Share News

Indian Exports Decline: ట్రంప్‌ సుంకాలతో ఆగమాగం

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా సుంకాల పోటుతో దేశీయ పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. ఈ దెబ్బతో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్య లు, దుస్తులు, ఆర్గానిక్‌ కెమికల్స్‌, మెషినరీ, మెకానికల్‌ అప్లయెన్సెస్‌, రత్నాభరణాల ఎగుమతులు 50 నుంచి 70 శాతం...

Indian Exports Decline: ట్రంప్‌ సుంకాలతో ఆగమాగం

50-70 శాతం ఎగుమతులకు దెబ్బ: జీటీఆర్‌ఐ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా సుంకాల పోటుతో దేశీయ పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. ఈ దెబ్బతో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్య లు, దుస్తులు, ఆర్గానిక్‌ కెమికల్స్‌, మెషినరీ, మెకానికల్‌ అప్లయెన్సెస్‌, రత్నాభరణాల ఎగుమతులు 50 నుంచి 70 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అనే మేధో సంస్థ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. చైనా, వియత్నాం, బ్రెజిల్‌ దేశాలతో పోల్చితే భారత్‌ మాత్రమే అధికంగా నష్టపోనుందని పేర్కొంది. రొయ్యలు, ఆర్గానిక్‌ కెమికల్స్‌, కార్పెట్స్‌, అల్లిన వస్త్రాలు (నిట్టెడ్‌ అండ్‌ వోవెన్‌ అపారెల్స్‌), వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఫర్నీచర్‌ వంటి ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 50-70 శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ తెలిపారు. కాగా స్టీల్‌, అల్యూమినియం, కాపర్‌, ఆటో విడి భాగాల ఎగుమతులు 30 నుంచి 50 శాతం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఫార్మా, స్మార్ట్‌ఫోన్స్‌, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాల ప్రభావం చాలా తక్కువ ఉండనుందని శ్రీవాత్సవ పేర్కొన్నారు.


వస్త్ర పరిశ్రమకు చావు దెబ్బే

వస్త్ర పరిశ్రమ మాత్రం ట్రంప్‌ తాజా సుంకాలను జీర్ణించుకోలేక పోతోంది. మన వస్త్ర ఎగుమతులపై ట్రంప్‌ సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచేశారు. ఇది ఎగుమతులపై ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడిన ఎంఎ్‌సఎంఈ సంస్థలకు చావు దెబ్బ అని ఈ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఏపీఈసీ చైర్మన్‌ సుధీర్‌ సెఖ్రీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆర్థికంగా పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. మన దుస్తుల ఎగుమతిలో అమెరికాకు 33 శాతం వాటా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రత్నాభరణాలకూ ముప్పే

ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలపై దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కూడా తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు విధానపరమైన సంస్కరణల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. ఇదే సమయంలో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణపైనా దృష్టి పెట్టాలని కోరింది. మన రత్నాభరణాలు, వజ్రాలు, వజ్రాభరణాల ఎగుమతులపై ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు కొనసాగితే అమెరికా మార్కెట్‌ మనకు శాశ్వతంగా మూసుకుపోయినట్టేనని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి.

కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సిందే

ట్రంప్‌ సుంకాలపై ఆటోమొబైల్‌ విడి భాగాల తయారీ కంపెనీలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతుక్కోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఈ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఏపీఎంఏ జాతీయ అధ్యక్షురాలు శ్రద్ధా సూరి మార్వా తెలిపారు.


ప్రభుత్వం చేయూత !

ప్రస్తుత పరిస్థితి నుంచి పరిశ్రమ వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పెద్ద సంఖ్య లో ఉద్యోగాలు కల్పిస్తున్న ఎగుమతి ఆధారిత వస్త్ర, తోలు ఉత్పత్తులు, రత్నాభరణాలు, ఆటో మొబైల్‌ విడి భాగాలు, రసాయన కంపెనీల కోసం ప్రత్యేక రాయితీలు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఫార్మాకు ఊరట

సుంకాల విషయంలో ట్రంప్‌ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారు. భారత వస్తు దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌.. ఫార్మా, ఐటీ సేవలను మాత్రం మినహాయించారు. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికాలో ఔషధాల ధరలు మూడింతలు ఎక్కువ. దీనిపై అమెరికన్లు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్‌ నుంచి చౌకగా వచ్చే జెనరిక్‌ ఔషధాలపైనా 50 శాతం సుంకాలు విధిస్తే అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ట్రంప్‌ భారత ఫార్మా దిగుమతులను సుంకాల నుంచి మినహాయించారని ఫార్మాగ్జిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో విక్రయించే జెనరిక్‌ ఔషధాల్లో 40ు మన దేశం నుంచే ఎగుమతవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సుంకాల మినహాయింపు తాత్కాలికమేనని ట్రంప్‌ స్పష్టంగా ప్రకటించారు. దీంతో కొన్ని ఫార్మా కంపెనీలు అమెరికాలోనే యూనిట్లు పెట్టి అక్కడే ఔషధాలు ఉత్పత్తి చేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 06:01 AM