TCS Job Cuts: టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపులు.. ఈ త్రైమాసికంలో ఏకంగా..
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:22 PM
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో దాదాపు 20 వేల మంది టీసీఎస్ ఉద్యోగులు ఉద్వాసనకు గురైనట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. వీరిలో అధిక శాతం మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులని టీసీఎస్ మానవవనరుల విభాగం అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సాంకేతికతతో ముంచుకొస్తున్న మార్పులు, అమెరికా-భారత్ వాణిజ్య ప్రతిష్ఠంభనల నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల తొలగింపునకు దిగిన విషయం తెలిసిందే. గత రెండేళ్లల్లో తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మార్కు దిగువకు చేరుకుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ తన సిబ్బంది సంఖ్యను 19,755 మేరకు తగ్గించింది. దీంతో, కేవలం మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 20 వేల మంది సంస్థను వీడినట్టైంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, తాజా త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 19,755 మేర తగ్గింది. వీరిలో కొందరు స్వచ్ఛందంగా సంస్థను వీడగా మరికొందరు లేఆఫ్స్‌కు గురయ్యారు. ఇక ఉద్వాసనకు గురైన ఉద్యోగుల పరిహారాల చెల్లింపుల కోసం సంస్థ రూ.11.35 బిలియన్‌లను కేటాయించింది (TCS Job Cuts).
సంస్థను వీడిన వారిలో ఎక్కువగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సందీప్ కున్నుమల్ తెలిపారు. నైపుణ్యాలు, అవసరాల మధ్య పొంతన కుదరక తొలగింపులు తప్పలేదని అన్నారు. మార్చి 2026 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా సిబ్బంది సంఖ్యను రెండు శాతం మేర తగ్గించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సగం మేర టార్గెట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత సర్వీసుల వైపు మళ్లే క్రమంలో ఉద్యోగుల సంఖ్యలో కూడా మార్పులు చేస్తోంది.
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో యూఎస్ వర్క్ వీసాలపై ఆధారపడకుండా టీసీఎస్ చర్యలు తీసుకుంటోంది. వలసల విధానాల్లో మార్పులను అనుగుణంగా తమ బిజినెస్ మోడల్ మారుతుందని కన్నుమల్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టు ఏఐ, మెషీన్ లర్నింగ్, డాటా ఎనలిటిక్స్ నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటామని తెలిపారు. భారత ఐటీ రంగంలో మార్పులకు ఇది సూచనకమని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
డిజిటల్ చెల్లింపుల రంగంపై దృష్టి.. పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేసిన జోహో
రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి..!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి