Share News

Punjab: నీలి డ్రమ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం.. పంజాబ్‌లో కలకలం

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:33 AM

పంజాబ్‌లోని లుథియానాలో ఓ నీలి డ్రమ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలానికి దారి తీసింది. మీరట్ హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Punjab: నీలి డ్రమ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం.. పంజాబ్‌లో కలకలం
Ludhiana blue drum murder

ఇంటర్నెట్ డెస్క్: మీరట్‌లో ఓ మహిళ తన భర్తను డ్రమ్‌లో పెట్టి సమాధి చేసిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే మరో షాకింగ్ ఘటన పంజాబ్‌లో వెలుగు చూసింది. గుర్తు తెలియని పురుషుడి మృతదేహం ఉన్న డ్రమ్ లుథియానాలో వెలుగు చూడటం స్థానికంగా కలకలానికి దారితీసింది. చేతులు, కాళ్లు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం డ్రమ్‌లో లభించింది. మృతదేహానికి ప్లాస్టిక్ కవర్లు కూడా చుట్టి ఉన్నాయి. దుర్వాసన ఎక్కువవడంతో స్థానికులు వెతకగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

అది వలస కార్మికుడి మృతదేహంలా కనిపిస్తోందని స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. ‘ముఖ కవళికలను బట్టి అతడు వలస వచ్చిన కార్మికుడు అయ్యుండొచ్చని భావిస్తున్నాము. శరీరం మీద ఎటువంటి గాయాలు కనిపించలేదు. పోస్ట్‌మార్టం తరువాత అసలేం జరిగిందనేదానిపై స్పష్టత వస్తుంది’ అని తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రికి తరలించారు.


ఇక కేసుపై విచారణను ప్రారంభించిన పోలీసులు లుథియానాలోని 43 మంది డ్రమ్‌ల తయారీదారుల వివరాలు సేకరించారు. మృతదేహం లభించిన డ్రమ్ కొత్తదిగా కనిపిస్తుండటంతో అది ఎక్కడ కొన్నదీ తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్యకు ముందు డ్రమ్‌ను కొని ఉండొచ్చని అంటున్నారు. డ్రమ్ లభించిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని వివిధ కూడళ్లు, రైల్వేస్టేషన్, బస్ట్‌స్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలం పరిసరాల్లో అనేక మంది వలస కార్మికులు నివసిస్తుంటారని, వారందరినీ ప్రశ్నిస్తున్నామని చెప్పారు. దీంతో, ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇంటిముందే వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌట్.. చివరకు బయటపడ్డ ఘోరం

శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

Read Latest and Crime News

Updated Date - Jun 27 , 2025 | 02:32 PM