UIDAI-Cooperative Banks: కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:14 PM
బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా విస్తరించేలా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ సేవలను రాష్ట్రకోఆపరేటివ్ బ్యాంకులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. దీంతో, బయోమెట్రిక్ ఐడీల ఆధారంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం కోఆపరేటివ్ బ్యాంకులకు మరింత సులభతరం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ ప్రాంతల వారికి బ్యాకింగ్ సేవలు మరింత చేరువ చేసేందుకు యూనీక్ అథారిటీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఐడీ ధ్రువీకరణకు వినియోగించే ఆధార్ ఆథెంటికేషన్ సేవలను పూర్తిస్థాయిలో రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులకూ అనుమతించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సహకార మంత్రిత్వ శాఖ, నాబార్డ్, ఎన్‌పీసీఐ, కోఆపరేటివ్ బ్యాంక్స్‌తో చర్చల అనంతరం ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, దేశంలోని 34 రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులు, 352 జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు పూర్తిస్థాయిలో ఆధార్ ఆథెంటికేషన్ సేవల పరిధిలోకి వచ్చినట్టైంది.
కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర స్థాయి కోఆపరేటివ్ బ్యాంకులను ఆథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలుగా, ఈకేవైసీ యూజర్ ఏజెన్సీలుగా యూఐడీఏఐ వద్ద రిజిస్టర్ చేస్తారు. ఇక జిల్లా స్థాయి కోఆపరేటివ్ బ్యాంకులు తమ రాష్ట్రస్థాయి సహకార బ్యాంకుల ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ సేవలను పొందొచ్చు. ఫలితంగా, జిల్లా సహకార బ్యాంకులు ప్రత్యేకంగా ఐటీ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో, నిర్వహణ ఖర్చులు తగ్గి, కార్యకలాపాలు మరింత సరళతరం అవుతాయి.
తాజా విధానంలో కోఆపరేటివ్ బ్యాంకులు ఆధార్ ఆథెంటికేషన్ సేవల సాయంతో మరింత సులువుగా కొత్త కస్టమర్లను చేర్చుకోగలుగుతాయి. బయోమెట్రిక్ ఈకేవైసీ, ఫేస్ రికగ్నిషన్ వంటివి అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతాలు తెరవడం గ్రామీణులకు మరింత సులభం అవుతుంది. సబ్సిడీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ చేరుతాయి. ఆధార్ సాయంతో ఈ చెల్లింపులు నేరుగా వారి కోఆపరేటివ్ బ్యాంకు అకౌంట్‌లలోకి బదిలీ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త విధానం వల్ల కోఆపరేటివ్ బ్యాంకులు తమ ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలను మరింతగా విస్తరించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..