టీసీఎస్.. ప్చ్!
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:08 AM
మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నిరాశాజనకంగా ప్రారంభమైంది. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) పనితీరు మార్కెట్,,,

క్యూ4 లాభంలో 1.68% క్షీణత
ఒక్కో షేరుకు రూ.30 డివిడెండ్
రూ.12,224 కోట్లకు పరిమితం
ఆదాయం రూ.64,479 కోట్లు
ముంబై: మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నిరాశాజనకంగా ప్రారంభమైంది. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్) పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. క్యూ4లో టీసీఎస్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1.68 శాతం తగ్గి రూ.12,224 కోట్లకు పరిమితమైంది. ఆదాయం మాత్రం 5.3 శాతం వృద్ధితో రూ.64,479 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలానికి స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం పెరిగింది. నిర్వహణ మార్జిన్ 24.2 శాతంగా, నికర మార్జిన్ 19 శాతంగా నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ తన వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.30 తుది డివిడెండ్ ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలోనూ ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌తో పాటు రూ.66 ప్రత్యేక డివిడెండ్‌ను సైతం చెల్లించింది. క్యూ1, క్యూ2ల్లోనూ రూ.10 చొప్పున డివిడెండ్ పంచింది.
3,000 కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం
పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం కంపెనీ నికర లాభం 5.76 శాతం పెరుగుదలతో రూ.48,553 కోట్లకు, ఆదాయం 5.99 శాతం వృద్ధితో రూ.2,55,324 కోట్లకు (అమెరికా కరెన్సీలో 3,000 కోట్ల డాలర్ల పైమాటే) చేరుకుంది. కంపెనీ వార్షికాదాయం తొలిసారిగా 3,000 కోట్ల డాలర్ల స్థాయిని చేరుకోవడంతో పాటు వరుసగా రెండో త్రైమాసికంలో బలమైన ఆర్డర్ బుక్‌ను సాధించడం సంతోషంగా ఉందని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ ఆవిష్కరణల్లో అనుభవంతో పాటు కస్టమర్లతో సత్సంబంధాలు, అంతర్జాతీయ వ్యాప్తి ప్రస్తుత ఆర్థిక అనిశ్చితిలో క్లయింట్లకు కంపెనీని దన్నుగా నిలిపాయన్నారు. కస్టమర్ల కీలక ప్రాధాన్యాల సాధనలో తోడ్పడే విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు.
1,220 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1,220 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి లభించిన కాంట్రాక్టులు 3,940 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
సీఓఓగా ఆర్తి సుబ్రమణియన్
టీసీఎస్ రెండు కీలక నియామకాలను జరిపింది. ఆర్తి సుబ్రమణియన్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా ఐదేళ్ల కాలానికి నియమించినట్లు కంపెనీ తెలిపింది. మే 1 నుంచి సుబ్రమణియన్ కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు.ప్రస్తుతం ఆమె టాటా సన్స్‌లో గ్రూప్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీసీఎ్‌సలో డైరెక్టర్ కూడా. కాగా, మంగేశ్ సాథేను చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా నియమించినట్లు టీసీఎస్ ప్రకటించింది.
సుంకాలతో సవాళ్లే..
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత మెరుగుపడనుందని టీసీఎస్ సారథి కృతివాసన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్ సుంకాలతో ఐటీ సేవల రంగమూ సవాళ్లు ఎదుర్కోనుందన్నారు. సుంకాలతో ఆర్థిక అనిశ్చితి పెరిగి నేపథ్యంలో క్లయింట్లు ఐటీ వ్యయ నిర్ణయాలను జాప్యం చేస్తున్నారు. కొందరు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, భారీ ప్రాజెక్టులు జాప్యం కాలేదన్నారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందని, క్లయింట్ల ఐటీ వ్యయాలు క్రమంగా పుంజుకుంటున్నాయని మూడు నెలల క్రితం చెప్పాం. కానీ, సుంకాల కారణంగా పరిస్థితులు మళ్లీ మారాయన్నారు.
జీతాల పెంపు వాయిదా
ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు మరింత పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉన్న జీతాల పెంపును వాయిదా వేసినట్లు టీసీఎస్ వెల్లడించింది. మార్కెట్లో ఆర్థిక అనిశ్చితులు తగ్గుముఖం పట్టి, భవిష్యతపై కొంత స్పష్టత వచ్చాక సరైన సమయంలో వేతనాలను పెంచనున్నట్లు చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఈసారి 42,000 ఫ్రెషర్ల నియామకాలు
గత ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల (క్యాంపస్ హైరింగ్) ద్వారా 42,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకున్నట్లు టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 42,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2024-25 క్యూ4లో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికరంగా 625 పెరిగి మొత్తం 6,07,979కి చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల నికర పెరుగుదల 6,433గా నమోదైంది. కాగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లో మాత్రం ఉద్యోగుల సంఖ్య 13,200కు పైగా తగ్గింది. కాగా, మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతానికి పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 13 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి