Zoho PoS Devices: డిజిటల్ చెల్లింపుల రంగంపై దృష్టి.. పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేసిన జోహో
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:09 PM
మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సవాలు విసురుతున్న జోహో సంస్థ.. ఫిన్ టెక్ రంగంపై కూడా తన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేసింది. త్వరలో వీటిని అరట్టై యాప్‌తో కూడా లింక్ చేస్తామని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ చెల్లింపుల రంగంలో పాతుకుపోయిన ఫోన్ పే, జీపే, పేటీఎమ్‌కు సవాలు విసిరేందుకు అరట్టై రూపకర్త, జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు సిద్ధమయ్యారు. ఆయన సారథ్యంలోని జోహో తాజాగా పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటి సాయంతో వ్యాపారులు కస్టమర్ల నుంచి నేరుగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు. తన సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌తో ఈ డివైజెస్‌ను ఏకం చేయాలనే వ్యూహంతో సంస్థ ముందుకెళుతోంది. దేశీ యాప్ అరట్టైతో జోహో పే చెల్లింపుల వ్యవస్థను త్వరలో అనుసంధానం చేస్తామని శ్రీధర్ వెంబు తెలిపారు (Zoho PoS Devices).
పేమెంట్ ఎగ్రిగేటర్ సేవలు అందించేందుకు గతేడాది జోహోకు ఆర్బీఐ అనుమతులు లభించాయి. ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి పలు సాఫ్ట్‌వేర్‌లతో కూడిన ప్రత్యేక సూట్‌ను జోహో ఇప్పటికే లాంచ్ చేసింది. ఇక తాజా పీఓఎస్ డివైజులతో వ్యాపారులు కస్టమర్ల నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, మొబైల్ వాలెట్ల ద్వారా డబ్బులు స్వీకరించగలుగుతారు (Zoho Digital Payment Solutions Suite).
గ్లోబల్ ఫిన్ టెక్ రంగం, డిజిటల్ చెల్లింపుల సాధనాలపై తాము దృష్టిపెట్టినట్టు శ్రీధర్ వెంబు తెలిపారు. ఈ దిశగా ఎన్‌పీసీఐకి చెందిన ఎన్‌బీబీఎల్‌తో తాము భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భారత చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు, వ్యాపార వర్గాలకు చెల్లింపుల విధానాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఇదిలా ఉంటే, జోహోకు చెందిన అరట్టై యాప్‌కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. రోజువారి కొత్త సైనప్‌ల సంఖ్యలో ఇటీవల దాదాపు 100 రెట్ల వృద్ధి కనిపించింది. ఈ డిమాండ్‌ను తట్టుకునే విధంగా జోహో సంస్థ తక్షణ ప్రాతిపదికన మౌలిక వసతులను సమకూర్చుకుంటోంది.
ఇవీ చదవండి:
రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి..!
ఈపీఎఫ్ఓ నుంచి శుభవార్త.. పెన్షన్ పెంపు, కొత్త సంస్కరణల అమలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి