UPI-Money Request: యూపీఐ యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ తెరమరుగు
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:50 PM
వ్యక్తుల మధ్య నేరుగా నగదు బదిలీకి ఉద్దేశించిన మనీ రిక్వెస్ట్ యూపీఐ ఫీచర్ త్వరలో కనుమరుగు కానుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ద్వారా లావాదేవీలకు అనుమతించొద్దంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ యాప్స్‌లో కనిపించే ’మనీ రిక్వెస్ట్’ ఆప్షన్ త్వరలో కనుమరుగుకానుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ యూపీఐలో అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి లావాదేవీలను ప్రోసెస్ చేయొద్దని ఆర్బీఐ బ్యాంకులను ఇప్పటికే ఆదేశించింది. ఈ ఫీచర్ కారణంగా పలువురు సైబర్ మోసాల బారిన పడ్డ ఘటనలు వెలుగు చూడటంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏమిటీ ఫీచర్..
వాస్తవానికి సదుద్దేశంతోనే ఈ ఫీచర్‌ను ప్రారంభించారు. ఫ్రెండ్స్, లేదా సహోద్యోగులను డబ్బులు అడగాల్సిన సందర్భాల్లో మర్యాదగా ఓ చిన్న రిక్వెస్ట్‌ను ఈ ఫీచర్ ద్వారా పంపించొచ్చు. నేరుగా డబ్బులు ఇవ్వాలని అడగడం మొహమాటం అనుకుంటే ఈ ఫిచర్‌తో అవతలి వారికి సున్నితంగా డబ్బుల విషయాన్ని గుర్తు చేయొచ్చు.
యూపీఐ సేవలు మరింతగా విస్తృతమయ్యేందుకు ఉద్దేశించిన ఈ ఫీచర్‌ను మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు దండుకోవడం ప్రారంభించారు. అమాయకులను టార్గెట్ చేస్తూ మనీ రిక్వెస్టులను పంపించేవారు. ఈ ఫీచర్‌పై అంతగా అవగాహన లేని వారందరూ తెలియక స్క్రీన్‌పై స్వైప్ చేసే సరికి డబ్బులు బదిలీ అయిపోయేవి. మోసం జరిగినట్టు తెలిశాక లబోదిబోమనడం మినహా మరో మార్గం ఉండేది కాదు.
ఈ నేపథ్యంలో యూపీఐకి మనీ రిక్వెస్ట్ ఫీచర్ భద్రతాపరంగా ఓ బలహీనమైన ఆప్షన్‌గా మారింది. దీన్ని సరిదిద్దకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో రంగంలోకి దిగిన ఆర్బీఐ ఈ ఫీచర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్స్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యక్తుల మధ్య నేరుగా బదిలీలకు (పీ2పీ) ఉద్దేశించిన మనీ రిక్వెస్ట్ ద్వారా ఎటువంటి లావాదేవీలను అక్టోబర్ 1 నుంచి అనుమతించొద్దని పేర్కొంది.
యూజర్లపై ప్రభావం ఎంత..
ఈ ఫీచర్ తెరమరుగైనా యూజర్లపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇకపై డబ్బు ట్రాన్స్‌ఫర్స్ అన్నీ యూపీఐ ఐడీ లేదా ఫోన్ నెంబర్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. అంటే.. యూపీఐలోని ఇతర ఫీచర్‌లు అన్నీ యథాతథంగా కొనసాగుతాయి. క్యూఆర్ కోడ్స్, డెలివరీ యాప్స్, యూపీఐ ఐడీ ద్వారా ఎప్పటిలాగే చెల్లింపులు చేసుకోవచ్చు.
ఇవీ చదవండి:
పండగ సీజన్‌లో స్విగ్గీ కీలక నిర్ణయం.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం