Koduri Sriramamurthy సాహిత్య భావుకుని మేధో దీప్తిధార
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:34 AM
విశిష్ట సాహిత్య కృషి చేసిన అరుదైన ధీమంతుడు కోడూరి శ్రీరామమూర్తి. సాహిత్య విమర్శ, కథ, నవల, బాల సాహిత్యం, పరిశోధన, పత్రికా రచనలో తనదైన ముద్ర వేసిన మేధావి కోడూరి. గాంధేయవాద చింతకుడే అయినా భగత్‌సింగ్ విప్లవాదర్శాలు, మానవేంద్రనాథ్ రాయ్ నవ్యమానవవాదం...
నివాళి : కోడూరి శ్రీరామమూర్తి 29 సెప్టెంబర్ 1941 – 5 ఆగస్టు 2025
విశిష్ట సాహిత్య కృషి చేసిన అరుదైన ధీమంతుడు కోడూరి శ్రీరామమూర్తి. సాహిత్య విమర్శ, కథ, నవల, బాల సాహిత్యం, పరిశోధన, పత్రికా రచనలో తనదైన ముద్ర వేసిన మేధావి కోడూరి. గాంధేయవాద చింతకుడే అయినా భగత్‌సింగ్ విప్లవాదర్శాలు, మానవేంద్రనాథ్ రాయ్ నవ్యమానవవాదం, వల్లభ్‌భాయ్ పటేల్ రాజనీతిజ్ఞత గురించి కూడా తెలుగువారికి స్ఫూర్తిదాయకంగా చెప్పిన విశాల భావుకుడు కోడూరి. ప్రపంచ మేధావులైన బెర్ట్రాండ్ రస్సెల్, హెన్రీ డేవిడ్ థోరో, జాన్ రస్కిన్, జాన్ స్టువర్ట్‌మిల్ వంటి వారి గురించి తెలుగులో మొదటిసారిగా విలువైన రచనలు చేసిన అపూర్వ ఆలోచనాశీలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కడవరకూ తాను నమ్మిన మానవతావాద సిద్ధాంతానికి సాహిత్య రంగంలో చోటు కల్పించి, మనసా వాచా కర్మణా మనిషి ఉన్నతికి పాటుపడిన రచయిత కోడూరి శ్రీరామమూర్తి.
1941, సెప్టెంబరు 29న రాజమండ్రిలో దేశభక్తుల కుటుంబంలో కోడూరి జన్మించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో మొదటిసారి తన స్వగృహంపై జాతీయ జెండా ఎగరవేసిన దేవతా శ్రీరామమూర్తి ఆయన తాతగారు. ప్రభుత్వం తనపై పెట్టిన అక్రమకేసుల్ని ఎదుర్కొని ‘జెండా ఎగరేయడం నా జన్మహక్కు’ అని దేవతా శ్రీరామమూర్తి స్వయంగా కోర్టులో వాదించుకుని కేసు గెలిచారు. ఆయన స్ఫూర్తితో రాజమహేంద్రి వాసుల గృహాలు మువ్వన్నెల జెండాతో రెపరెపలాడాయి. దేవతా శ్రీరామమూర్తిని ‘జెండా ప్లీడరు’ అని రాజమహేంద్రీయులు గౌరవించేవారు. దేశభక్తుడైన తాతగారి పేరే సాహితీవేత్త అయిన మనవడి పేరు.
కోడూరి శ్రీరామమూర్తి తండ్రి పుల్లేశ్వరరావు. తల్లి లీలావతిదేవి. బాల సాహిత్య సృజనలో కీర్తిగాంచిన తల్లి తీలావతి ప్రభావంతో మన కోడూరి చిన్నవయసులోనే ‘నేనూ–నా చెల్లెలు’ అనే రచన చేశారు. శ్రీరామమూర్తి విద్యార్థి దశ నుంచీ గాంధేయవాది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భంగా 14 అధికారిక భాషల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన పుస్తక రచన పోటీల్లో కోడూరికి మొదటి బహుమతి వచ్చింది. అప్పటికి ఆయన వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. కోడూరి రచనా వ్యాసంగం అలా ప్రారంభమయింది.
