Share News

ఫార్మా కంపెనీలకు ట్రంప్‌ అల్టిమేటం

ABN , Publish Date - May 13 , 2025 | 03:29 AM

సుంకాల పోటుతో ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి ఇప్పుడు ఫార్మా కంపెనీలపై పడింది. ఇక నుంచి అమెరికాలో ఔషధాలను విక్రయించే ఫార్మా కంపెనీలు...

ఫార్మా కంపెనీలకు ట్రంప్‌ అల్టిమేటం

  • నెల రోజుల్లో ధరలు తగ్గించాల్సిందే

  • లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

  • భారత్‌లో పెరగనున్న ఔషధాల ధరలు!

  • ఎగుమతులపైనా ప్రభావం

న్యూఢిల్లీ: సుంకాల పోటుతో ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి ఇప్పుడు ఫార్మా కంపెనీలపై పడింది. ఇక నుంచి అమెరికాలో ఔషధాలను విక్రయించే ఫార్మా కంపెనీలు.. అమెరికాతో అత్యంత ప్రాధాన్యతా హోదా (ఎంఎ్‌ఫఎన్‌) ఉన్న దేశాల్లో.. ఏ దేశంలో తక్కువ ధరకు తమ ఔషధాలను అమ్ముతాయో, అదే ధరను తమ దేశంలో అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. డాక్టర్ల సిఫారసు (ప్రిస్కిప్షన్‌)పై అమ్మే ఔషధాలకు ఇది వర్తిస్తుంది. దీంతో అమెరికాలో ఈ ఔషధాల ధరలు 30 నుంచి 80 శాతం వరకు తగ్గుతుందన్నారు. నెల రోజుల్లో ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ధరలు తగ్గించకపోతే ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాల ద్వారా దీన్ని అమలు చేస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ మరీ హెచ్చరించారు.

వర్ధమాన దేశాలకు ఇబ్బందే: అమెరికా ఈ విధానాన్ని అమలు చేస్తే భారత్‌తో సహా అనేక దేశాల్లో ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఫార్మా కంపెనీలు తమ పేటెంట్‌, ఆఫ్‌ పేటెంట్‌ ఔషధాలను విస్తృత మార్కెట్‌ లేదా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేరుగా లేదా స్థానిక ఫార్మా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ధరలు తగ్గించి ఇతర దేశాల్లో అమ్ముతుంటాయి. ట్రంప్‌ ఆదేశాలు అమల్లోకి వస్తే ఇక అది కుదరకపోవచ్చు. ఈ కంపెనీలు తమ లాభాలను కాపాడుకునేందుకు అమెరికాతో సమాన స్థాయిలో వర్థమాన దేశాల్లోనూ ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. అదే జరిగితే అనేక దేశాల్లోని పేదలకు ప్రిస్కిప్షన్‌ ఔషధాలు భారమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.


ఎగుమతులకూ దెబ్బే: ట్రంప్‌ అన్నంత పని చేస్తే ఆ ప్రభావం మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలపైనా పడనుంది. మన దేశం నుంచి ఏటా 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.59,500 కోట్లు) విలువైన ఔషధాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికాలో తమ లాభాలను కాపాడుకునేందుకు ఈ కంపెనీలు ఇక దేశంలోనూ తమ ధరలను పెంచాల్సి ఉంటుంది. అంతేగాక అమెరికా, జపాన్‌, ఈయూ దేశాల ఫార్మా కంపెనీలు తమ పేటెంట్‌ హక్కులనూ మరింత గట్టిగా అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకపోతే ఈ కంపెనీలు కొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి కోసం చేసే ఖర్చులు రాబట్టుకోవడం కష్టమవుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 03:29 AM