Tirumala: తిరుమలలో.. ఎన్నెన్ని సేవలో...
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:25 AM
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దివ్యరూపం ఒక్కొక్కరికీ ఒక్కో అనుభూతిని మిగులుస్తుంది. ఆయన ఆకర్షణ అటువంటిది. శ్రీవారు దేవేరులతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవలేంటి? ఏ సమయంలో ఏం చేస్తారు?
తెల్లవారుజాము 2.15 గంటలకు సన్నిధి గొల్ల దివిటీతో అర్చకులను ఆలయానికి తీసుకువస్తారు. బంగారు వాకిలి నుంచి మూలవర్ల వరకు ఈ దివిటీ వెలుగులోనే అర్చకులు గర్భగుడికి చేరుకుంటారు. అఖండ దీపాలను వెలిగించి కాంతిమయం చేస్తారు.
తెల్లవారుజాము 2.30 సుప్రభాతం: సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతారు. ఇందులో 29 శ్లోకాలుంటాయి. ఆ తర్వాత 11 శ్లోకాలున్న శ్రీ వేంకటేశ్వరస్తోత్రం పఠిస్తారు. దీని తర్వాత 16 శ్లోకాలతో శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి ఆలపిస్తారు. 14 శ్లోకాల మంగళ శాసనంతో సుప్రభాత కార్యక్రమం ముగుస్తుంది. తాళ్ళపాక అన్నమయ్య వంశానికి చెందినవారు తంబుర మీటుతూ వీటిని ఆలపిస్తారు. ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం బదులు అండాళ్ తిరుప్పావై పాశురాలను గానం చేస్తారు.
తెల్లవారుజాము 3.00 నక్షత్ర హారతి: సుప్రభాతం తరువాత శ్రీవారికి ఇచ్చే తొలి హారతిని నక్షత్ర హారతి అంటారు. 27నక్షత్రాలు శ్రీ వేంకటేశ్వరస్వామికి హారతి ఇచ్చినట్టు ఈ హారతి కన్నుల పండువగా సాగుతుంది.
ఉదయం 3.30 తోమాలసేవ: జియ్యంగారు యమునత్తురైకి వచ్చి అక్కడి పుష్పమాలలు, వెదురుగంపను తలపై పెట్టుకుని, జేగంట మోగుతుండగా ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణ చేసి గర్భాలయం వద్దకు తీసుకువస్తారు. భక్తులు చూస్తుండగా స్వామివారికి పుష్పాలంకారం జరుగుతుంది. అలంకారం జరిగేప్పుడు ఆళ్వారుల పాశురాలతో పాటు, మంత్ర పుష్పం పఠిస్తారు. శుక్రవారం మాత్రం తోమాలసేవ ఉదయం 7.00 గంటలకు జరుగుతుంది.

ఉదయం 4.00 కొలువు: ముందురోజు నాటి ఆదాయ, వ్యయాలను దేవుడికి నివేదించే కార్యక్రమం ఇది. జయవిజయుల తరువాత ఉండే మండపంలో స్వర్ణ సింహాసనంపైన కొలువు శ్రీనివాసమూర్తి ఆశీనులై ఉంటారు. ఛత్రచామరాలతో మర్యాదలు చేస్తారు. పంచాంగ శ్రవణం చేసి, ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఉత్సవ విశేషాలను, ముందురోజు లభించిన ఆదాయ వివరాలను ఏయే నోట్లు, నాణేలు ఎన్ని వచ్చిందీ వివరంగా వినిపిస్తారు. నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నివేదన చేసి, హారతి ఇస్తారు.
ఉదయం 4.15 సహస్రనామార్చన: కొలువు తరువాత అర్చకుడు శ్రీవారి పాదాల చెంత కూర్చుని సంకల్పం చెప్పుకుని జేగంట వాయిస్తూ పువ్వులు, తులసి పత్రాలు తీసుకుని ఓం వేంకటేశ్వరాయ నమః అంటూ స్వామి వారి వేయి పేర్లను స్తుతిస్తూ చేసే సేవ ఇది. తర్వాత శ్రీవారి పాదాల వద్ద ఉన్న పువ్వులు, తులసి పత్రాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఇదే అర్చనకు ధనుర్మాసంలో తులసికి బదులు, మారేడు దళాలు వినియోగిస్తారు. శుక్రవారం మాత్రం ఉదయం 7.00 గంటలకు సహస్రనామార్చన జరుగుతుంది.

