతి పఠనాలయం, సమావేశ మందిరం వంటివి ఉండాలి. తెప్రగ్రం ప్రాజెక్ట్ ప్రణాళిక తయారీకి గ్రంథాలయ సమాచార శాస్త్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు, సాహితీవేత్తలు మొదలైన వారితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
తొలి, మలి తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన చారిత్రక మూలాధారాలను భద్రపరచాలి. ఎటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం, ఒత్తిడి, పక్షపాతం లేకుండా సాక్ష్యాధారిత పండిత తెలంగాణ చరిత్ర రాయడానికి తెప్రగ్రం ప్రథమ వనరుగా సేవలందించాలి. ఆచార్య జయశంకర్, గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకారుల ముద్రిత, అముద్రిత రచనలు, రాతప్రతులు వంటి వాటిని కూడా తెప్రగ్రం ద్వారా మనం సంరక్షించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెప్రగ్రం స్థాపనకు ఆదాయపన్ను రాయితీతో ‘సీఎం జ్ఞాన నిధి’ని ఏర్పాటు చేయాలి.
జీహెచ్ఎంసీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,038.42 కోట్లు ఆస్తిపన్ను రూపేణా సేకరించింది. చట్ట ప్రకారం దీనిలో 8 శాతం, అంటే రూ.163 కోట్లు, లైబ్రరీ సెస్‌గా ప్రజలు చెల్లించారు. ఈ నిధులను తెప్రగ్రం స్థాపనలో ప్రారంభ పనులకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలూ రూ. వేల కోట్ల లైబ్రరీ సెస్ నిధులను గ్రంథాలయాలకు బదిలీ చేయడం లేదు. మన పౌర గ్రంథాలయ వ్యవస్థ పతనానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. అందుకే ఆ నిధులను గ్రంథాలయాల అభివృద్ధికే కేటాయించాలి. అప్పుడే తెలంగాణ ప్రజల సాహితీ సాంస్కృతిక స్మృతిగా తెప్రగ్రం భాసించగలదు.
ఆచార్య సర్గు సుదర్శన్‌రావు
గ్రంథాలయ సమాచారశాస్త్ర పూర్వ ఆచార్యులు, ఓయూ
టి.వి. ప్రఫుల్ల చంద్ర
పూర్వ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఇఫ్లూ
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.