Share News

India Credit Rating: భారత్‌ రేటింగ్‌ పెంపు

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:43 AM

భారత్‌ మృత ఆర్థిక వ్యవస్థ అని నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశానికే చెందిన ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ‘ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌’ గట్టి...

India Credit Rating: భారత్‌ రేటింగ్‌ పెంపు

భారత్‌ రేటింగ్‌ పెంపు

మైనస్‌ బీబీబీ నుంచి బీబీబీకి అప్‌గ్రేడ్‌ చేసిన ఎస్‌ అండ్‌ పీ

818 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

8భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

8ట్రంప్‌ సుంకాల పోటు ఉండదు

8అందుకే పరపతి రేటింగ్‌ పెంచుతున్నాం

న్యూఢిల్లీ: భారత్‌ మృత ఆర్థిక వ్యవస్థ అని నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశానికే చెందిన ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ‘ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌’ గట్టి సమాధానం ఇచ్చింది. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు చాలా పటిష్ఠంగా ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత దేశ సార్వభౌమ పరపతి రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్‌’ స్థాయి నుంచి ‘బీబీబీ’ స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించింది. గత 18 సంవత్సరాల్లో ఈ సంస్థ మన దేశ పరపతి రేటింగ్‌ను పెంచడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సుంకాల పోటు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, హుషారుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పరపతి రేటింగ్‌ పెంపుతో కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు తక్కువ వడ్డీకే విదేశాల నుంచి రుణాలు, నిధులు సమీకరించగలుగుతాయని భావిస్తున్నారు.


వృద్ధికి ఢోకా లేదు

ట్రంప్‌ సుంకాల కత్తి వేలాడుతున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటుకు ఎలాంటి ఢోకా ఉండదని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ అంచనా. గత ఆర్థిక సంవత్సరంలోలానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని తెలిపింది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది.

పెట్టుబడులకు

ఊతం!

పరపతి రేటింగ్‌ పెంపు విదేశాల నుంచి మన దేశం మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకూ దోహదం చేయనుంది. ఈ రేటింగ్‌ పెంపుతో మన దేశ మధ్య, దీర్ఘకాలిక అవకాశాలపై దేశ, విదేశీ పెట్టుబడిదారులకు మరింత నమ్మకం ఏర్పడనుంది. దీంతో ఎఫ్‌పీఐలతో పాటు విదేశీ కంపెనీలూ మన దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ట్రంప్‌ సుంకాలతో అనిశ్చితిలో పడిన భారత ఆర్థిక వ్యవస్థకు ఈ పరపతి రేటింగ్‌ పెంపు పెద్ద ఊరట అని మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ డైరెక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి చెప్పారు. ఈ రేటింగ్స్‌ ప్రభావం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకం రేటు స్థిరపడేందుకూ దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా.

అమెరికా రేటింగ్‌ మాత్రం కిందికి..

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టిన మూడు నెలలకే అంటే మే నెలలో మూడీస్‌ రేటింగ్స్‌.. అమెరికా పరపతి రేటింగ్‌ను ట్రిపుల్‌ ఏ నుంచి డబుల్‌ ‘ఏ’కు తగ్గించింది. అంతకుముందు ఫిచ్‌ రేటింగ్స్‌ కూడా 2023 ఆగస్టులో అమెరికా పరపతి రేటింగ్‌ను ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ నుంచి డబుల్‌ ఏ రేటింగ్‌కు తగ్గించింది. అప్పటి నుంచే అమెరికాలో వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. తాజాగా ట్రంప్‌ సుంకాల పోటు, అర్థంపర్థం లేని ఆర్థిక విధానాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:43 AM