శుక్రవారం ఉదయం 4.30 అభిషేకం: మూలమూర్తికి ప్రతి శుక్రవారం మాత్రం అభిషేకం ఉంటుంది. అయితే రోజూ భోగ శ్రీనివాసుడి విగ్రహానికి ఉదయం ఆకాశగంగ నుంచి తెచ్చిన జలంతో పురుషసూక్తం చదువుతూ అభిషేకం నిర్వహిస్తారు. జీయర్ స్వామి వారి ప్రతినిధి నిరాట్టం చదువుతారు. మూలవిగ్రహానికి, భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఇలా కలపడం వల్ల భోగశ్రీనివాసమూర్తికి చేసే ఉపచారాలు మూలవర్లకు చేసినట్టు. అభిషేక సమయంలో విగ్రహానికి పలుచని గుడ్డ కట్టి నూనె రాసి, చింతపండు నీటిని కలిపి జిడ్డును తొలిగిస్తారు. ఆవుపాలు, గంధం, పసుపునీటితో అభిషేకిస్తారు. శుద్దోదక స్నానం, గంగోదక స్నానం చేయించి, మరలా శుద్దోదక స్నానంతో ముగిస్తారు. వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పిస్తారు. కర్పూరంతో నుదుటిమీద ఊర్ధ్వపూండ్ర చిహ్నాన్ని దిద్ది యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
మధ్యాహ్నం 12.00 కళ్యాణోత్సవం: రెండో నైవేద్యం తరువాత ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మేళతాళాలతో సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఒక సింహాసనంపై స్వామిని, మరో సింహాసనంపై అమ్మవార్లను ఆశీనులను చేస్తారు. కంకణ ధారణ చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, గోత్రనామాలు చెప్పి కన్యాదానం నిర్వహిస్తారు. అనంతరం మంగళసూత్రాలు ధరింపజేస్తారు. ఒకే సింహసనంపైకి ఉత్సవ మూర్తులను చేర్చి కర్పూర హారతి ఇస్తారు.
సాయంత్రం 5.30 సహస్ర దీపాలంకరణ: ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని అలంకరించి వైభవోత్సవ మండపం నుంచి కొలువు మండపానికి తీసుకువస్తారు. అక్కడ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు. వేద మంత్రాలతో పండితులు స్వామివారిని కీర్తిస్తారు. విద్వాంసులు నాదస్వరాన్ని వినిపిస్తారు.

రాత్రి 1.30 ఏకాంత సేవ: మూలమూర్తి రెండు పాదాల వద్ద రెండు చందనపు ముద్దలు పెడతారు. భోగశ్రీనివాసమూర్తి హృదయం వద్ద సగం చందనం ముద్ద, మరొక పావు వంతు చందనం ముద్దను ధ్రువమూర్తి గుండెల మీద ఉండే అమ్మవారి వద్ద ఉంచుతారు. మరొక పావువంతు చందనపు ముద్దను అక్కడే ఉంచేస్తారు. స్వామివారిని పూజించవచ్చే బ్రహ్మదేవుని కోసమని వెండి గిన్నెలో నీటిని ఉంచుతారు. ముఖమంటపంలో వెండి గొలుసులతో వేళ్లాడదీసిన బంగారు ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని పవళింప చేస్తారు. దీనిని ‘పవళింపు సేవ’ అని కూడా అంటారు. స్వామివారికి పంచామృతాన్ని మేవ ప్రసాదం అని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన పంచకజ్జాయాన్ని ప్రసాదంగా అర్పిస్తారు. స్వామివారి శయనానందం కొరకు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఆలాపన చేస్తారు. ఈ సేవని ‘తాళ్ళపాక వారి లాలి’ అని కూడా అంటారు. ఈ ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలలు భోగశ్రీనివాసుడికి జరుగుతుంది. ఒక్క ధనుర్మాసంలో మాత్రం కృష్ణుడి విగ్రహానికి జరుగుతుంది.

గురువారం నేత్రదర్శనం
గోవిందుడు అనగానే నామాలు గుర్తుకు వస్తాయి. అయితే గతంలో వడగలై, తెంగలై అనే రెండు రకాల నామాల్లో ఏది స్వామికి అలంకరించాలనే విషయంలో న్యాయ పోరాటాలు జరిగాయి. బ్రిటీష్ కాలంలో అదీ వద్దు, ఇదీ వద్దు అని.. రెండు సరిపోయేలా ఇప్పుడున్న తిరునామాలు పెట్టాలని అప్పటి న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. అప్పటి నుంచి ముఖంలో నిండుగా తిరునామాలు తీర్చిదిద్దుతున్నారు. అందుకే స్వామివారి నేత్రాలను పూర్తిగా చూడలేము. అయితే గురువారం మాత్రం శ్రీవారి నేత్రాలను చూడవచ్చు. మామూలు రోజుల్లోలా పెద్ద తిరునామాలు కాకుండా సన్నటి తిరునామాలు ఆ రోజు అలంకరిస్తారు. మరుసటి రోజు అంటే శుక్రవారం మూలవర్లకు అభిషేకం ఉండడంతో గురువారం ఉదయం సుప్రభాతం తరువాత తలుపులు మూసి, స్వామివారి ఆభరణాలన్నీ తీసివేస్తారు. దీన్ని ‘సల్లింపు’ అంటారు. వారం మొత్తం వందల కిలోల ఆభరణాల బరువు మోస్తుండే ఏడుకొండల స్వామికి... ఆ రోజు ఆభరణాలు చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకంగా స్వామివారికి 24 మూరల పట్టంచు ధోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని కడతారు. శ్రీవారికి సువర్ణ పాదాలు, సువర్ణ హస్తాలు, శంఖుచక్రాలు, కర్ణాభరణాలు, సువర్ణ సాలగ్రామ హారాలు మాత్రం అలంకరిస్తారు. ఆ రోజు స్వామి నేత్ర దర్శనం తన్మయులను చేస్తుంది.
తిరుప్పావడ: నేత్ర దర్శనంలో గురువారం దర్శనమిచ్చే వేంకటేశ్వరస్వామికి ఆ రోజు మాత్రం పులిహోరతో ఆనందనిలయంతో పాటు, 8 బలిపీఠాలు లాంటివి ఏర్పాటు చేస్తారు. సుమారు 450 కిలోల పులిహోరతో అన్నకూటోత్సవాన్ని నిర్వహిస్తారు. దానిమీద శ్రీవారి దృష్టి ప్రసరించేలాగా పెడతారు. ఈ రాశిని 8 భాగాలు గా చేసి 8 దిక్కులలో పెడతారు. దీనికి తోడుగా లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబీ పెడతారు. దీనినే తిరుప్పావడ అని వ్యవహరిస్తారు.
అభిషేకం.. ఆత్మిక అనుభూతి
గంటపాటు జరిగే అభిషేకంలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతి. రోజూ భోగ శ్రీనివాస మూర్తికి అభిషేకం జరుగుతుంది. శుక్రవారం ఒక్కరోజు మాత్రం మూలవర్లకు అభిషేకం చేస్తారు. పచ్చకర్పూరం, చందనం, కస్తూరి, జవ్వాది వంటి సుగంధ ద్రవ్యాలను మంగళ వాద్యాలతో వెండి గిన్నెల్లో విమాన ప్రదక్షిణం తరువాత గర్భగుడిలోకి తీసుకువస్తారు. ముందు స్వామివారి పాదాల వద్ద కస్తూరితో కలిపిన పచ్చ కర్పూరపు ముద్దను పెట్టి అభిషేకం మొదలు పెడతారు. సూక్తాలను పఠిస్తుంటే... శుద్దోదక స్నానం, క్షీరాభిషేకం, చందనం కలిపిన పన్నీరుతో స్నానం జరుగు తాయి. స్వామివారి తెల్లనామాన్ని వెడల్పు చేస్తారు. శ్రీస్వామివారి నామాన్ని ‘తిరుమణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చ కర్పూరాన్ని, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.
స్వామి పూజకు ఆకాశగంగ
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి వివిధ సేవల్లో వినియోగించే నీటిని ఆకాశగంగ నుంచి మాత్రమే తీసుకువస్తారు. తిరుమల ఆలయం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆకాశగంగ నుంచి వైష్ణవులు పవిత్రంగా నీటిని అర్ధరాత్రి వెళ్లి తీసుకొస్తారు. ఈ నీటినే స్వామివారికి ఉదయం, సాయంత్రం నిర్వహించే 16 ఉపచారాల్లో వినియోగిస్తారు.
కుండపెంకులో నైవేద్యం
లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన శ్రీవేంకటేశ్వరుడు ఉదయం నైవేద్యంగా స్వీకరించేది ఏమిటో తెలుసా? మాత్ర అని పిలిచే పెరుగన్నం. అదీ ఏ బంగారు పళ్లెంలోనో కాదు.. కేవలం పగిలిన ఒక మట్టి కుండ పెంకులో. సహస్రనామార్చన తరువాత వైష్ణవులు గర్భగుడిలో ప్రబంధ పారాయణం చేస్తూ స్వామికి ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు. ఆ సమయంలో బంగారు వాకిలి తలుపులు మూసివేసి తిరుయామణి మండపంలో గంటలు మోగిస్తారు. దీనినే మొదటి గంట అంటారు. పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు వంటి పిండివంటలు నివేదన చేస్తారు. అయితే ఇవన్నీ కులశేఖర పడికి బయటే ఉంటాయి.
ప్రత్యేక సేవలు
గురు, శుక్రవారాలతో పాటు ఒక్కో రోజు ఒక్కో సేవ ప్రత్యేకంగా జరుగుతుంది. స్వామివారికి ప్రతి సోమవారం విశేష పూజ. మంగళవారం అష్టదళ పద్మారాధన పూజ. బుధవారం సహస్ర కలశాభిషేకం జరుగు తుంది. దాంతో పాటు ప్రతి నిత్యం అంగ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది.
- ఏఎస్ దినేష్