Assam: దారుణం! దంపతులు క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం రావడంతో..
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:15 PM
అస్సాంలో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో కొందరు గ్రామస్థులు ఓ జంట ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకుని ఆ జంట సజీవదహనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం తలెత్తడంతో ఓ జంట దారుణ హత్యకు గురయ్యారు. ఆంగ్‌లాంగ్ జిల్లాలోని నెం.1 బెలొగురీ గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది (Assam Witchcraft Incident).
మృతులను గార్డీ బిరోవా (43), మీరా(33) బిరోవాగా పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల్లో కొందరు తొలుత వారి ఇంట్లోకి ప్రవేశించి పదునైన వస్తువులతో దాడి చేశారు. ఆ తరువాత ఇంటితో పరిసరాలకు నిప్పు పట్టాడు. దీంతో, అగ్నికీలలకు చిక్కుకున్న దంపతులు సజీవదహనమయ్యారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన ప్రాంతంలో మూఢనమ్మకాల ప్రాబల్యం ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. ‘ఇక్కడి వారు ఇప్పటికీ క్షుద్రపూజలు, శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు. దీంతో, కొందరు దారుణాలు జరుగుతున్నాయి’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఉదంతంతో అస్సాంలో మరోసారి క్షుద్రపూజల కలకలం రేగింది. జనాలపై మంత్రగత్తెలు, మంత్రగాళ్ల అంటూ ముద్రవేసి చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు అస్సాం ప్రభుత్వం 2015లోనే విచ్ హంటింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, అమాయకులపై ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారికి కఠిన శిక్షలు, జరిమానాలను విధిస్తున్నారు. మూఢనమ్మకాలు, అనుమానాలతో ఇలా జరిగిన దాడుల కారణంగా గత పదేళ్లల్లో సుమారు 100 మంది బలయ్యారు.
ఇవీ చదవండి:
వెబ్‌సైట్ ఒరిజినలా? లేక ఫేకా? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే..
పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..