TVS: టీవీఎస్ ఎన్టార్క్ 150.. నయా టెక్నాలజీతో సూపర్ స్కూటర్!
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:13 PM
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో టీవీఎస్ మోటార్ తమ కొత్త హైపర్ స్పోర్ట్ స్కూటర్ 'ఎన్టార్క్ 150'ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. స్టైలిష్, ప్రీమియం లుక్‌తో వచ్చిన ఈ స్కూటర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.
హైదరాబాద్: యువతను ఆకట్టుకునే లక్ష్యంతో టీవీఎస్ మోటార్ తమ కొత్త హైపర్ స్పోర్ట్ స్కూటర్ 'ఎన్టార్క్ 150'ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. స్టైలిష్, ప్రీమియం లుక్‌తో వచ్చిన ఈ స్కూటర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం, దీని బేస్ వేరియంట్ ధర రూ. 1,19,000, టీఎఫ్‌టీ వేరియంట్ ధర రూ. 1,29,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అయితే, జీఎస్‌టీ శ్లాబుల్లో ఇటీవలి మార్పుల కారణంగా ఈ ధరలు సెప్టెంబర్ 22 తర్వాత అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా, కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధా హల్దార్ మాట్లాడుతూ.. జెన్-జీ యువత (2000 తర్వాత పుట్టినవారు) లక్ష్యంగా ఈ స్కూటర్ డిజైన్ చేశామని, ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉన్నాయని తెలిపారు. దీని టీఎఫ్‌టీ వేరియంట్లో అలెక్సా, స్మార్ట్ వాచ్ అడాప్టబిలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అలాగే కాల్/SMS అలర్ట్‌ల వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
ఫీచర్లు, భద్రతా చర్యలు
ఈ స్కూటర్‌లో రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పరిస్థితులకు అనుగుణంగా వాడుకునేందుకు రైస్ మోడ్ మరియు స్ట్రీట్ మోడ్ అనే రెండు రకాల డ్యూయల్ రైడ్ మోడ్‌లు ఉన్నాయి. భద్రత కోసం, క్రాష్ అలర్ట్, థెఫ్ట్ హెచ్చరిక, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, మరియు సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్, పర్ఫార్మెన్స్
ఎన్టార్క్ 150 స్కూటర్‌లో 149.7సీసీ ఇంజిన్ అమర్చారు, ఇది 7,000 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు, గంటకు 104 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్‌కు, ఆకర్షణీయమైన డిజైన్‌కు మంచి పేరు తెచ్చుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.