Share News

Selfie With Body: ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ దిగిన ప్రియుడు..

ABN , Publish Date - Sep 22 , 2025 | 08:02 AM

లవర్‌ను హత్య చేసిన తర్వాత స్నేహితుడు ఆశిష్ కుమార్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి సాయంతో శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కాడు. ఇద్దరూ బైకు మీద సూట్ కేసును కాన్పూర్‌కు దూరంగా తీసుకువచ్చారు.

Selfie With Body: ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ దిగిన ప్రియుడు..
Selfie With Body

అనుమానం పెనుభూతం అయింది. ప్రియురాలు వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న కోపంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. అనంతరం శవంతో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాన్పూర్‌కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్ ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వాడు. ఆకాంక్ష ఓ రెస్టారెంట్‌లో తన అక్కతో పాటు పని చేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూరజ్, ఆకాంక్షలకు పరిచయం ఏర్పడింది.


ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సూరజ్ తరచుగా ఆకాంక్ష పని చేసే రెస్టారెంట్ దగ్గరకు వెళ్లేవాడు. కొన్ని నెలల క్రితమే ఇద్దరూ బర్రా ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం మొదలెట్టారు. సహజీవనం మొదలెట్టిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. ఆకాంక్ష వేరే వ్యక్తితో తరచుగా ఫోన్‌లో మాట్లాడటం సూరజ్ గుర్తించాడు. ఆమెను నిలదీశాడు. జులై 21వ తేదీన ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా సూరజ్, ఆకాంక్ష తలను గోడకు కొట్టాడు. తర్వాత గొంతు పిసికి చంపేశాడు.


లవర్‌ను హత్య చేసిన తర్వాత స్నేహితుడు ఆశిష్ కుమార్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి సాయంతో శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కాడు. ఇద్దరూ బైకు మీద సూట్ కేసును కాన్పూర్‌కు దూరంగా తీసుకువచ్చారు. బంద దగ్గర యమునా నదిలో సూట్‌కేసును పడేశాడు. అయితే, సూట్ కేసును నదిలో పడేయడానికి ముందు సూరజ్ ప్రియురాలి శవంతో సెల్ఫీ తీసుకున్నాడు. 15 రోజులు గడిచాయి. కూతురు కనిపించకుండా పోవటంతో ఆకాంక్ష తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆగస్టు 8వ తేదీన సూరజ్‌పై కిడ్నాప్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సూరజ్‌తో పాటు ఆశిష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ..

అమెరికాలో ఏం జరుగుతోంది?.. ఒకే వేదికపై ట్రంప్, మస్క్..

Updated Date - Sep 22 , 2025 | 08:26 AM