Man Assasinates Children: రాక్షసుడిలా మారిన తండ్రి.. ముగ్గురు బిడ్డల్ని అత్యంత క్రూరంగా..
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:27 AM
ఇంటికి తిరిగి వచ్చిన జయమ్మ, భీమవ్వ రక్తం మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు చనిపోవటంతో వారి గుండెలు బద్దలయ్యాయి. గుండెలు అవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు.
భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య మీద కోపాన్ని కన్న బిడ్డల మీద చూపించాడు. తన ముగ్గురు బిడ్డలపై హత్యాయత్నం చేశాడు. దీంతో ఇద్దరు బిడ్డలు చనిపోయారు. మూడవ బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. యాదగిరి తాలూకా దుగనూర్ క్యాంప్‌కు చెందిన శరణప్ప, జయమ్మ భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన కొన్నేళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.
ఈ జంటకు ముగ్గురు పిల్లలు.. 8 సంవత్సరాల హేమంత్, 5 సంవత్సరాల శాన్వి, 3 సంవత్సరాల భార్గవ్ ఉన్నారు. గత రెండేళ్ల నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యపై శరణప్పకు అనుమానం మొదలైంది. ఆమెతో ఎవ్వరు మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. ముగ్గురు పిల్లలు తనకు పుట్టలేదని అనుమానపడేవాడు. ప్రతీరోజూ వేధించేవాడు. దీంతో భయపడిపోయిన జయమ్మ రెండేళ్ల క్రితం పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అయితే, 15 రోజుల క్రితమే రెండు కుటుంబాల మధ్య పంచాయతీ జరిగింది. భర్తతో కలిసి ఉండటానికి జయమ్మ ఒప్పుకుంది.
పిల్లల్ని తీసుకుని అత్తింటికి వచ్చేసింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, శరణప్ప రాక్షసుడిలా మారిపోయాడు. గురువారం ఉదయం భార్య జయమ్మ, తల్లి భీమవ్వ ఇంటినుంచి బయటకు వెళ్లారు. వారు బయటకు వెళ్లగానే శరణప్ప తన ముగ్గురు పిల్లలపై కర్రతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో శాన్వి, భార్గవ్ అక్కడికక్కడే చనిపోయారు. హేమంత్ పరిస్థితి విషమంగా మారింది. పిల్లలపై దాడి చేసిన తర్వాత శరణప్ప పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన జయమ్మ, భీమవ్వ రక్తం మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు.
ఇద్దరు పిల్లలు చనిపోవటంతో వారి గుండెలు బద్దలయ్యాయి. గట్టిగా అరుస్తూ స్థానికులను పిలిచారు. వారు అక్కడికి చేరుకుని గాయపడ్డ హేమంత్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక, ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఎమ్‌జీబీఎస్‌లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజల్ని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ..