బడ్జెట్‌పై మధ్య తరగతి గంపెడాశలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:59 AM
కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతోంది. శనివారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించబోతున్నారు. ధరల పోటుతో మధ్య తరగతి ఆదాయాలు...

బడ్జెట్2025-26
నిర్మలమ్మ మురిపిస్తారా? మాయ చేస్తారా?
పన్ను పోటు తగ్గితేనే జీడీపీకి ఊతం
కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతోంది. శనివారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించబోతున్నారు. ధరల పోటుతో మధ్య తరగతి ఆదాయాలు కుంగిపోతున్నాయి. ధరలు పెరిగినంత వేగంగా ప్రజల ఆదాయాలు పెరగడం లేదు. ఐటీతో సహా అనేక రంగాల్లో ఉద్యోగ నియామకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే సుమారు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలా ఉంటే బాగుంటుంది? పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల కోరికల చిట్టాపై ఒక లుక్కేద్దాం.
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మధ్య తరగతి చితికిపోతోంది. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా, వీరి ఆర్థిక భారం తీరడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటూ గణనీయంగా తగ్గింది. గత ఏడు త్రైమాసికాల్లో ఎన్నడూ లేని విధంగా 5.4 శాతానికి పడిపోయింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తానికి జీడీపీ వృద్ధి రేటు 6 శాతం మించడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, ఆమె టీమ్ ప్రవేశపెట్టే రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌పై అటు మధ్య తరగతితో పాటు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలూ గంపెడాశలు పెట్టుకున్నాయి.
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
గత ఏడాది ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను విధానం కింద రూ.3 లక్షల వార్షికాదాయం వరకు పన్ను పోటు లేదు. అదే పాత విధానాన్ని ఎంచుకుంటే ఈ పరిమితి రూ.2.5 లక్షలు మాత్రమే. దీన్ని 2014లో నిర్ణయించారు. గత ఐదేళ్లలో ధరల సెగ ఏటా సగటున 5.7 శాతం చొప్పున పెరిగింది. ఈ లెక్కన చూస్తే ఎప్పుడో 2014లో నిర్ణయించిన రూ.2.5 లక్షల విలువ ప్రస్తుతం రూ.1.4 లక్షలు మాత్రమే. 2014 నాటి జీవన ప్రమాణాలతో నివసించాలంటే వచ్చే బడ్జెట్‌లో అయినా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలి. దీనికితోడు ప్రస్తుతం రూ.15 లక్షలకు మించిన వార్షికాదాయం ఉన్న వారు 30 శాతం పన్ను శ్లాబులోకి వస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్‌లో అయినా ఆర్థిక మంత్రి ఈ శ్లాబులోకి వచ్చే వార్షిక ఆదాయ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
పొదుపు ఖాతా వడ్డీ పరిమితి పెంచాలి
ప్రస్తుతం బ్యాంకు పొదుపు ఖాతాలోని మొత్తాలపై వచ్చే వార్షిక వడ్డీ రూ.10,000 మించితే పన్ను పోటు తప్పదు. ఈ మొత్తాన్ని 2013లో నిర్ణయించారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దీని విలువ రూ.5,000 మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని కనీసం రూ.20,000కైనా పెంచాలని వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దీనికి తోడు ప్రజల్లో దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు మూడేళ్లకు మించిన కాలపరిమితి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని దీర్ఘకాలిక మూలధన లాభాల కింద పరిగణించి 12.5 శాతం, అంత కంటే తక్కువ కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను పోటు ఉండాలని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.
80 సీ పరిమితి చాలదు
మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులకు ప్రధాన ఊరట ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద లభించే మినహాయింపులే. ప్రస్తుతం పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఈ సెక్షన్ కింద వివిధ ఖర్చులు, పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా ఎప్పుడో 2015లో సవరించారు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఇది కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలైనా ఉండాలని మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దీనికి తోడు ఈ సెక్షన్ కింద మరో సబ్ సెక్షన్ చేర్చి పిల్లల చదువుల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపై రూ.50,000 వరకు, గృహ రుణాలపై చెల్లించే అసలుకు రూ.50,000 వరకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని మధ్య తరగతి ప్రజానీకం కోరుతోంది.
రియల్టీ పరిశ్రమ
ప్రస్తుతం దేశంలో రియల్టీ పరిశ్రమ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ నివాసాలకు తప్ప, మిగతా వాటికి పెద్దగా గిరాకీ లేదు. నిజానికి గత ఏడాది దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో రూ.కోటి కంటే తక్కువ ధర ఉండే నివాస గృహాల అమ్మకాలు 36 శాతం పడిపోయాయి. హైదరాబాద్‌లో అయితే ఈ పతనం మరింత ఎక్కువగా 69 శాతం వరకు ఉంది. ఆదాయాలు పడిపోవటం, ఇళ్ల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కనీసం బడ్జెట్‌లో తమ గోడు పట్టించుకోవాలని స్థిరాస్తి రంగం కోరుతోంది. ఎప్పటి నుంచో కోరుతున్న మౌలిక పరిశ్రమ హోదా, ఇళ్ల కొనుగోలుదారులకు మరిన్ని పన్ను రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతోంది.
నేడు ఆర్థిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం 2024-25 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఏటా కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు ఆర్థిక మంత్రి ఈ సర్వేను పార్లమెంట్‌కు సమర్పించటం ఆనవాయితీ. ఈ సర్వేను కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సూచికగా భావిస్తారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోవటం, జీడీపీ వృద్ధి రేటు, డిమాండ్ మందగించిన నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
బీమా ప్రీమియం
ప్రస్తుతం పాత పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకునే 60 ఏళ్ల లోపు వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఏటా ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై రూ.25,000 వరకే ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తోంది. సీనియర్ సిటిజన్లు తమ ఆదాయాల నుంచి చెల్లిస్తే రూ.50,000 వరకు, అదే వారి పిల్లలు చెల్లిస్తే రూ.75,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. ప్రస్తుత ధరల సెగ ప్రకారం చూస్తే ఇది ఏ మాత్రం చాలదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.50,000కు, సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.75,000కు, తల్లిదండ్రులైన సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా కోసం వారి పిల్లలు చెల్లించే ప్రీమియం పరిమితిని రూ.లక్షకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పారిశ్రామిక రంగం కోరికల చిట్టా
ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే జీడీపీ వృద్ధి రేటు పెంపు, ఉపాధి కల్పన, డిమాండ్ పెంపు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచి కీలకమైన మధ్య తరగతి చేతిలో మిగులు ఆదాయం పెంచాలని కోరింది. లేకపోతే వినియోగ ఆధారితమైన మన ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి రేటు గాడినపడటం కష్టమని స్పష్టం చేసింది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోవటానికి వినియోగ డిమాండ్ నీరసించటమే ప్రధాన కారణమనే విషయాన్ని పారిశ్రామిక వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మరోవైపు చైనా నుంచి చౌకగా వచ్చిపడుతున్న దిగుమతులను కట్టడి చేయాలని కోరింది.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News