అమెరికన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వారి ప్రోత్సాహంతో పలు అనువాదాలు చేసిన శ్రీరామమూర్తి ‘ఉదయరేఖ’ అనే సాహిత్య పత్రికను స్వయంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా బొబ్బిలి కళాశాలలో ఆర్థిక శాస్త్రం బోధించారు. అప్పట్లో కోడూరి శ్రీరామమూర్తి వ్యాసాలు ‘భారతి’లో ఎక్కువగా వస్తుండేవి అంటే ఆయన సాహిత్య వ్యాసంగానికి ఆనాడే ఎంతటి గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన రాసిన, ‘తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ’ నాటికి నేటికి కూడా ఆ అంశం మీద తెలుగులో ఉన్న ఏకైక ఉద్గ్రంథం. ఆయన నవల ‘నీటిలో నీడలు’ వాషింగ్టన్‌లోని కాంగ్రెస్ లైబ్రరీలో ఎంపిక చేసి ఉంచిన అరుదైన తెలుగు పుస్తకాల్లో ఒకటి. వెలుగు వెన్నెల అనే వ్యాస సంపుటి, తెలుగు కథ నాడు– నేడు, మా మంచి తెలుగు కథ, రాగమాలిక, తెర తీయగరాదా కథా సంపుటి, బాలసాహిత్యంలో రవికవి, మహనీయుల జీవితంలో కథ కాని కథలు మొదలైనవి ఆయన ఇతర రచనలు. హేతు చింతనతో కూడిన జిజ్ఞాస కోడూరి రచనల్లో సువ్యక్తమవుతుండేది. వ్యక్తిగత నమ్మకాలతో సంబంధం లేకుండా శాస్త్రీయ దృష్టితో చరిత్రని, సాహిత్యాన్ని, సమాజాన్ని సమీక్షించడం కోడూరి ప్రత్యేకత. గాంధీజీ ప్రతిపాదించిన నూతన విద్యావిధానం, నైతిక ప్రవర్తనావళి, పౌర చైతన్యం, సామాజిక న్యాయం, సహాయ నిరాకరణోద్యమం, సహకార సంఘాలు, సర్వోదయ సిద్ధాంతం వంటివి యువత లోతుగా అధ్యయనం చేయాలని కోడూరి ఆశించేవారు.
గాంధీ జీవితం, బోధనల గురించి కోడూరి తన జీవితపర్యంతం సమున్నతమైన కృషి చేశారు. మహాత్మాగాంధీని బహుముఖ కోణాలలో ఆవిష్కరించిన తొలి తెలుగు రచయిత కోడూరి. కేవలం స్వాతంత్ర్య సమరయోధుడుగా మాత్రమే కాక ఒక సత్యాన్వేషిగా, పాత్రికేయుడిగా, పర్యావరణవేత్తగా, దార్శనిక ఆలోచనశీలిగా, రాజకీయవేత్తగా ఎన్నోరూపాల్లో మనకు తెలియని మహాత్ముడి గురించి ఆయన విస్తృతంగా రాశారు. బహుశా మరే ఇతర భారతీయ భాషా సాహిత్యంలో కూడా మహాత్మాగాంధీ గురించి ఇంత విలక్షణంగా వివరించినవారు ఎవరూ ఉండరేమో? అలనాటి ‘ఆంధ్రజ్యోతి’ వార పత్రికలో ‘గాంధీజీ కథావళి’ రాశారు. ‘నేటికీ గాంధేయ మార్గం ఎలా అవసరమో’ చెబుతూ ఒక సుప్రసిద్ధ దినపత్రికలో ఒక వ్యాస పరంపర రాశారు. గాంధీజీ దృక్పథానికి కట్టుబడి మొత్తం పదిహేను వరకూ పుస్తకాలు రాశారు.
‘ఇప్పుడు నా వయస్సు ఎనిమిది దశాబ్దాలు దాటి తొమ్మిదో దశాబ్దంలో దాదాపుగా సగానికి వొచ్చింది. జారిపోకుండా ఉన్న జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుందామనే ఉద్దేశంతో ఆత్మకథ వ్రాయడం ప్రారంభించాను. ఇది చాలా విలువైనదని చెప్పడం లేదు. కానీ, ఒక తరంలో జీవించిన, ఇంకా జీవిస్తున్న ఒక వ్యక్తి జ్ఞాపకాలు కాబట్టి కొత్త తరం పాఠకులకు కొంతైనా ఉపయోగకరంగా ఉండవచ్చునని ఇది రాస్తున్నాను...’ అంటూ ‘తెగిన జ్ఞాపకాలు’ పేరిట స్వీయచరిత్ర మొదలుపెట్టిన కోడూరి శ్రీరామమూర్తి ఆగస్టు 5న సాయంత్రం అస్తమించారు. అముద్రితంగా ఉండిపోయిన ఆయన విశేష పరిశోధన ‘స్వాతంత్ర్యానంతర యుగంలో వచన సాహిత్యం : సంప్రదాయం, ప్రయోగం’ను వెన్వెంటనే వెలుగులోకి తీసుకురావలిసిన అవసరమున్నది.
కోడూరి శ్రీరామమూర్తి సాత్విక స్వభావి. నైతిక విలువలతో నిండారిన, విప్పారిన సార్ధక జీవితం ఆయనది. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, ఫ్రెంచ్ విప్లవం మొదలైన చారిత్రక అంశాలపై సాధికారికంగా రచించగల, ఉపన్యసించగల అరుదైన తెలుగు సాహిత్యకారుడు. జీవన సహచరి భారతి ఆకస్మిక మరణం అంతిమ దశలో ఆయన్ని కుంగదీసింది. ఆ దిగులుతోనే చివరివరకూ రచనా వ్యాసంగానికే అంకితమై అక్షరాలతోనే సహజీవనం చేస్తూ అంతిమ శ్వాస విడిచారు. రాజకీయ విప్లవాలు, భావ ఉద్యమాలు అన్నింటిపట్లా స్నేహపూరిత దృక్పథంతో వ్యవహరించిన కోడూరి నికార్సయిన ప్రజాస్వామ్యవాది. ఆయన మరణంతో గాంధేయవాదానికి సంబంధించిన ఒక ప్రత్యేక చింతనాశీలిని తెలుగు సమాజం కోల్పోయింది.
గౌరవ్
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి