Share News

Brother Shoots Elder Sister: చెల్లెల్ని హత్య చేసిన అన్న.. తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసి..

ABN , Publish Date - Sep 05 , 2025 | 10:37 AM

హత్య జరిగిన రోజునే అభినవ్ పోలీసులను ఆశ్రయించాడు. అశుతోష్‌పై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Brother Shoots Elder Sister: చెల్లెల్ని హత్య చేసిన అన్న.. తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసి..
Brother Shoots Elder Sister

చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవటం నచ్చని అన్న దారుణానికి ఒడిగట్టాడు. తోడబుట్టిందన్న కనికరం కొంచెం కూడా లేకుండా తుపాకితో కాల్చి చంపాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఓ చిన్న తప్పు అతడ్ని పట్టించేసింది. జైలు పాలు అయ్యేలా చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్ధోయ్‌కి చెందిన 24 ఏళ్ల మాన్వి అనే యువతి పందేయ్‌పుర్ గ్రామానికి చెందిన అభినవ్ కతియార్‌ను ప్రేమించింది.


వీరి పెళ్లికి మాన్వి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి పారిపోయింది. ప్రేమికులు ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరూ జనవరి 7వ తేదీన ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అలియాపూర్ గ్రామంలో కాపురం పెట్టారు. అభినవ్ బరేలీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయమే అతడు కాలేజీకి వెళ్లిపోయాడు. మాన్వి పీసీఎస్‌కు ప్రిపేర్ అవ్వటం కోసం ఇంట్లోనే ఉండిపోయింది. భర్త ఇంటికి వచ్చే సమయానికి మాన్వి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె తలకు గాయం అయింది. కుడి చేతిలో నాటు తుపాకి ఉంది.


అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాన్వి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మాన్వి తల్లి ఆరోపణలు చేసింది. అయితే, అభినవ్ మాత్రం మాన్విని పుట్టింటి వాళ్లే చంపేశారని, అది కచ్చితంగా పరువు హత్యలేనని అన్నాడు. పోలీసులు అభినవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకుని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించారు. అతడిని అనుమానించదగ్గ విషయాలు కనిపించలేదు.


ఇక, పోస్టుమార్టం రిపోర్టు రాగానే కథను మలుపు తిప్పే విషయం బయటపడింది. మాన్వి కుడి చేతి వాటం ఉన్న అమ్మాయి. ఆమె తలకు ఎడమ వైపు బుల్లెట్‌ గాయం అయింది. కుడి చేతి వాటం ఉన్న వాళ్లు.. ఎడమ చేత్తో కాల్చుకుని చనిపోవటం అసాధ్యం. ఎంతో శిక్షణ ఉంటే తప్ప అది సాధ్యపడదు. ఇదే పాయింట్ పోలీసులకు అనుమానం తెప్పించింది. మాన్వి అన్న అశుతోష్ మిశ్రాను అదుపులోకి తీసుకుని విచారించగా మర్డర్ మిస్టరీ వీడింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అశుతోష్ మిశ్రా మాన్విపై కక్ష పెంచుకున్నాడు.


బుధవారం మాన్వి ఇంటికి వెళ్లాడు. చెల్లితో గొడవపెట్టుకున్నాడు. గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకితో ఆమె తలపై కాల్చి చంపేశాడు. బుల్లెట్ తలకు ఎడమ వైపు బలంగా తాకటంతో మాన్వి అక్కడికక్కడే చనిపోయింది. మర్డర్ కేసు తనపైకి రాకుండా ఉండటానికి అశుతోష్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమె కుడి చేతిలో గన్ను పెట్టాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చిన్న పొరపాటు అతడ్ని పట్టించేసింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.


ఇవి కూడా చదవండి

బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

వరుస కేసుల్లో రిలయన్స్ అధినేత.. సీబీఐ కేసు..

Updated Date - Sep 05 , 2025 | 11:59 AM