Delhi Lady Don: ఢిల్లీలో లేడీ డాన్ కలకలం.. ఇళ్లను విడిచిపారిపోతున్న స్థానికులు
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:35 PM
డిల్లీలో 17 ఏళ్ల టీనేజర్ హత్య వెనక లేడీ డాన్ హస్తం ఉందన్న వార్త కలకలం రేపుతోంది. డాన్ ఆగడాలు తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు స్థానికులు వలసపోతున్నారు. అసలు ఈ డాన్ స్టోరీ ఏంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో ఓ 17 ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపుతోంది. హత్య వెనక లేడీ డాన్ హస్తం ఉన్నట్టు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. స్థానికంగా లేడీ డాన్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుండడంతో అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
ఎవరీ లేడీ డాన్..
ఈ యువ లేడీ డాన్ పేరు జిక్రా. ఢిల్లీలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య వద్ద జిక్రా బౌన్సర్‌గా పని చేసేది. అలా నేర ప్రపంచంతో పరిచయం ఏర్పడిన ఆమె ఆ తరువాత తనదైన శైలిలో రెచ్చిపోవడం ప్రారంభించింది. ఆమె అనేక మందిపై బెదింపులకు దిగుతుంటుందని స్థానికులు చెబుతున్నారు. తుపాకులు, ఇతర మారణాయుధాలు చేతబూని వీడియోలు చేయడం ఆమెకు హాబీ. విచారణ ఎదుర్కొంటున్న సమయాల్లో కూడా జిక్రా వీడియోలో పోస్టు చేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. జిక్రా కింద సుమారు 10 నుంచి 15 మంది యువకులు పని చేస్తుంటారు. చెప్పినట్టల్లా ఆడుతుంటారు.
ఇక తాజా ఘటనలో ఆమె ప్రతీకారేచ్ఛతో 17 ఏళ్ల బాలుడి కునాల్‌ని హత్య చేయించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు కునాల్‌కు చెందిన వర్గం జిక్రా సోదరుడి సాహిల్‌పై దాడికి దిగిందట. ఇందుకు ప్రతీకారంగానే కునాల్ హత్య జరిగి ఉండొచ్చనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జిక్రాను కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, ఇప్పటివరకూ అధికారికంగా ఆమెను అరెస్టు చేయలేదు. నేర జరిగిన ప్రదేశంలో ఆమె ఉందా లేదా అని నిర్దారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
జిక్రా ఎప్పుడు చేతుల్లో ఆయుధాలతో కనిపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు అందరూ ఆమెను చూసి భయపడుతూ బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. సీలామ్‌పూర్, జాఫ్రాబాద్, బ్రహ్మపురి, గౌతమ్‌పురి, చౌహాన్ బాంగెర్‌కు చెందిన అనేక మంది ఆయా ప్రాంతాలను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారట. కాగా, ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా స్పందించారు. నిందితుల జాడ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎఫ్ఐఆర్ దాఖలైందని, బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు