Suzuki India Investment: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ 70000 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:41 AM
భారత్‌లో సంస్థ కార్యకలాపాలు పటిష్ఠం చేయడంపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ దృష్టి సారించింది. వచ్చే ఐదారేళ్ల కాలంలో ఇందుకోసం రూ.70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది....
ఈ-విటారా ఎగుమతులను
ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ,
తొషిహిరో సుజుకీ
సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ
హన్సల్‌పూర్ (గుజరాత్): భారత్‌లో సంస్థ కార్యకలాపాలు పటిష్ఠం చేయడంపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ దృష్టి సారించింది. వచ్చే ఐదారేళ్ల కాలంలో ఇందుకోసం రూ.70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఎగుమతులను, లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ తయారీ విభాగాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. తమ పెట్టుబడి ప్రణాళికలను వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా భారత మొబిలిటీ యానంలో సుజుకీ చురుకైన భాగస్వామిగా ఉన్నదని, పర్యావరణహితమైన హరిత మొబిలిటీని ప్రోత్సహించాలన్న భారత్ విజన్‌కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ఏడాదికి 40 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం సాధించడం, అందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్ అండ్ డీ ఏర్పాటు, కొత్త టెక్నాలజీలపై ఈ పెట్టుబడులుంటాయని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. రూ.35,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు గత ఏడాది ప్రకటించిన రెండో ప్లాంట్ నిర్మాణం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ జీఎ్‌సటీ కౌన్సిల్ సమావేశం అనంతరం దానికి తాను సమాధానం చెప్పగలుగుతానన్నారు. మారుతి సుజుకీ ఇండియా భాగస్వామిగా ఉన్న సుజుకీ గ్రూప్ ఇప్పటికే దేశంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో అందుకు సంబంధించిన విభాగాల్లో 11 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని భార్గవ అన్నారు. ఈ-విటారా ఎగుమతి మార్కెట్ల కోసం తయారు చేస్తున్నామని, దేశీయ మార్కెట్లో దాన్ని విడుదల చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ఏదీ పెట్టుకోలేదని ఆయన వెల్లడించారు. ఆ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయకపోవడానికి ఎగుమతి కట్టుబాట్లతో పాటు ధర కూడా ప్రధానమని చెప్పారు. బ్యాటరీల దిగుమతి కారణంగా దేశంలో ఈవీల ధరలు అధికంగా ఉన్నాయన్నారు. గుజరాత్ ప్లాంట్‌లో తయారైన మేడ్ ఇన్ ఇండియా ఈ-విటారాను జపాన్, యూరప్ సహా 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు ఆయన చెప్పారు. 10 లక్షల కార్ల తయారీ లక్ష్యంతో ఈ యూనిట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ హబ్ కానుందని ఆయన వెల్లడించారు. కాగా దేశంలో తొలి లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ ప్రారంభించడాన్ని ఒక మైలురాయిగా సుజుకీ అభివర్ణించారు.
లిథియం సరఫరానే పెద్ద సమస్య
లిథియం కోసం మనం చైనాపై అధికంగా ఆధారపడాల్సి రావడమే పెద్ద సమస్య అని, అందుకే బ్యాటరీ సెల్స్ తయారీ విభాగంలో భారీ ఎత్తున ప్రవేశించేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంలేదని భార్గవ అన్నారు. వెలుపలి సరఫరాలపై ఆధారనీయత తగ్గించుకోగల ప్రత్యామ్నాయ టెక్నాలజీలను భారత శాస్త్రవేత్తలు కనుగొనగలరన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని పేర్కొంటూ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు రూ.20,000 కోట్ల పెట్టుబడి అవసరమన్నది పరిశ్రమ అంచనా అని చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చినా ముడిసరుకు లేకపోవడం అనేది పెద్ద రిస్క్‌గా అంచనా వేయవచ్చన్నారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి