Gwalior Woman Thrashes Mother-In-Law: అత్తపై కోడలి పైశాచికత్వం.. వృద్ధురాలని కూడా చూడకుండా జుట్టుపై నేలపై ఈడుస్తూ..
ABN , Publish Date - Apr 05 , 2025 | 06:04 PM
వృద్ధురాలైన తన అత్తను ఓ మహిళ జుట్టుపట్టి నేలకు ఈడ్చి చేయి చేసుకున్న దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో మానవ సంబంధాలు పతనమవుతున్నాయి అని అనేందుకు సూచనగా మరో షాకింగ్ ఉదంతం మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన అత్తను వృద్ధురాలని కూడా చూడకుండా జుట్టుపట్టి నేలపై ఈడ్చి ఇష్టారీతిన చేయిచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగవైరల్ అవుతోంది. ఆమె వల్ల తనకు, తన తల్లి ప్రాణాలకు ముప్పు ఉందంటూ నిందితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. మీరట్ మర్చెంట్ నేవీ అధికారి ఉదంతంలోలా భార్య తనను హత్య చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.
బాధితుడు విశాల్ బాత్రా గ్వాలియర్‌లో కార్ల స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తంటాడు. అతడి తల్లి సరళ బాత్రా బాగోగులను కూడా అతడు చూసుకుంటాడు. అయితే, సరళను ఓల్డెజ్ హోంలో చేర్పించాలంటూ భార్య తనపై వేధింపులకు దిగుతోందని బాధితుడు విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 1 తన భార్య ఆమె తండ్రిని, ఇతర కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించి గొడవకు దిగిందని అన్నాడు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, బాధితుడి మామ ఇంట్లోకి వస్తూనే అతడి చెంప ఛెళ్లుమనిపించాడు. మామను ప్రతిఘటించబోతుంటే మరికొందరు లోపలికి చొరబడి విశాల్‌పై దాడికి దిగారు. కొడుకును కాపాడుకునేందుకు అతడి తల్లి వారిని అడ్డుకోబోయింది. ఈలోపు మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చిన కోడలు.. అత్తను జుట్టుపట్టి వెనక్కు లాగి కింద పడేసింది. ఆ తరువాత వృద్ధురాలిని వెనక్కు ఈడ్చుకెళ్లి ముష్టిఘాతాలు కురిపించింది. ఇదంతా చూసిన బాధితుడి తనయుడు వణికిపోయాడు. తనపై వీధిలో కూడా మామ, అతడి ఇతర కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారని విశాల్ బాత్రా, అతడి తల్లి ఆరోపించారు.
‘‘మీరట్ హత్య లాగా నన్ను, అమ్మను నా భార్య హత్య చేయొచ్చు’’ అని మీడియా వద్ద విశాల్ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు తొలుత నిరాకరించారని, ఆ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాత్రా తెలిపాడు. శుక్రవారం తాను ఎస్పీ ఆఫీసుకు వెళ్లానని, తనకు న్యాయం జరిగేలా చూస్తానని డీఎస్పీ భరోసా ఇచ్చారని కూడా బాధితుడు మీడియాతో వెల్లడించారు. ఈ ఘటనపై విశాల్ భార్య, మామా ఇంకా స్పందించలేదు.
మరోవైపు, ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వృద్ధురాలిపై ఆమె కోడలు దాడికి పాల్పడిన తీరు అనేక మందిని కలచి వేసింది. మానవ సంబంధాలు నానాటికీ పతనమవుతున్నాయంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
పొరుగింటి వారితో వివాదం.. 5 ఏళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్న తండ్రి
పోలీసు తుపాకీ మిస్‌ఫైర్.. మహిళకు గాయాలు