Share News

Net Profit Rises: విప్రో లాభం రూ.3,336 కోట్లు

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:11 AM

దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) విప్రో ఏకీకృత నికర లాభం...

Net Profit Rises: విప్రో లాభం రూ.3,336 కోట్లు

రూ.22,135 కోట్లకు పెరిగిన ఆదాయం

ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 9.8 శాతం వృద్ధితో రూ.3,336.5 కోట్లకు పెరిగింది. కొత్త కాంట్రాక్టులు భారీగా దక్కడం ఇందుకు దోహదపడింది. క్యూ1లో సంస్థ ఆదాయం కూడా వార్షిక ప్రాతిపదికన స్వల్ప పెరుగుదలతో రూ.22,134.6 కోట్లకు చేరుకుంది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే మాత్రం విప్రో లాభం 7 శాతం, ఆదాయం 1.6 శాతం తగ్గాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్లను ఈ నెల 28న రికార్డు చేయనున్న కంపెనీ.. ఆగస్టు 15న డివిడెండ్‌ చెల్లింపులు చేపట్టనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలు..

  • క్యూ1లో కంపెనీ ఐటీ సేవల విభాగ ఆదాయం అమెరికన్‌ కరెన్సీలో 258.74 కోట్ల డాలర్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఈ రెవెన్యూ 0.3 శాతం తగ్గగా.. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 1.5 శాతం క్షీణించింది. కాగా, ఈ సెప్టెంబరుతో ముగియనున్న రెండో త్రైమాసికం (క్యూ2)లో ఐటీ సేవల విభాగ ఆదాయం 256.0-261.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది. అంటే, క్యూ1తో పోలిస్తే ఈ విభాగ ఆదాయ వృద్ధి మైనస్‌ 1 నుంచి ప్లస్‌ ఒక శాతం శ్రేణిలో ఉండవచ్చని సంస్థ భావిస్తోంది.

  • గడిచిన మూడు నెలల్లో విప్రో మొత్తం 497.1 కోట్ల డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. అందులో 267 కోట్ల డాలర్ల విలువైన భారీ డీల్స్‌ కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

  • మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ చివరి నాటికి విప్రో ఉద్యోగుల సంఖ్య 114 మేర తగ్గి 2,33,232గా నమోదైంది. గడిచిన మూడు త్రైమాసికాలుగా కంపెనీ ఉద్యోగుల వలసల రేటు 15 శాతం స్థాయిలో నమోదవుతూ వస్తోంది.

  • గురువారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 0.93 శాతం తగ్గి రూ.260.25 వద్ద ముగిసింది.


10,000 మంది ఫ్రెషర్ల హైరింగ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ హైరింగ్‌) ద్వారా 10,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవాలనుకుంటున్నట్లు విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. వాస్తవిక నియామకాలు మాత్రం భవిష్యత్‌ డిమాండ్‌పై ఆధారపడి ఉంటాయని మాత్రం గోవిల్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 06:12 AM