Vanabhojanalu: కార్తీక మాసంలోనే వన భోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా?
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:02 PM
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వన భోజనాలు నిర్వహిస్తున్నారు. వీటికి భారీగా ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ వన భోజనాలు కార్తీక మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారు. దీని వెనుక ఏదైనా కారణం ఉందా?
కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ మాసంలో భక్తులు దేవాలయాలకు పోటెత్తడమే కాదు.. వన భోజనాలకు సైతం భారీగా క్యూ కడతారు. ప్రతి ఏటా కార్తీక మాసంలోనే వన భోజనాలు ఏర్పాటు చేస్తారు? అసలు ఈ మాసంలో ఎందుకు ఈ వన భోజనాలు నిర్వహిస్తారు. అది కూడా తోటలు, బీచ్‌లు, పార్కులు తదితర ప్రాంతాలను వేదికగా చేసుకుని వీటిని నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. దీని వెనుక ఏమైనా కారణం ఉందా? అంటే.. ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
అయితే చలి కాలం ప్రారంభమైంది. ఈ చలి కారణంగా.. చాలా మంది తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు. ఇలా తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉండి పోవడం వల్ల.. ప్రతి ఒక్కరిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇంట్లోనే ఉండిపోవడంతో.. ఇరుగు పొరుగు వారితో సైతం మాటమంతి ఉండదు.
ఈ నేపథ్యంలో ఏదో ఒక తోట లేకుంటే పార్క్‌లోనో వనభోజనాలు ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల అందరు ఒక చోటకి చేరతారు. ఆట పాటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దీంతో పచ్చని చెట్ల మధ్య ఆక్సిజన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల శుభ్రమైన గాలి అందరికి అందుతుంది. అలాగే ఆటపాటలు సంస్కృతిక కార్యక్రమం వల్ల ఇందులో పాల్గొన్నవారంతా కొత్తగా రీచార్జ్ అవుతారు.
ఇక ఈ మాసంలో ఉసిరి కాయ తినడం.. ఆ చెట్టును పూజించడంతోపాటు ఈ చెట్టు కింద భోజనం చేయడం పవిత్ర కార్యంగా భావిస్తుంటారు. ఉసిరి చెట్టుకు మరో పేరు ధాత్రి. ఈ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీకమాసంలో ఉసిరి చెట్టు వద్ద భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీమహా విష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఒక చెట్టు తానంతట తానుగా కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో.. మానవాళి సైతం స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాన్ని ఈ వనాలు స్పష్టం చేస్తాయి. అలాంటి వనాల్లో ఈ కార్తీక మాసంలో భోజనం చేయడం వల్ల స్ఫూర్తి పొందినట్లవుతుందని పెద్దలు చెబుతారు.
అలాగే వన భోజనం అంటే.. చెట్ల మధ్య కూర్చొని ఆహారాన్ని స్వీకరించడమని పేర్కొంటారు. అందులోనూ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఆయా చెట్లు మీదగా వీచే గాలి.. మనస్సుకు ప్రశాంతతను, హాయిని ఇస్తుంది. అంతేకాకుండా.. ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. ప్రత్యేకించి.. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యుల సైతం చెబుతున్నారు.