Share News

Noida Fake Police Station: ఫేక్ పోలీస్ స్టేషన్ పెట్టుకుని జనాల నుంచి వసూళ్లు.. అసలు పోలీసుల ఎంట్రీతో..

ABN , Publish Date - Aug 10 , 2025 | 06:47 PM

నకిలీ పోలీస్ స్టేషన్ పెట్టుకుని ప్రజల నుంచి డొనేషన్ల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు నిందితులను నోయిడా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బయటపడ్డ నకిలీ ఎంబసీ వ్యవహారం రీతిలో నిందితుల మోసం సాగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

Noida Fake Police Station: ఫేక్ పోలీస్ స్టేషన్ పెట్టుకుని జనాల నుంచి వసూళ్లు.. అసలు పోలీసుల ఎంట్రీతో..

ఇంటర్నెట్ డెస్క్: నోయిడాలో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నిందితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ప్రభుత్వ అధికారుల్లా నటిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఓ ఫేక్ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి డొనేషన్ల పేరిట డబ్బు దండుకునేవారు. ప్రజలను నమ్మించేందుకు రకరకాల నకిలీ జాతీయ, అంతర్జాతీయ సర్టిఫికేట్‌లను వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు.

నిందితుల అరెస్టు సమయంలో పలు నకిలీ ఐడీలు, అధికారిక డాక్యుమెంట్స్‌ను పోలి ఉన్న కొన్ని పత్రాలు, పాస్‌‌బుక్స్, చెక్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఘాజియాబాద్‌లో బయటపడ్డ ఫేక్ ఎంబసీ ఉదంతంలో వలెనే నిందితులు వ్యవహరించారని పోలీసులు అన్నారు. అధికారిక చిహ్నాలను కూడా దుర్వినియోగపరిచారని తెలిపారు.


నిందితులు తమని తాము అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ అధికారులుగా చెప్పుకునే వారని డీసీపీ తెలిపారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, విచారణల పేరిట అమాయకులను బురిడీ కొట్టించేవారని అన్నారు. నకలీ స్టాంపులు, లెటర్ హెడ్స్, ప్రభుత్వ ఆఫీసుల ఫేక్ చిహ్నాలు అనేకం వారి వద్ద లభించాయని అన్నారు. నిందితులను విభాష్, ఆరాగ్య, బాబుల్, పింటూపాల్, సంపద్‌లాల్, ఆశిష్‌గా గుర్తించామని అన్నారు. నిందితులందరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

ఇటీవలే ఘాజియాబాద్ జిల్లా కవి నగర్‌లో నకిలీ ఎంబసీ వ్యవహారాన్ని కూడా స్థానిక పోలీసులు గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఫేక్ ఎంబసీ నిర్వహిస్తున్నందుకు హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పలు నకిలీ డాక్యుమెంట్స్, ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హవాలా రాకెట్‌లో కూడా నిందితుడు భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వెస్టార్టికా దేశ రాయబారిగా నటిస్తూ నిందితుడు మోసాలకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన 80 ఏళ్ల వృద్ధుడికి భారీ షాక్.. దాదాపు రూ.9 కోట్ల నష్టం

25 వీధి కుక్కలను రైఫిల్‌తో కాల్చి చంపిన నరరూప రాక్షసుడు.. రాజస్థాన్‌లో దారుణం

Read Latest and Crime News

Updated Date - Aug 10 , 2025 | 06:57 PM