Swiggy Platform Fee: పండగ సీజన్‌లో స్విగ్గీ కీలక నిర్ణయం.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:53 PM
ఈ పండగ సీజన్‌లో నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14కి పెంచినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: నష్టాలు తగ్గించుకుని లాభాల బాట పట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న ఆన్‌లైన్ డెలివరీ వేదిక స్విగ్గీ ఈ పండుగ సీజన్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్లాట్‌ఫీజును ప్రస్తుతమున్న రూ.12 నుంచి రూ.14కు పెంచేందుకు నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
2023 ఏప్రిల్‌లో స్విగ్గీ తొలిసారిగా యూజర్ల నుంచి ఫ్లాట్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఈ ఫీజు వడ్డన తరువాత కూడా ఆర్డర్‌లలో తగ్గుదల కనిపించకపోవడంతో ఫీజును యథాతథంగా కొనసాగించింది. తాజా పండగ సీజన్‌లో మరోసారి ఫీజను రెండు రూపాయల మేర పెంచినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంపై సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
స్విగ్గీ రోజుకు 2 మిలియన్ ఆర్డర్లను కస్టమర్లకు చేరవేస్తుంటుంది. తాజా పెంపు కారణంగా సంస్థకు రోజుకు రూ.2.8 కోట్ల చొప్పున అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏటా ఈ మొత్తం రూ.33.6 కోట్ల వరకూ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పండగ సీజన్ ముగిశాక ఫీజులను మళ్లీ తగ్గించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
గతంలో పండగ సీజన్‌లో స్విగ్గీతో పాటు జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపుతో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాయి. పెంపు తరువాత కూడా ఆర్డర్‌ల తగ్గుదల లేకపోవడంతో కొత్త రేట్లను కొనసాగించాయి. 2023లో ఫ్లాట్‌ఫీజులు రూ.2గా ఉండేది. గతేడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఫీజును రూ.10కి పెంచాయి.
క్విక్ కామర్స్ విభాగంలో పెట్టుబడులను పెంచడంతో స్విగ్గీకి నష్టాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా ప్లాట్‌ఫామ్ ఫీజును మరోసారి పెంచేందుకు నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్విగ్గీ రూ.1197 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలు రూ.611 కోట్ల మేర పెరిగాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం స్విగ్గీ రాబడిలో కూడా అభివృద్ధి కనిపించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 54 శాతం మేర పెరిగి రూ.4961 కోట్లకు చేరుకుంది. మరోవైపు, స్విగ్గీకి పోటీదారుగా ఉన్న జొమాటో.. ఈ ఏడాది తొలి త్రైమాసికం లాభాల్లో 90 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఆదాయం మాత్రం 70.4 శాతం మేర పెరిగి 7167 కోట్లకు చేరుకుంది.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం